calender_icon.png 14 April, 2025 | 8:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీకి ఈడీ షాక్

12-04-2025 07:58:45 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. అసోసియేటెడ్ జర్నల్స్ సంస్థ ఆస్తుల స్వాధీనానికి ఈడీ రంగం సిద్దం చేసింది. ఢిల్లీ, ముంబై, లక్నోలోని ప్రాపర్టీ రిజిస్ట్రార్లకు ఈడీ ఏప్రిల్ 11వ తేదీన నోటీసులు జారీ చేసింది. అసోసియేటెడ్ జర్నల్స్ సంస్థకు చెందిన ఆస్తులను రాహుల్ గాంధీ, సోనియా గాంధీ యాజమాన్యంలోని యంగ్ ఇండియన్ కంపెనీ ద్వారా కొనుగోలు చేయబడ్డాయి. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ లో వీరికి ఒక్కొక్కరికి 38 శాతం వాటాలు ఉన్నాయి. ఈ కేసు నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికను పబ్లిష్ చేసిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ని యంగ్ ఇండియన్ కంపెనీ కొనుగోలు చేయడంలో జరిగిన ఆర్థిక అవకతవకలకు పాల్పడుతూ, నిధులు దుర్వినియోగం చేసిందనే ఆరోపణలకు సంబంధించింది.

కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ పై జరిగిన మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో జప్తు చేసిన రూ.661 కోట్ల విలువైన స్థిరాస్తుల స్వాధీనానికి ఈడీ శనివారం నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ఐటీఓలోని హెరాల్డ్ హౌస్, ముంబయిలోని బాంద్రా ప్రాంతంలోని ఆస్తిని, లక్నోలోని బిశేశ్వర్ నాథ్ రోడ్ లోని ఏజేఎల్ భవనాన్ని ఖాళీ చేయాలని ఈడీ నోటీసులో పేర్కొంది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్(8), రూల్ 5(1) కింద ఈ ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటున్నారు. బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి రూ.2000 కోట్లకు పైగా ఆస్తులను నియంత్రించడానికి యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్, అసోసియేటెడ్ జర్నల్స్  ఆస్తుల్ని దుర్మార్గపు పద్ధతిలో స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.