calender_icon.png 4 October, 2024 | 4:53 AM

అజారుద్దీన్‌కు ఈడీ సమన్లు

04-10-2024 02:47:45 AM

హెచ్‌సీఏలో అక్రమాలపై నోటీసు

న్యాయపోరాటం చేస్తానన్న అజార్

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 3 (విజయక్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో అక్రమాల ఆరోపణలపై హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురు వారం సమన్లు జారీచేసింది. ఈడీ కార్యాలయం ఎదుట హాజరుకావాలని నోటీ సుల్లో పేర్కొంది. కాగా ఈ కేసులో ఆయనకు నోటీసులు రావడం ఇదే మొదటి సారి. 2020 నుంచి 2023 మధ్య ఆయన హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మనీలాండరింగ్ జరిగిందని ఈడీ తన నోటీసుల్లో పేర్కొంది. దాదాపు రూ.20కోట్ల అవకతవకలు జరిగాయని చెప్పింది. 

గతేడాదే కేసులు నమోదు..

ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ క్రికెట్ స్టేడియంలో డీజిల్ జనరేటర్లు, అగ్నిమాపక పరికరాలు, క్యానోపీల సేకరణ, క్రికెట్‌బాల్స్ కోసం కేటాయించిన నిధులను దుర్వినియోగం చేశారని గతేడాది ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కు పలు ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో అప్పట్లో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్‌తో పాటు పలువురు హెచ్‌సీఏ మాజీ అధికారులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

నిధుల మళ్లింపు విషయమై హెచ్‌సీఏ.. 2020 మార్చి నుంచి 2023 ఫిబ్రవరి మధ్య వరకు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించగా.. నిధుల దుర్వినియోగం, ప్రైవేట్ ఏజెన్సీలకు నగదు మళ్లింపు జరిగినట్లు గుర్తించింది.  అంతర్గత దర్యాప్తు అనంతరం హెచ్‌సీఏ సీఈవో సునీల్ కాంటే బోస్ గతేడాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. తదనంతరం ఈడీ అధికారులు ఈ కేసులో ఈసీఆర్ నమోదు చేశారు. 

పలువురి ఇళ్లలో సోదాలు..

గతేడాది నవంబర్‌లో హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు జి.వినోద్, మాజీ క్రికెటర్లు శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్ ఇళ్లలో ఈడీ సోదాలు కూడా నిర్వహించింది. మనీల్యాండరింగ్ చట్టం కింద 9ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి. ఏసీబీ నమోదు చేసిన మూడు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ అప్పట్లో అజారుద్దీన్‌పై నాలుగు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసింది.

అయితే ఆమా కేసులకు సంబంధించి అజారుద్దీన్ గతేడాది నవంబర్‌లో ముందస్తు బెయిల్ పొందారు. తదనంతరం గతేడాది జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన అజర్.. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌పై ఓటమిపాలయ్యారు. 

నిత్యం వివాదాలే..

అజారుద్దీన్ ఒకప్పుడు ఇండియా టీమ్‌లో బలమైన బ్యాటర్, విజయవంతమైన కెప్టెన్ అయినప్పటికీ అతడిని నిత్యం వివాదాలు వెంటా డుతూనే ఉన్నాయి. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో 2000 ఏడాదిలో అతడి క్రికెట్ కెరీర్ ముగిసింది. తదనంతరం హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఉన్న వ్యక్తికి హెచ్‌సీఏ అధ్యక్ష పదవి ఎలా ఇస్తారంటూ గతంలో పెద్ద వివాదమే చెలరేగింది. 

రాజకీయ కుట్ర..

తనపై నమోదైన కేసు రాజకీయ కుట్ర అని అజారుద్దీన్ అన్నారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు కావాలనే కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానని అజర్ స్పష్టం చేశారు.