calender_icon.png 29 November, 2024 | 5:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనవరిలో విద్యాకమిషన్ నివేదిక?

29-11-2024 03:04:26 AM

సమగ్ర మార్పులపై అధ్యయనం

డిసెంబర్ 7 వరకు  జిల్లాల్లో పర్యటన

3 నివేదికలు సమర్పించనున్న కమిషన్

హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నది. ఇప్పటికే ఐదారు జిల్లాల్లో పర్య టించిన విద్యాకమిషన్.. మేధావులు, విద్యారంగ నిపుణులు, ఉపాధ్యాయులు, ప్రొఫెస ర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి సలహాలు, సూచనలు సేకరిస్తున్నది. కేజీ టు పీజీ విద్యా వ్యవస్థలో తీసుకు రావాల్సిన మార్పులు, విధానాల అమలు, విద్య సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశాలు నిర్వహిస్తోంది.

ఇలా సేకరించిన సలహాలు, సూచనలతో ప్రభుత్వానికి తెలంగాణ విద్యాకమిషన్ నివేదికలు ఇవ్వనున్నది. అయితే పాఠశాల, కళాశాల విద్య, సాంకేతిక విద్యాభివృద్ధికి సంబంధించి వేర్వేరుగా మూడు నివేదికలను కమిషన్ తయారు చేసి అందులో ప్రభుత్వం తీసుకోవాల్సిన సమూల మార్పులను సూచించ నున్నది. డిసెంబర్ లేదా జనవరిలో ప్రభుత్వానికి విద్యాకమిషన్ నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. 

జిల్లాల్లో విస్తృత పర్యటన..

తెలంగాణ విద్యా కమిషన్ గురువారం (ఈ నెల 28) నుంచి డిసెంబర్ 7 వరకు అన్ని జిల్లాల్లో పర్యటించనుంది. ప్రభుత్వ విద్యా సంస్థలను విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలో సభ్యులు ప్రొ.విశ్వేశ్వర్, వెంకటేశ్, జ్యోత్స్న.. ఒక్కొక్కరు ఒక్కో జిల్లాలో పర్యటించనున్నారు. డిసెంబర్ 7 వరకు పర్యటించి ప్రజాభిప్రాయాన్ని సేకరించనున్నారు..

చైర్మన్ మురళి బుధవారం ఇబ్రహీంపట్నంలోని శేరిగూడ ప్రభు త్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మధ్యాహ్న భోజనం చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, నిర్వాహకులతో మాట్లాడి వివరాలు సేకరించారు. విద్యాకమిషన్ సభ్యుల పర్యటనను విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.