- 19 మండలాలకు 9 మందే ఎంఈవోలు
- ఒక్కో అధికారికి మూడు మండలాల బాధ్యతలు
- అస్తవ్యస్తంగా వికారాబాద్ విద్యావ్యవస్థ
వికారాబాద్, జూలై 9 (విజయక్రాంతి): జిల్లాలో కొన్నేళ్లుగా రెగ్యులర్ మండల విద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో పర్యవేక్షణ కొరవడింది. ఆయా మండలాల్లోని సీనియర్ గెజిటెడ్ హెచ్‌ఎంలనే ఇన్‌చార్జి ఎంఈవోలుగా నియమించి, నెట్టుకొస్తున్నారు. ఈ కారణంగా జిల్లాలో పాఠశాల విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పర్యవేక్షణ కొరవడటంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. ప్రైవేటు పాఠశాలల ఆగడాలు కూడా విజృంభిస్తున్నాయి. గత రెండేళ్లుగా పదో తరగతి ఫలితాల్లో సైతం జిల్లా పూర్తిగా వెనుకబడి పోయింది. గతేడాది రాష్ట్రంలోనే వికారాబాద్ చివరి స్థానంలో నిలిచింది.
ఎంఈవోల భర్తీపై కోర్టు కేసు
ఎంఈవోల పోస్టుల భర్తీ విషయమై సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది. ఈ కారణంగా పదేళ్లు గా జిల్లాకు రెగ్యులర్ ఎంఈవోలు కరువ య్యారు. పదేళ్ల క్రితం ప్రభుత్వ పాఠశాలలు, యూపీఎస్‌ల హెచ్‌ఎంలు ఎంఈవో పోస్టుల కోసం కోర్టుకెక్కారు. వీరి ఆందోళన సుప్రీంకోర్టుకు చేరడంతో భర్తీ ప్రక్రియ నిలిచి పోయింది. దీంతో ప్రస్తుతం జిల్లాలో 19 మండలాలు ఉండగా కేవలం ఒకరు మాత్రమే రెగ్యులర్ ఎంఈవో ఉండగా, మిగిలిన ఎనిమిది మంది ఇన్‌చార్జి ఎంఈవోలే ఉండడం గమనార్హం. ఆ తొమ్మిది ఎంఈవోలే జిల్లాలోని 1,035 పాఠశాలలను నడిపిస్తున్నారు. ఒక్కొక్కరు రెండు నుంచి మూడు మండలాల బాధ్యతలను నిర్వహిస్తున్నారు. దీంతో పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడుతున్నది.
పాఠశాలల్లో కొరవడిన పర్యవేక్షణ
ఎంఈవోల పర్యవేక్షణ లేకపోవడంతో పాఠశాలల నిర్వహణ సక్రమంగా జరగడంలేదు. ఉపాధ్యాయుల సమయపాలన, విద్యాబోధన, కనీస వసతుల కల్పన, మధ్యాహ్న భోజన పథకం అమలు సక్రమంగా సాగడం లేదు. ఎంఈవోలు చేయా ల్సిన పనులన్నీ తామే చేయడంతో అధికభారం పడుతున్నదని, ఫలితంగా బోధనపై దృష్టి పెట్టలేక పోతున్నామని హెచ్‌ఎంలు వాపోతున్నారు. పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంల పంపిణీ ఎంఈవోల పర్యవేక్షణలో కొనసాగాలి. కానీ ఆ బాధ్యతలు కూడా ప్రధానోపాధ్యాయులే తీసుకుంటున్నారు.
కాంప్లెక్స్ హెచ్‌ఎంలకు బాధ్యతలు..
ఎంఈవోల పదోన్నతులు, భర్తీ విషయమై సుప్రీంకోర్టులో కేసు ఉండడంతో భవిష్యత్తులో ఎంఈవో పోస్టులు భర్తీ చేయకుండా కాంప్లెక్స్ హెచ్‌ఎంలకు బాధ్యతలు అప్పగించేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే ఆలోచనతో ఎంఈవో పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదనే ప్రచారం ఉంది.
ఉన్నవారితోనే పర్యవేక్షణ
జిల్లాలో రెగ్యులర్ ఎంఈవోలు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఎంఈవోల భర్తీ అంశం ప్రభుత్వ పరిధిలోనిది. మండలాల్లోని సీనియర్ హెచ్‌ఎంలకు ఇన్‌చార్జి ఎంఈవోలుగా బాధ్యతలు అప్పగించి, పర్యవేక్షణ కొనసాగిస్తు న్నాం. ఇన్‌చార్జిలు ఉనప్పటికీ ఎక్కడా సమస్య రాకుండా జాగ్రత్త పడుతు న్నాం. ఒక ఎంఈవోకు రెండు, మూడు మండలాల బాధ్యతలు ఉండడంతో పని ఒత్తిడి ఉన్నమాట వాస్తవమే.
-రేణుకాదేవి, జిల్లా విద్యాధికారి, వికారాబాద్