ఈసీఐఆర్ నమోదు.. దర్యాప్తు షురూ
సీఐడీ నుంచి వివరాలు సేకరణ
కొత్త కోణంపై ఇతర రాష్ట్రాల్లో ఆరా
నిందితుడిగా మాజీ సీఎస్ సోమేష్ కుమార్
త్వరలో నోటీసులిచ్చి విచారణకు పిలిచే అవకాశం
హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో వెలుగు చూసిన జీఎస్టీ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టిపెట్టింది. ఈ కేసును విచారించేందుకు రంగంలోకి దిగింది. గత మూడు రోజులుగా సీఐడీ అధికారుల నుంచి కేసు వివరాలను సేకరిస్తున్న ఈడీ అధికారులు.. శుక్రవారం ఈసీఐఆర్ నమోదు చేసినట్లు తెలిసింది.
బీఆర్‌ఎస్ హయాంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా పనిచేసిన ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండటంతో రాష్ట్రంలో ఈ కేసు సంచలనంగా మారిం ది. ఈ కేసును ఇక నుంచి సీఐడీ, ఈడీ వేర్వేరుగా విచారించనున్నాయి. కొంతకాలంగా స్తబ్ధుగా విచారణ ఈడీ రంగప్రవేశంతో ఊపందుకోనున్నట్లు తెలుస్తోంది. ఈడీ ఈ కేసులో ఎవరెవరిని విచారిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.
ఈ కేసుకు సంబంధించి అధికారులు ఇప్పటికే సీఐడీ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ప్రాథమిక నివేదికను తయారు చేసినట్లు సమాచారం. ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ను పొందిన సంస్థలు ఎన్ని? ఎంతెంత కాజేశాయి? ఈ కుంభకోణం రాష్ట్రానికి పరిమితమైందా? లేక ఇతర రాష్ట్రాలకు ఏమైనా లింకు ఉందా? అనే అంశాలపై ఈడీ ఆరా తీసినట్లు తెలుస్తోంది.
కొత్త కోణం ఏమైనా ఉందా?
రాష్ట్రంలో జీఎస్టీ స్కామ్ వెలుగు చూసిన తర్వాత.. ఇదే తరహా కుంభకోణాలు పలు రాష్ట్రా ల్లో జరిగాయి. ఢిల్లీలో రూ.54 కోట్ల స్కామ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. గుజరాత్‌లో దాదాపు 200 కంపెనీలకు సంబంధించిన కుంభకోణంపై గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) విచారిస్తోంది. ఈ కేసుల్లోనూ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ)లోనే అక్రమాలు జరిగినట్లు అభియోగాలు మోపారు.
బోగస్ ఇన్వాయిస్‌లతో రూ.కోట్లను కాజేసినట్లు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో ఈడీ అధికారులు ఇతర రాష్ట్రాల్లో కుంభకోణాలు ఎలా జరిగాయనేదానిపై ఆరా తీస్తున్నారు. మూడు చోట్ల ఒకేలా అవకతవకలు ఉన్నా యా? లేక వేర్వేర్వుగా ఉన్నాయా? కొత్త కోణం ఏమైనా ఉందా? అనేది తెలుసుకొంటున్నారు.
సోమేష్ కుమార్‌కు బిగుస్తున్న ఉచ్చు?
జీఎస్టీ కుంభకోణం మాజీ సీఎస్ సోమేష్ కుమార్ అండతోనే జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్ హయాంలో సోమేష్ కుమార్ సీఎస్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. దీంతో ఈ కుంభకోణంలో ఆయన పాత్ర కూడా ఉన్నట్లు అభియోగాలు మోపారు. ఇప్పుడు ఈ కేసులో ఈడీ ఎంటర్ కావడంతో సోమేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నదన్న వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆయనకు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
బోగస్ ఇన్వాయిస్‌లతో రూ.వేల కోట్ల స్కామ్
పన్ను చెల్లించకుండానే ఐజీఎస్టీలో ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ను మోసపూరితంగా వసూలు చేసినట్లు 75 కంపెనీలపై అభియోగాలు మోపారు. షెల్ కంపెనీల సాయంతో బోగస్ ఇన్వాయిస్‌లను సృష్టించినట్లు వాణిజ్య పన్నుల శాఖ జూలైలో నిర్వహించిన అంతర్గత ఆడిట్‌లో తేలింది.
ఈ బోగస్ ఇన్వాయిస్‌ల వల్ల వాణిజ్య శాఖకు దాదాపు రూ.1400 కోట్ల నష్టం వాటిల్లినట్లు కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
కమర్షియల్ ట్యాక్స్ అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరామ్ ప్రసాద్, ఐఐటీ హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్‌బాబు, ప్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతోపాటు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సహా మొత్తం ఏడుగురిని నిందితులుగా పేర్కొంటూ పోలీసులు జూలైలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో సోమేష్ కుమార్‌ను ఏ5గా చేర్చారు. జూలైలోనే ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.
17 సంస్థలకు శ్రీదేవి కమిటీ నోటీసులు
జీఎస్టీ స్కామ్ కేసులో అభియోగాలు మోపిన 17 సంస్థలకు కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ టీకే శ్రీదేవి నేతృత్వంలోని హైలెవెల్ కమిటీ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. వాణిజ్య పన్నుల శాఖలో లాస్ రికవరీ కోసం ఇటీవల శ్రీదేవి నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీని ప్రభుత్వం నియమించారు. జీఎస్టీ స్కామ్ కేసులో మొత్తం 75 కంపెనీలపై పోలీసులు అభియోగాలు మోపారు.
వాటిలో పన్నుల ఎగవేసిన 17 సంస్థలకు తాజాగా నోటీసులు జారీ అయ్యాయి. ఇందులో ఏడుకొండలు లేబర్ కాంట్రాక్టర్ కోఆపరేటివ్ సొసైటీ కూడా ఉన్నట్లు తెలిసింది. వాణిజ్య శాఖకు ఎగవేసిన ఎస్‌జీఎస్టీ, సీజీఎస్టీ కలిపి మొత్తం రూ.7,56,800ను చెల్లించాలని ఆ నోటీసులో పేర్కొన్నట్లు సమాచారం.
ఏడుకొండలు లేబర్ కాంట్రాక్టర్ కోఆపరేటివ్ సొసైటీ 2017, జూలై 1న రిజిస్టర్ అయ్యింది. 2023, మార్చి 20న రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో జీఎస్టీ రిజర్న్‌లు దాఖలు చేయడంలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. జీఎస్టీఆర్ జీఎస్టీఆర్ మధ్య తేడాలు ఉన్నట్లు నోటీసులో వివరించినట్లు సమాచారం.
త్వరలో నిందితులకు ఈడీ నోటీసులు?
రూ.1400 కోట్ల స్కామ్‌పై ఈసీఐఆర్‌ను నమోదు చేసిన ఈడీ త్వరలోనే నిందితులకు నోటీసులు జారీచేసి విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో పలువురు నిందితులతోపాటు కొందరు కమర్షియల్ ట్యాక్స్ అధికారులను సీఐడీ విచారించి, వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. నిందితులతోపాటు ఫిర్యాదు చేసిన అధికారి, ఆడిట్ చేసిన ఆఫీసర్లకు కూడా నోటీసులు ఇచ్చేందుకు ఈడీ అధికారులు రంగం సిద్ధ చేస్తున్నట్లు సమాచారం.