calender_icon.png 22 April, 2025 | 2:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నటుడు మహేష్ బాబుకు ఈడీ నోటీసులు

22-04-2025 09:54:11 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27వ తేదీన విచారణకు హాజరు కావాలని మహేష్ బాబుకు సమన్లు ​​జారీ అయ్యాయి. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారాలకు సంబంధించి ఈడీ నోటీసులు ఇచ్చింది. గత వారం రెండు రోజుల పాటు ఈ కంపెనీలలో ఈ ఏజెన్సీ సోదాలు నిర్వహించింది. ప్రమోషనల్ ఏర్పాటులో భాగంగా మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్ నుండి రూ.5.9 కోట్లు అందుకున్నారని, ఇందులో రూ.3.5 కోట్లు నగదుగా చెల్లించగా, మిగిలిన రూ.2.5 కోట్లు రియల్-టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (RTGS) ద్వారా బదిలీ చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

రెండు సంస్థలకు మహేశ్ బాబు ప్రచారకర్తగా ఉన్నారని, పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ఇన్ ప్లుయెన్స్ చేశారనే అభియోగంపై సమన్లు ​​జారీ అయ్యాయి. ఏజెన్సీ ఇప్పుడు ఆయనకు చెల్లించిన పారితోషికంపై దర్యాప్తు చేస్తోంది. మహేష్ బాబు తన భార్య, పిల్లలతో కలిసి సాయి సూర్య డెవలపర్స్ కోసం ఒక ప్రకటనలో కనిపించిన విషయం తెలిసిందే. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. సాయి సూర్య డెవలపర్స్ యజమాని కె. సతీష్ చంద్ర గుప్తా, సురానా గ్రూప్ డైరెక్టర్ నరేంద్ర సురానాతో పాటు మరికొందరు కొనుగోలుదారులను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్‌లను విక్రయించడం, ఒకే ప్లాట్‌ను బహుళ వ్యక్తులకు విక్రయించడం, రిజిస్ట్రేషన్‌కు సంబంధించి తప్పుడు వాగ్దానాలు చేయడం వంటి అభియోగాలు వారిపై ఉన్నాయి. ఇంకా, మోసపూరిత కార్యకలాపాలలో మహేష్ బాబు ప్రత్యక్షంగా పాల్గొనకపోవచ్చు కానీ, సాయి సూర్య ప్రాజెక్టులకు ఆయన ఆమోదం తెలిపినందున చాలా మంది పెట్టుబడిదారులు తమ డబ్బును వాటిలో పెట్టారని ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో భాగంగా మహేష్ బాబు అందుకున్న పారితోషికంపై ఈడీ ఆరా తీయనుంది.