24-02-2025 05:25:54 PM
తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవా వర్మ...
కూకట్ పల్లి (విజయక్రాంతి): పేద మధ్యతరగతి విద్యార్థుల చదువుల కోసం అక్షయ విద్యా కమ్యూనిటీ లెర్నింగ్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించడం హర్షించదగ్గ విషయమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ వర్మ అన్నారు. సోమవారం కూకట్ పల్లి ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ పీజేఆర్ నగర్ లో అక్షయ విద్యా ఫౌండేషన్, జిహెచ్ఎంసి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అక్షయ విద్య కమ్యూనిటీ లెర్నింగ్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ను ఆయన ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ వర్మ మాట్లాడుతూ... ఇక్కడి ప్రాంతంలో ఉంటున్న విద్యార్థులకు ఈ ట్రైనింగ్ సెంటర్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. పేదవాడి జీవితం మారాలంటే విద్య ఏకైక మార్గం అన్నారు.
ఎంతోమంది విద్యార్థులకు ఈ సంస్థ చేరదీసి వారికి ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తుందన్నారు. అనంతరం శేర్లింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మాట్లాడుతూ... అక్షయ విద్యా కమ్యూనిటీ లెర్నింగ్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ లో వందలాది మంది విద్యార్థులకు విద్యను అందిస్తూ వారు లక్ష్యాన్ని చేరేవరకు సంస్థ తోడ్పాటు ఇస్తుందన్నారు. విప్రో, గూగుల్ తో పాటు ప్రభుత్వ రంగ సంస్థలైన పోస్టల్ డిపార్ట్మెంట్, డీ.ఎ.స్సీలో ఉద్యోగాలు సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యలు రాణిస్తూనే తల్లిదండ్రులు, గురువులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్, కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్, యుసిడి అడిషనల్ కమిషనర్ చంద్రకాంత్ రెడ్డి, కూకట్పల్లి డిసి గంగాధర్, బాలానగర్ డిసిపి సురేష్ కుమార్, బాలానగర్ ఏసిపి హనుమంతరావు, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.