calender_icon.png 19 April, 2025 | 4:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యను ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించాలి

27-03-2025 10:47:15 PM

ప్రైవేటు విద్యా వ్యవస్థను రద్దు చేయాలి..

కామన్‌ స్కూల్‌ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలి..

టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్..

కామారెడ్డి (విజయక్రాంతి): తెలంగాణలో ప్రస్తుత విద్యారంగ పరిస్థితులపైన ఈనెల 26న తెలంగాణ శాసన మండలిలో చర్చ జరగడం సంతోషకరమని టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్ కుమార్ అన్నారు. విద్యా నాణ్యతలో వెనుకబడి ఉన్నామని, విద్యారంగం సంక్షోభంలో ఉన్నదని ఒకవైపు మాట్లాడుతూనే మరొకవైపు విద్యారంగానికి నిధులు కేటాయించడంలో మొండిచేయి చూపుతున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యారంగానికి కేటాయిస్తామన్న 15% నిధులను బడ్జెట్లో కేటాయించకుండా కేవలం 7.57 శాతం నిధులు కేటాయించడం వల్ల విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతుందన్నారు. అనివార్యంగా ప్రైవేటు పాఠశాలల వైపు ప్రజలను మళ్లించడమే అవుతుందన్నారు.

100 ఇంటర్నేషనల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ల ఏర్పాటు కోసం విద్యాశాఖకు కేటాయించిన బడ్జెట్లో సగం నిధులను కేటాయించి రాష్ట్రంలో ఉన్న 26వేల ప్రభుత్వ పాఠశాలల్లో, 1,023 రెసిడెన్షియల్‌ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఆ పాఠశాలల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పాలకులు విద్యారంగానికి చాలా తక్కువగా నిధులను రాష్ట్ర బడ్జెట్లో కేటాయించడం వల్లనే మన రాష్ట్రం, ప్రభుత్వ బడుల వసతుల కల్పనలో దేశంలో 32వ స్థానంలో, సమర్థవంతంగా బడుల నిర్వహణలో దేశంలో 27వ స్థానంలో ఉన్నదన్నారు.

ప్రాథమిక పాఠశాలలో ప్రతి తరగతికి ఒక గది ఒక టీచర్ను కేటాయించకపోవడం, ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయుని నియమించకపోవడం, పదుల సంవత్సరాలుగా ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసు రూల్స్‌ అపరిస్కృతంగా ఉండడం వల్ల విద్యాశాఖలో ఎంతో ప్రాధాన్యత ఉన్న పర్యవేక్షణ పోస్టులను ప్రభుత్వము భర్తీ చేయకపోవడం వల్ల, పాఠశాలలలో ఎల్లప్పుడు ఉపాధ్యాయుల కొరత లేకుండా ఒక నిర్ధిష్టమైన ఉపాధ్యాయ నియామకాలు, బదిలీలు, ప్రమోషన్ల ప్రణాళికలు రూపొందించకపోవడం వల్ల, పాఠశాలలకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించకుండా సరైన పద్ధతిలో పాఠశాలలకు నిధులు కేటాయించకపోవడం వల్ల విద్య నాణ్యతలో వెనుకబడి ఉన్నామన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ పాలకులు గుర్తించాలన్నారు. ప్రభుత్వం విద్యారంగంలో తీసుకువస్తున్న అస్తవ్యస్త విధానాల వల్ల ప్రభుత్వ విద్య పట్ల సమాజానికి విశ్వాసం సన్నగిల్లి ప్రభుత్వ పాఠశాలల్లో రోజుకు రోజు సంఖ్య తగ్గుతూ వస్తున్నదన్నారు.

ప్రభుత్వం సంఖ్య తగ్గడానికి గల కారణాలను విశ్లేషించకుండా తక్కువ సంఖ్య ఉన్న బడులను మూసివేసే ప్రయత్నం చేస్తూ మండలానికి రెండో మూడో పాఠశాలలను మాత్రమే కొనసాగించే ప్రయత్నం చేయడమనేది ప్రైవేటు వ్యవస్థను బలోపేతం చేయడానికే ఉపయోగపడుతుందన్నారు. పేద పిల్లల విద్య పట్ల ప్రభుత్వ బడుల పరిరక్షణ పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నట్లయితే విద్యారంగ ప్రక్షాలనకు పూనుకొని ప్రైవేటు విద్యా వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని టిపిటిఎఫ్‌ డిమాండ్‌ చేస్తున్నదన్నారు. ప్రభుత్వ ఆధీనంలో వివిధ యాజమాన్యాల కింద కొనసాగుతున్న వివిధ రకాల పాఠశాలలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలన్నారు.

ఒక ఆవాస ప్రాంతంలో ఉన్న బడి ఈడు పిల్లలందరూ ఆవాస ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ బడిలోనే చదివే విధంగా నైబర్‌హుడ్‌ పాఠశాలలను ఏర్పాటు చేసి, కామన్‌ స్కూల్‌ విద్యా విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. కామన్‌ స్కూల్‌ విద్యా విధానం ద్వారా మాత్రమే విద్యార్థులందరికీ సమానమైన నాణ్యమైన శాస్త్రీయమైన విద్య అందుతుందన్నారు. దీని వల్ల ఒక్క ఉపాధ్యాయుని పిల్లలే కాకుండా ఉద్యోగుల, ప్రజా ప్రతినిధుల ప్రజలందరి పిల్లలు ఒకే దగ్గర చదువుకునే వాతావరణం ఏర్పడుతుంద న్నారు. తద్వారా ఉపాధ్యాయ, ఉద్యోగుల, ప్రజల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని టిపిటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ అనిల్ కుమార్, టిపిటీఎఫ్ ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతిలు అన్నారు.