రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
రంగారెడ్డి, జనవరి 20 (విజయ క్రాంతి): విద్య, వైద్యానికి 80% నిధులు కేటాయిస్తే సమాజంలో అసమానతలను రూపుమాపవచ్చని ప్రతి ఇంట్లో తప్పనిసరిగా గ్రంథాల యాలు ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సంస్కారం లేని జీవితం వ్యర్థమని, గ్రంథాలయాలతో సమాజంలో నూతన మార్పు తీసుకురావచ్చని దానికి విద్య ఎంతో అవసరమని ఆయన గుర్తు చేశారు.
సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో గ్రేడ్ వన్ శాఖ గ్రంథాలయ అభివృద్ధి నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సభకు మంత్రి జూపల్లి, ఎమ్మెల్సీ కోదండరామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గం చైర్మన్ మదన్ మోహన్ రెడ్డి కమిటీ సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ సమాజంలో గ్రంథాలయా లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి అన్నారు.
విద్య వ్యాప్తి చెందితే సమాజం వృద్ధులోకి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే తాను తన నియోజకవర్గంలో విద్యా వైద్యానికి 80% నిధులను కేటాయిస్తానని ఆ తర్వాతే మిగతా పనులను చూస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియా లో మంచి కంటే... చెడే ప్రోజెక్టు అవుతుందని. ఈ వైఖరి మారాలన్నారు. సమాజంలో విద్యను ప్రోత్సహిస్తే అడ్డుకట్ట వేయవచ్చన్నారు.
గ్రామీణ ప్రాంతాలలో కూడా గ్రంధాలయాలు వెలిసేలా చూడాలని,కాలానికి అనుగుణంగా డిజిటలైజేషన్ చేయడం గొప్ప పరిణామం దానికి ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని అన్నారు. షాద్ నగర్ గ్రంథాలయానికి తన శాఖ తరపున రూ.5 లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు.
ఎమ్మెల్సీ కోదండరాంరెడ్డి మాట్లాడుతూ చరిత్రను మార్చగల శక్తి అంతాలయాలకు ఉన్నాయని... దేశ స్వాతంత్రం..రాష్ట్ర తెలంగాణ ఏర్పాటులో గ్రంథాలయాలు కీలకపాత్ర పోషించాయని ఆయన పేర్కొన్నారు.
ఎమ్మెల్యే వీళ్ళపల్లి శంకర్ మాట్లాడుతూ పదవులు ముఖ్యం కాదు... సేవ చేయడమే ముఖ్యమని. నూతన పాలకవర్గం గ్రంథాలయ అభివృద్ధికి నడుం బిగించాలన్నారు. నియోజకవర్గంలో గ్రంథాలయ అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.