27-03-2025 01:15:59 AM
హైదరాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): తెలంగాణ విద్యావ్యవస్థ ప్రమాదం అంచున ఉన్నదని, రోజురోజుకూ ప్రమాణా లు పడిపోతున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా ప్రమాణాలపై కేవలం ప్రభుత్వమే కాకుండా తెలంగా ణ సమాజం కూడా బాధ్యత వహించాలని పేర్కొన్నారు. బుధవారం మండలిలో విద్యాశాఖలో తేవాల్సన మార్పులపై సుదీర్ఘ చర్చ జరిగింది.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఐదో తరగతి విద్యార్థులు రెండో తరగతి పాఠ్యపుస్తకాలను కూడా చదవలేని పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2021లో జరిగిన నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే ఫలితాల ప్రకారం మూ డో తరగతి, ఐదో తరగతి చదివేవారిలో 75 శాతం మంది విద్యార్థులు ఏ సబ్జెక్టులో కనీస ప్రాథమిక సామర్థ్యం కూడా చూపలేదని తేలిందన్నారు.
సబ్జెక్టులవారీగా దేశంలో 37 ర్యాంకుల్లో తెలంగాణ.. మూడో తరగతికి సంబంధించి తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో 36వ ర్యాంకు, గణితంలో 35వ ర్యాంకు, ఈవీఎస్‌లో 36వ ర్యాంకులో ఉన్నట్టు సర్వేలో తేలిందని చెప్పారు. మూడో తరగతిలో ఉండి రెండో తరగతి పుస్తకాలు చదవగలిగినవారు 2018లో 18.1 శాతం ఉంటే, 2022లో 5.2 శాతం, 2024లో 6.3శాతం మాత్రమే ఉన్నారని చెప్పారు.
5వ తరగతిలో ఉండి కనీసం రెండో తరగతి పుస్తకాలు చదవగలిగిన వారు 2018లో 43.6 శాతం మంది ఉంటే, 2022లో 31.7 శాతం, 2024 లో 31.5శాతానికి తగ్గారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక సంఖ్య 6.50 లక్షలు తగ్గిందని సీఎం పేర్కొన్నారు.
విద్యా ప్రమాణాల విషయంలో ప్రక్షాళన మొదలు పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. విద్యాశాఖలో ప్రక్షాళన మొదలు పెడదామంటే రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాల కోసం అడ్డుకునే ప్రయ త్నం చేస్తున్నాయని ఆరోపించారు. రెగ్యులర్ ఎడ్యుకేషన్‌ను స్ట్రీమ్ లైన్ చేయాలని ఆలోచన చేస్తున్నామని సీఎం వివరించారు.
ఒక్కో విద్యార్థిపై రూ.1.08 లక్షలు ఖర్చు
తమ ప్రభుత్వం రాగానే 11 వేల మంది టీచర్ల ఉద్యోగాలు భర్తీ చేశామని, 21వేల మందికి పదోన్నతులు కల్పించామని, 36 వేల మంది టీచర్ల బదిలీలను ఎలాంటి ఆరోపణలు లేకుండా పూర్తి చేశామన్నారు. బడ్జెట్‌లో విద్యాశాఖకు రూ.19,341 కోట్లు కేటాయించామని, ఒక్కో స్కూల్‌లో ఒక్కో విద్యార్థిపై రూ.1.08లక్షలు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. ఇంత ఖర్చు చేస్తున్న తమ ప్రభుత్వం ఎక్కడ విఫలమైందో చెప్పాలని ప్రతిపక్ష సభ్యులను డిమాండ్ చేశారు.
అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యంలేదు
సమాజంలో అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థుల్లో నైపుణ్యం కొరవడుతుందని సీఎం పేర్కొన్నారు. అందుకే ఇంజినీరింగ్ చదివిన పట్టభద్రుడు రూ.15 వేల వేతనానికి పని చేస్తున్నాడని చెప్పారు. యువతలో నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు.
ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామన్నారు. కాలం చెల్లిన కోర్సులకు స్వస్తి చెప్పి వంద నియోజకవర్గాల్లో వంద ఏటీసీలను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు.
ఎమ్మెల్సీ కవితకు సీఎం కౌంటర్
పాలమూరు రంగారెడ్డికి ప్రాజెక్టుకు సీఎం రేవంత్‌రెడ్డి అంబేద్కర్ పేరు తీసేసి జైపాల్‌రెడ్డి పేరు పెట్టారని ఎమ్మెల్సీ కవిత మండలిలో పేర్కొన్నారు. అలాగే, రూ.8వేల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఎప్పు డు చెల్లిస్తారో చెప్పాలని అడిగారు. కవిత వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు.
పాలమూరు రంగారెడ్డికి గతంలో ఏ పేరు లేదని, అందుకే పాలమూరు ఎత్తిపోతలకు జైపాల్‌రెడ్డి పేరు పెట్టామన్నారు. హైదరాబాద్‌కు మెట్రో రావడానికి కారణం జైపాల్‌రెడ్డి అని, బీఆర్‌ఎస్ కోరుకుంటే మెట్రోకు కూడా ఆయన పేరుపెట్టినా తప్పులేదన్నారు. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లిస్తామన్నారు.