calender_icon.png 28 September, 2024 | 6:57 AM

మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు

28-09-2024 03:24:45 AM

ఏకకాలంలో ఐదు ప్రదేశాల్లో దాడులు

మంత్రి కుమారునిపై వాచ్‌ల స్మగ్లింగ్ ఆరోపణలు

లోతుగా విచారణచేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి)/ఖమ్మం: తెలంగాణ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు.

సింగపూర్ నుంచి నవీన్‌కుమార్, ఫహెర్దీన్ అనే వ్యక్తులు అక్రమంగా చెన్నై పోర్టు ద్వారా తీసుకొచ్చిన ఖరీదైన చేతి గడియారాలను మంత్రి కుమారుడు హర్షరెడ్డి కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ అంశంలో కస్టమ్స్ అధికారులు హర్షరెడ్డికి గతంలోనే నోటీసులు జారీచేశారు.

దీనిపై ఈడీ మనీలాండరింగ్‌తోపాటు మరో కేసు నమోదుచేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ బృందాలు శుక్రవారం ఉదయం నుంచే ఏకకాలంలో జూబ్లీహిల్స్‌లోని మంత్రి నివాసాలతోపాటు, హిమాయత్‌సాగర్ ఫామ్‌హౌజ్, జూబ్లీహిల్స్‌లోని పొంగులేటి కుమార్తె నివాసం సహా ఐదు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.

విచారణలో నవీన్ రూ.100 కోట్ల విలువైన వస్తువులు స్మగ్లింగ్ చేసినట్లు అధికారులు తేల్చారు. తనిఖీల సందర్భంగా సీఆర్పీఎఫ్ పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 నవంబర్‌లోనూ పొంగులేటి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు చేసింది.

ఆ సమయంలో ఖమ్మం, హైదరాబాద్‌లో ఏకకాలంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే ఆ తర్వాత కొద్ది కాలం ఐటీ దాడుల అంశం మరుగునపడిపోయింది. ఈసారి అనూహ్యంగా ఈడీ రంగంలోకి దిగడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.   

ఖమ్మంలో కలకలం 

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాలు, ఫామ్‌హౌస్, బంధువు ఇండ్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు చేయటంతో ఆయన స్వస్థలం ఖమ్మంలోని మంత్రి నివాసం వద్ద నాయకులు, కార్యకర్తల హడావిడి కనిపించింది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉదయాన్నే మంత్రి నివాసం వద్దకు చేరుకున్నారు. మీడియా సిబ్బంది మంత్రి నివాసం వద్దకు చేరుకుని, గంటల తరబడి వేచిచూశారు.

ఈడీ అధికారులు ఖమ్మం రావడం లేదని తెలుసుకుని అందరూ తిరిగి వెళ్లిపోయారు. ఖమ్మంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఉదయం ఎవరూ కనిపించలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈడీ అధికారులు ఖమ్మంలో మంత్రి నివాసంలో సోదాలు చేశారు. పొంగులేటి నామినేషన్‌కు సిద్ధమైన రోజే ఈడీ అధికారులు సోదాలు చేయడం నాడు తీవ్ర చర్చనీయాంశమైంది.  

ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక ఈడీ దాడులు: పిడమర్తి రవి 

ప్రజాక్షేత్రంలో మంత్రి పొంగులేటిని ఎదుర్కోలేక ఈడీ రూపంలో మోదీ దాడి చేయించడం సిగ్గుచేటని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి మండిపడ్డారు. ప్రజా నాయకుడు, పేదల పక్షపాతి పొంగులేటికి ఉన్న ప్రజాదరణ చూసి కేంద్ర పెద్దలు ఆయనను ప్రజల నుంచి దూరం చేసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

గత పదేళ్ల నుంచి ఒక్క బీజేపీ నాయకుడిపై ఈడీ దాడులు జరగలేదని, ఈ దేశంలో అత్యంత అవినీతిపరులు బీజేపీ నాయకులేనని విమర్శించారు. ఎన్ని దాడులు జరిగినా పొంగులేటి ప్రతిష్టకు భంగం కలగదని అన్నారు.  

ప్రతిపక్ష ప్రభుత్వాలపై మోదీ దాడి సరికాదు: మంత్రి సీతక్క 

ప్రతిపక్ష ప్రభుత్వాలను లొంగదీసుకునేందుకు బీజేపీ ఈడీతో దాడి చేయించడం సరికాదని పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మండిపడ్డారు. తమ అనుకూలంగా లేని ప్రభుత్వాలపై మోదీ సర్కారు దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తుందని, ఆ ప్రభుత్వాలను కూలగొట్టమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.

గట్టిగా మాట్లాడిన ప్రతిపక్ష ఎంపీలు ఇళ్లమీదకు ఈడీని పంపిస్తామని పార్లమెంటు సాక్షిగా ఆ పార్టీ ఎంపీలు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు.