- విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం
విద్యావేత్తలతో సీఎం రేవంత్
హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): రాష్ర్టంలో విద్యావ్యవస్థను మెరుగుపర్చడానికి త్వరలోనే విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. అంగన్‌వాడీ మొదలు విశ్వవిద్యాల యాల వరకు నాణ్యమైన విద్య బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విద్యావ్యవస్థ బలోపేతంపై విద్యావేత్తలతో సచివాలయంలో రేవంత్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థ బలోపేతానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, విద్యావేత్తలు ఇచ్చే మంచి సూచనలు స్వీకరిస్తామని తెలియజేశారు.
విద్యార్థులకు ఉచిత రవాణా!
భేటీలో పాల్గొన్న ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, పీఎల్ విశ్వేశ్వరరావు, శాంతా సిన్హా, ఆల్దాస్ జానయ్య, పద్మజా షా, లక్ష్మీనారాయణ, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి విద్యావ్యవస్థ బలోపేతానికి పలు సూచనలు చేయడంతో పాటు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు బోధించే నైపుణ్యం ఉండడం లేదని, సరైన వసతులు లేవని వివరించారు. వాటిని ప్రీస్కూల్స్‌గా మార్చి వాలంటీర్లను తీసుకొని వారికి శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. విద్యార్థులకు ఉచిత రవాణా సదుపాయం కల్పిచా లనే ఆలోచన తమకు ఉందన్నారు.
బడ్జెట్ పెంపు అవసరం
విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు అతి తక్కువ వడ్డీకి, దీర్ఘకాల రుణాలు ఇస్తాయని, ఇప్పటికే పలు రాష్ట్రాలు వాటి సాధనకు ప్రయత్నిస్తున్నాయని ఆల్దాస్ తెలియజేశారు. ఆ అంశాన్ని పరిశీలిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ర్టంలో 11 శాతంగా ఉన్న విద్యాశాఖ బడ్జెట్ తెలంగాణ ఏర్పడిన తర్వాత 6.4 శాతానికి పడిపోయిందని, విద్యావ్యవస్థ బలోపేతానికి బడ్జెట్ పెంపు అవసరమని హరగోపాల్ సూచించారు. తాను, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇద్దరమూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నామని, కచ్చితంగా ప్రభుత్వ విద్యావ్యవస్థ బలోపేతానికి బడ్జెట్ పెంచుతామని సీఎం తెలిపారు.
త్వరలోనే వీసీల నియామకం
పదేళ్లుగా యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది నియామకం జరగలేదని, వీసీలు లేరని ప్రొఫెసర్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వీసీల నియామకానికి ఇప్పటికే సెర్చ్ కమిటీలు వేశామని, త్వరలోనే వీసీల నియామకం పూర్తవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. యూనివర్సిటీలకు డెవలప్‌మెంట్ గ్రాంట్స్ ఇవ్వాలని, ప్రతి వర్సిటీలో వివిధ అంశాలపె ైలోతైన చర్చ, వాస్తవాల వెల్లడికి అభివృద్ధి, చరిత్రకు సంబంధించిన అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య సీఎంకు విజ్ఞప్తి చేశారు.
విద్యా సూచికలో తెలంగాణ అట్టడుగున ఉందని, తామంతా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే చదువుకున్నామని, ప్రపంచ దేశాలన్నీ తిరిగి వచ్చామని, ప్రస్తుతం ఓయూలోనూ విద్యా ప్రమాణాలు పడిపోయాయని ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ శాంతాసిన్హా ఆవేదన వ్యక్తం చేశారు. విద్యావ్యవస్థ బలోపేతానికి తాము ఇప్పటికే మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్‌తో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. విద్యావ్యవస్థలో తీసుకురావల్సిన మార్పులపై విధాన పత్రం రూపొందిస్తే దానిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఆయా అంశాలపై క్యాబినెట్ సబ్ కమిటీతోనూ చర్చించాలని వారికి సూచించారు.