calender_icon.png 26 December, 2024 | 3:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ నోటీసులు

08-11-2024 12:27:34 AM

పీజీ మెడికల్ సీట్ల బ్లాక్ వ్యవహారం

  1. గతంలో మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో తనిఖీలు
  2. కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులు స్వాధీనం 
  3. విచారణకు హాజరైన మల్లారెడ్డి మెడికల్ కాలేజీ ఈవో

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 7 (విజయక్రాంతి): మల్లారెడ్డి మెడికల్ కళాశాల పీజీ సీట్లు బ్లాక్‌చేసి వాటిని అక్రమంగా మేనేజ్‌మెంట్ కోటా సీట్ల కింద కేటాయించి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది.

ఈ క్రమంలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీచేశారు. గురువారం విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొనడంతో ఆయన తరఫున మల్లారెడ్డి మెడికల్ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ అధికారి సురేందర్‌రెడ్డి ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు.

దీంతో ఈడీ అధికారులు పీజీ మెడికల్ సీట్ల బ్లాకింగ్ వ్యవహారంపై సుదీర్ఘంగా ఆరా తీసినట్లు సమాచారం. అలాగే వాటికి సంబంధించిన పలు రికార్డులు, కళాశాల బ్యాంకు స్టేట్‌మెంట్లను పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం వెనుక ప్రధానంగా ఎవరి హస్తం ఉందనే దానిపై విచారణ జరిపారు. శుక్రవారం కూడా దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది. 

మరోవైపు.. కొందరు వ్యక్తులు, ఏజెన్సీలు, పలువురు నీట్ విద్యార్థులతో కలిసి తెలంగాణలోని పలు ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లోని పీజీ సీట్లను బ్లాక్ చేస్తున్నారని కాళోజీ నారాయణ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ వరంగల్‌లోని మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసుపైనా ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.

నీట్‌లో అత్యధిక మార్కులు సాధించిన వారి వివరాలతో ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో సీటును ఎంచుకున్నట్లు సృష్టించి ప్రవేశాల చివరిరోజు రద్దు చేసుకుంటున్నారు. ఇలా మిగిలిపోయిన సీట్లను మేనేజ్‌మెంట్ కోటా కింద రూ.కోటి నుంచి రూ.2.5 కోట్లకు విక్రయించుకున్నట్లు ఈడీ గుర్తించింది.

అయితే, నిబంధనల ప్రకారం చివరి నిమిషంలో సీట్లను రద్దు చేసుకున్నందుకు విద్యార్థి రూ.5 లక్షలు కట్టాల్సి ఉంటుంది. విద్యార్థుల పేరు మీద ఏజెన్సీలే ఈ మొత్తాన్ని కట్టినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. 2016 నుంచి 2022 వరకు మెడికల్ కాలేజీ సీట్ల అడ్మిషన్లపై అవకతవకలు జరిగినట్లు గుర్తించిన ఈడీ.. మొత్తం రూ. 100 కోట్లు చేతులు మారినట్లు గుర్తించారు.

ఈ వ్యవహారంపై ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదుచేసిన ఈడీ.. గతేడాది జూన్‌లో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ సహా మొత్తం 16 చోట్ల రెండు రోజులపాటు సోదాలు నిర్వహించింది. సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ రికార్డులు, నగదు లావాదేవీలు, పీజీ, ఎంబీబీఎస్ విద్యార్థులు కట్టిన ఫీజుల వివరాలు సేకరించింది.

సోదాల్లో భాగంగా గతేడాది జూన్‌లో మల్లారెడ్డి నివాసం, మెడికల్ కళాశాలతో పాటు కార్యాలయాలపై ఈడీ సోదాలు నిర్వహించి రూ.1.4 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. పీజీ ప్రవేశాలకు సంబంధించి అనుమానాస్పదంగా కనిపించిన మల్లారెడ్డి కళాశాలకు చెందిన బ్యాంకు ఖాతాల్లోని రూ. 2.89 కోట్లను ఫ్రీజ్ చేసింది.

రాష్ట్రంలోని 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని 45 సీట్లను బ్లాక్ చేసి విక్రయించినట్లు ఈడీ తన సోదాల్లో గుర్తించింది. దీంతో దీనిపై వివరణ ఇవ్వాలంటూ మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు వివిధ ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఈడీ నోటీసులు జారీచేసింది.