29-04-2025 12:43:02 AM
రెండు కాలేజీల్లో ఫీజుల మాయ
* రాష్ట్రంలోని శ్రీచైతన్య, నారాయణ జూనియర్ కాలేజీల ఇంటర్ అడ్మిషన్ల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నది. కార్పొరేట్ విద్య పేరుతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు గాలం వేస్తున్నాయి. ముందు వారిని కాలేజీ మెట్ల వరకు తీసుకొచ్చి, తర్వాత ఆ కోర్సు.. ఈ కోర్సు అంటూ, ప్రతి కోర్సుకు అదనంగా ఫీజు చెప్తున్నారు. రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి.
కాలేజీ ఫీజు, హాస్టల్ ఫీజు కాక.. స్పెషల్ సెక్షన్, ఏసీ, నాన్‌ఏసీ, ధోబీచార్జ్, మెటీరియల్ చార్జ్ పేరిట అదనంగా డబ్బులు దండుకుంటున్నాయి. ఇక జేఈఈ, నీట్, ఎప్‌సెట్ ఫీజుల సంగతి సరేసరి. ఇలా ఒక్కో విద్యార్థి ఏడాదికి రూ.1.25 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఫీజు కట్టాల్సిందే. ఫీజుల వసూళ్లలో యాజమాన్యాలు ఎలాంటి నిబంధనలు పాటించడం లేదనేది బహిరంగ సత్యం.
రాష్ట్రవ్యాప్తంగా 200 వరకు కార్పొరేట్ జూనియర్ కాలేజీలు ఉండగా, వీటిలో ఎక్కువగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్నాయి. వీటిలో నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలకు చెందిన బ్రాంచీలే ఎక్కువ. ఇవి ప్రధానంగా హైదరాబాద్ ఈస్ట్, వెస్ట్ పరిధిలో ఉంటాయి. ఈస్ట్, వెస్ట్ ప్రాంతాలను బట్టి కూడా ఈ కాలేజీలు ఫీజులు వసూలు చేస్తున్నాయని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): సాధారణంగా పదో తరగతి పరీ క్షలు మార్చిలో పూర్తవుతాయి. ఆ తర్వాత కాలేజీ యాజమాన్యాలు అడ్మిషన్లు ప్రారంభిస్తాయి. కానీ.. చైతన్య, నారా యణ కాలేజీలు మాత్రం అంతకముందు ఏడాది నవంబర్ నుంచే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభిస్తాయి. సాధారణంగా ఇంటర్ బోర్డు ఇక విద్యాసంస్థలు అడ్మిషన్ల ప్రక్రియ మొదలు పెట్టొచ్చని ప్రకట న జారీ చేస్తుంది.
శ్రీచైతన్య, నారాయణసంస్థలు మాత్రం ఆ నిబంధనలు పట్టించుకోవు. పీఆర్వోలు ప్రత్యేకంగా ప్రైవేటు స్కూళ్లకు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు తెలుసుకుని మరీ వారికి కాల్ చేస్తారు. అవసరమైతే నేరుగా ఇంటికి వెళ్తారు.
‘ముందే ఫీజు మాట్లాడుకుంటే తక్కువ ఫీజు, అడ్మిషన్లు చివర్లో వస్తే ఎక్కువ ఫీజు ఉండొచ్చు’ అని భయపడేలా చేస్తారు. అలా తల్లిదండ్రుల బలహీనతను ఆసరాగా చేసుకొని వచ్చే విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు తీసుకుంటారు.
ఒక్కో నెలలో.. ఒక్కోలా ఫీజు
గతేడాది అక్టోబర్‌లో ఒక ఫీజు ఉంటే, జనవరి ప్రవేశించగానే మరోలా ఫీజు ఉంటుంది. ఏప్రిల్- జూన్ మధ్య ఖరా రు చేసే ఫీజులో భారీ వ్యత్యాసం ఉంటు ంది. అక్టోబర్‌లో ఫీజు రూ.1.20 లక్ష వర కు ఉంటుంది. మే, జూన్‌లో అడ్మిషన్ కోసం వస్తే రూ.3.50 లక్షల వరకు ఉం టుంది. ఏ నెలలో ఎంత ఫీజు ఉండాలనేది కంప్యూటర్‌లో ఫిక్స్ ఉంటుందని విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి.
యాజమాన్యాలు కొన్నిసార్లు కావాలని సీట్లను బ్లాక్ చేసి, సీట్లు అయిపోయాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తాయనే ఆరోపణలు ఉన్నాయి. చివరకు తల్లిదండ్రులను ఫీజు ఎంతైనా ఫర్వాలేదు, సీటు మాత్రం కావాలనే స్థితికి తీసుకొచ్చి, వారి ముక్కుపిండి వసూలు చేస్తారు.
ఇవికాక విశ్వామిత్ర వంటి అనేక పేర్లతో క్యాంపస్‌లో స్పెషల్ సెక్షన్లు ఉన్నాయి. ఆ స్పె షల్ సెక్షన్లకు ఒక్కో విద్యార్థి అదనంగా రూ.2 5 వేల నుంచి రూ.50 వేల వరకు చెల్లించా ల్సి ఉంటుంది. అలాగే ఒక విద్యార్థి తనకు నచ్చిన కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలంటే, డిమాండ్‌ను బట్టి రూ.2.50 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఫీజు చెల్లించాల్సిందే.
కాలేజీలపై చర్యలు తీసుకోవాలి..
రాష్ట్రప్రభుత్వం ఒక విద్యార్థికి ట్యూషన్ ఫీజు కేవలం రూ.1,750 మాత్రమే నిర్ణయించింది. కానీ, శ్రీచైతన్య, నారాయణ విద్యా సంస్థలు కొన్ని వందల రేట్ల ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి కాలేజీ ఫీజు పేరుతో పాటు హాస్టల్ ఫీజు పేరుతో గరిష్ఠంగా రూ.4 లక్షల వరకు వసూ లు చేస్తున్నాయి.
యాజమాన్యాలు ఒక విద్యాసంస్థ నడిపేందుకు అనుమతులు తీసుకుని పది బ్రాంచీల చొప్పున నడిపిస్తున్నాయి. కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలు, అడ్మిషన్లపై గతంలో ప్రభు త్వం నిరజాక్షిరెడ్డి కమిటీ వేసింది. ఆ కమిటీ రిపోర్టు ఇప్పటివరకు బహిర్గతం కాలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న శ్రీచైతన్య, నారాయణ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి.
డాక్టర్ ఎన్.జానారెడ్డి,
ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు
నారాయణ కాలేజీ బ్రాంచీల్లో ఫీజులు (సుమారుగా)
* కుంట్లూరు నాన్ ఏసీ - రూ.1.25 లక్షల నుంచి 1.50 వరకు, ఏసీ రూ.1.75 లక్షల వరకు
* ఆదిబట్ల నాన్ ఏసీ - రూ.1.60 లక్షలు, ఏసీ రూ.2.25 లక్షలు వరకు
* మియాపూర్ నారాయణ నాన్ ఏసీ - రూ.1.60 లక్షలు, ఏసీ.2.5 లక్షల వరకు
* మాదాపూర్ ఏసీ- రూ.3.25 లక్షల నుంచి 3.75 లక్షల వరకు (చివరి నిమిషంలో అడ్మిషన్ అడిగితే రూ.4 లక్షల వరకు)
* పాటి గర్ల్స్ క్యాంపస్ ఏసీ - రూ.2.5 లక్షల వరకు
* మియాపూర్ గర్ల్స్ క్యాంపస్- రూ.2.50 నుంచి 3 లక్షల వరకు
* రావిర్యాల ఏసీ- రూ.2.25 లక్షల వరకు
Fబాచుపల్లి -రూ.2.50 లక్షల నుంచి రూ.2.75 లక్షల వరకు
* మియాపూర్ (కల్వరి టెంపుల్) - రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు
* స్పెషల్ కాలేజీల్లో అడ్మిషన్లకు జూన్‌లో వెళితే డిమాండ్‌ను బట్టి రూ.4 లక్షల వరకు ఫీజు
* ఇవి కాక నరేశ్, అశోక్, కేకే, భాస్కర్ వంటి పేర్లతో పలు క్యాంపస్‌ల్లో స్పెషల్ సెక్షన్లు ఉంటాయి.
* వాటికి ఒక్కో విద్యార్థి అదనంగా రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది.
శ్రీచైతన్య కాలేజీ బ్రాంచీల్లో ఫీజులు (సుమారుగా)
* కుంట్లూరు (ఏసీ)- రూ.1.20 నుంచి 1.50 లక్షల వరకు
* బాచుపల్లి- రూ.2.30 నుంచి రూ. 2.50 లక్షల వరకు
* జేఈఈ, నీట్ కాకుండా కేవలం ఎంసెట్ కోర్సుకు రూ. 90 వేల నుంచి రూ.1.10 లక్షల వరకు
* బొంగులూరు (ఏసీ) - రూ.1.60 లక్షలు, నాన్ ఏసీ రూ. 1.20 లక్షలు వరకు
* కేపీహెచ్‌బీ డే స్కాలర్ - రూ.60 వేల నుంచి రూ. 70 వేల వరకు
* మియాపూర్- గర్ల్స్ (ఏసీ) - రూ.2.50 లక్షల నుంచి రూ.2.75 లక్షల వరకు
* అల్వాల్ - రూ.2.50 లక్షల నుంచి రూ.2.75 లక్షల వరకు
* మాదాపూర్ (ఏసీ) - రూ.3.70 లక్షల నుంచి రూ.3.80 లక్షల వరకు
* కొత్తపేట - రూ.2.50 లక్షలు ఏసీ క్యాంపస్.
* దిల్‌సుఖ్‌నగర్ - రూ.లక్ష నుంచి రూ.1.10 లక్ష వరకు