calender_icon.png 19 October, 2024 | 10:04 AM

తమన్నాను విచారించిన ఈడీ

19-10-2024 02:08:42 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు సంబంధించిన హవాలా కేసులో నటి తమన్నాను ఈడీ అధికారులు విచారించారు. ఈడీ నోటిసుల మేరకు తన తల్లిదండ్రులతో కలిసి అస్సాం గువహటిలోని కార్యాలయంలో గురువారం విచారణకు హాజరైన ట్లు తెలుస్తోంది. ఈ విషయంలో తమన్నాను 8 గంటలపాటు సుదీర్ఘంగా విచారించినట్లు సమాచారం. మహదేవ్ బెట్టింగ్ యాప్‌కు అనుబంధంగా ఉన్న హెచ్‌పీజెడ్ టోకెన్ యాప్‌ను ఆన్‌లైన్‌లో తమన్నా ప్రమోట్ చేశా రు. ఈ యాప్‌కు సంబంధించిన ఈవెంట్‌కు సెలబ్రిటీ హోదాలో హాజరయ్యారు. ఇందుకోసం భారీ మొత్తాన్ని అందుకున్నారని, ఈ మేరకు ఆమెను ఆరా తీసినట్లు సమాచారం.  

కేవలం ప్రశ్నించేందుకే..

హెచ్‌పీజెడ్ టోకెన్ యాప్ ద్వారా క్రిప్టో, బిట్‌కాయిన్ మైనింగ్ పేరుతో భారీ ఎత్తున మోసాలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఈ యాప్‌లో రూ.57 వేలు పెట్టుబడి పెడితే రోజుకు రూ.4 వేలు ఇస్తామని నమ్మించి కోట్లు దోచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలకు సంబంధించే నటి తమన్నాను ఈడీ అధికారులు విచారించారు. ఈ కేసుకు సంబంధించి తమన్నాపై ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదని తెలుస్తోంది. యాప్‌ను ప్రచారం చేయడంతో పాటు ఈవెంట్‌కు హాజరైనందుకు తీసుకున్న మొత్తాలపై అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి తమన్నా వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు ఈడీ విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.