విద్యార్థులకు కనీసం యూనిఫాం ఇవ్వలేదు..
‘సీఎం బ్రేక్ ఫాస్ట్’ను పక్కన పెట్టారు..
సీఎం రేవంత్‌కు మాజీ మంత్రి హరీశ్ లేఖ
హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ నిర్వీర్యమవుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరో పించారు. ఆదివారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యావ్యవస్థ గాడి తప్పిందని పేర్కొన్నారు. సర్కార్ బడులను టీచర్ల కొరత, పాఠ్యపుస్తకాలు, వసతుల లేమి వెంటాడుతున్నాయన్నారు. సీఎం పాలనను పక్కన పెట్టి రాజకీయాలకు ప్రాధాన్య మిస్తున్నారని మండిపడ్డారు.
కొన్ని స్కూళ్ల లో విద్యార్థులకు సన్న బియ్యానికి బదులు ముక్కిన బియ్యం వండి పెడతున్నారని, కోడిగుడ్లు సరఫరా చేసే వారికి సైతం బిల్లులు చెల్లించడం లేదన్నారు. కనీసం యూనిఫాం ఇవ్వలేకపోవడం సిగ్గుచేటన్నారు. పొద్దున్నే బడికి వెళ్లిన పిల్లలకు అల్పాహారం అందించేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ‘సీఎం బ్రేక్ ఫాస్ట్’ పథకాన్ని అమలు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని దుయ్యబట్టారు. ఉపాధ్యాయుల ఖాళీలు భర్తీ చేయకపోవడంతో సిలబస్ ముందుకు సాగడం లేదన్నా రు. సీఎం స్పందించి మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న 54,201 మంది కుక్ కం హెల్పర్లకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. భోజన బిల్లులు, కోడిగుడ్ల బిల్లులను కూడా విడుదల చేయాలన్నారు. విద్యార్థుల ఆకలి తీర్చేందుకు సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్నీ కొనసాగించాలన్నారు.