13-04-2025 01:39:27 AM
* ‘నేషనల్ హెరాల్డ్’ కేసులో కీలక పరిణామం
* స్థిరాస్తుల జప్తునకు మూడు ప్రాంతాల్లో నోటీసుల అంటివేత
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా రూ.661కోట్ల విలువ చేసే స్థిరాస్తుల జప్తునకు నోటీసులు జారీ చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం తెలిపింది. స్థిరాస్తుల జప్తునకు సంబంధించి ఢిల్లీ, ముంబై, లక్నో ప్రాంతాల్లో నోటీసులు అతికించినట్టు ఈడీ పేర్కొంది.
ఢిల్లీ, లక్నో ప్రాంగణాలను ఖాళీ చేయాలని ఈ నోటీసుల్లో కోరింది. ముంబై బిల్డింగ్ వరకూ ఒక ఆప్షన్‌గా దాని అద్దెను ఈడీకీ ట్రాన్స్‌ఫర్ చేసే వెసులుబాటును కల్పించింది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) ప్రచురణ కర్తగా ఉంది.
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహు ల్ సహా కొందరు పార్టీ నేతలు ప్రమోటర్లుగా ఉన్న ‘యంగ్ ఇండియన్ ప్రైవే ట్ లిమిటెడ్’ దానికి యాజమాన్య సంస్థ. కాంగ్రెస్‌కు ఏజేఎల్ బకాయి పడ్డ రూ. 90 కోట్లను వసూలు చేసుకునే విషయంలో ‘యంగ్ ఇండియన్’ లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను విచారించిన ఈడీ వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది.