calender_icon.png 1 October, 2024 | 9:11 PM

సిద్ధుపై ఈడీ కేసు నమోదు

01-10-2024 12:33:47 AM

 ముడా స్కాం కేసులో కర్ణాటక సీఎంకు మరో షాక్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ముడాస్కాం కేసులో మరో బిగ్ షాక్ తగిలింది. ఈ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా ఆయన మీద మనీలాండరింగ్ కేసు నమోదుచేసింది. మడా స్కామ్‌పై విచారించిన లోకాయుక్త పోలీసులు.. సిద్ధరామయ్య, ఆయన భార్య బీఎం పార్వతి.. బావమరిది మల్లికార్జున స్వామి, దేవరాజు నుంచి భూమి కొనుగోలు చేసి సీఎం భార్యకు కానుకగా ఇచ్చారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

ఈ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా.. సెంట్రల్ ఏజెన్సీ సిద్ధరామయ్యతో పాటు మరికొందరిపై ఈసీఐఆర్ ద్వారా కేసు నమోదు చేసింది. దీంతో నిందితులను విచారణ సమయంలో కోర్టుకు పిలవడంతో పాటు వారి ఆస్తులను అటాచ్ చేసేందుకు ఈడీకి అధికారం దక్కినట్లుంది.

అయితే ఇటీవల ముడా స్థలాల కేటాయింపుల్లో సీఎం సిద్ధరామయ్య కుటుంబం లబ్ధి పొందిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఆ రాష్ట్ర గవర్నర్  ఆదేశాల మేరకు సిద్ధరామయ్యపై కేసు బుక్ అయిన విషయం తెలిసిందే.

ఫిర్యాదుదారిడిపై కేసు నమోదు..

కర్ణాటక సీఎం, అతడి కుటుంబ సభ్యులు ముడాస్కాంలో ఉన్నారంటూ ఫిర్యాదు చేసిన ముగ్గురిలో ఒకరైన ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణపై.. ఓ మహిళ దాడి, వేధింపుల కేసు నమోదు చేసింది. కృష్ణ తన స్నేహితులతో కలిసి తనపై దాడికి యత్నించాడని, అసభ్యపదజాలంతో చంపేస్తానని బెదిరించాడని ఫిర్యాదుదారు లావణ్య ఆరోపించారు.

జూలై 18న లావణ్య, ఆమె తల్లి కోర్టు నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. చనిపోయిన తన భర్త కుటుంబానికి సంబంధించిన ఆస్తి తగాదా, మరణ లబ్ధిదారుడి డబ్బు, తన నగలు పంచడం వంటి కారణాలతో కృష్ణ తన అత్తమామల తరఫున వ్యవహరిస్తున్నారని లావణ్య ఆరోపించారు. కాగా లావణ్య భర్త 2020లో చనిపోయారు. నపై వచ్చిన ఆరోపణలను కృష్ణ కొట్టిపారేశారు.