calender_icon.png 19 April, 2025 | 7:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోనియా, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జిషీట్

16-04-2025 12:56:44 AM

శామ్ పిట్రోడా, సుమన్ దూబే పేర్లు కూడా

‘నేషనల్ హెరాల్డ్’ మనీలాండరింగ్ కేసు

ఈ నెల 25న తదుపరి విచారణ

ఈడీ విచారణకు హాజరైన రాబర్ట్ వాద్రా

షికోపూర్ భూ ఒప్పందంలో ఆర్థిక అవకతవకలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ‘నేషనల్ హెరాల్డ్’ మనీలాండరింగ్ కేసులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఛార్జిషీట్‌లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను తొలిసారి చేర్చింది. వీరిద్దరితో పాటు కాంగ్రెస్ ఓవర్సీస్ యూ నిట్ చీఫ్ శామ్ పిట్రోడా, సుమన్ దూబే సహా కేసుతో సంబంధమున్న సంస్థలు, మరికొందరి పేర్లను జతచేసింది.

అంతేకాదు యంగ్ ఇండియన్ సంస్థ ద్వారా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారంటూ ఈ డీ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 25న జరపాలని ఢి ల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయించింది. ఇప్పటికే ఈ కేసుతో ముడిపడి ఉన్న రూ. 661 కోట్ల స్థిరాస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అక్రమ చలామణి నిరోధక చట్టంలోని సెక్షన్ (8), నిబంధన  5(1) ప్రకారం జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియను మొద లుపెట్టినట్టు ఈడీ పేర్కొంది.

హరియాణాలో షికోపూర్ భూ ఒప్పందంతో ముడిపడి ఉ న్న మనీలాండరింగ్ కేసులో ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాను ఈడీ ప్రశ్నించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ పరిణా మం చోటుచేసుకోవడం గమనార్హం. నేషన ల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీ, రా హుల్ గాంధీని ఈడీ గతంలో పలుమార్లు విచారించింది. విదేశీ నిధులతో నేషనల్ హె రాల్డ్ పత్రికను పెంచి పోషించారన్న ఫిర్యాదుల మేరకు ఈడీ, సీబీఐ దర్యాప్తు చేశాయి. సీబీఐ విచారణ మధ్యలోనే నిలిచినప్పటికీ ఈడీ దర్యాప్తు మాత్రం కొనసాగుతోంది. తా జాగా ఢిల్లీ ప్రత్యేక కోర్టులో ఛార్జిషీట్ దాఖ లు చేసిన ఈడీ తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్టు తెలిపింది. 

ఈడీ విచారణకు రాబర్ట్ వాద్రా

కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెం ట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. హరియాణాలోని షికోపూర్‌లో భూ ఒప్పందానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు విషయంలో ఈ నెల 8న తొలిసారి రాబర్ట్ వాద్రాకు ఈడీ సమన్లు జారీ చేయగా.. వాటిని ఆయన పట్టించుకోలేదు.

దీంతో మంగళవారం ఈడీ రెండోసారి నోటీసులు జారీ చేసింది.దీంతో రాబర్ట్ వాద్రా తన నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి నడుచుకుంటూ వెళ్లారు. ఈ సందర్భంగా రాబర్ట్ వాద్రా మీడియాతో మాట్లాడారు. ఇది బీజేపీ రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణించారు. ‘నేను ప్రజల పక్షాన గొంతు వినిపించిన ప్రతీసారి వాళ్లు నన్ను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదం తా రాజకీయ ప్రతీకార చర్య. ప్రజలు నేను రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు.

గత 20 ఏళ్లలో ఈడీ నుంచి సమన్లు అందడం ఇది 15వ సారి. ఎప్పటిలాగే ఈడీ విచారణకు సహకరిస్తా. అధికారులు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తాను’ అని వాద్రా పేర్కొన్నారు. ఈడీ వివరాల ప్రకారం.. వాద్రా కంపెనీ 2008 ఫిబ్రవరిలో గుర్గావ్‌లోని షికోపూర్‌లో 3.5 ఎకరాల స్థలాన్ని ఓంకారేశ్వర్ ప్రాపర్టీ నుంచి కొనుగోలు చేసింది. దీని విలువ రూ. 7.5 కోట్లు. ఆ తర్వాత వాద్రా కంపెనీ ఆ భూమిని  డీఎల్‌ఎఫ్‌కు రూ. 58 కోట్లకు విక్రయించింది. డీఎల్‌ఎఫ్‌కు రూ. 58 కోట్ల భారీ లాభంతో విక్రయించడంతో మనీలాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. 

ఏమిటీ ‘నేషనల్ హెరాల్డ్’ కేసు?

2012లో నేషనల్ హెరాల్డ్‌పై బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన ఫిర్యాదుతో ఈ కేసు విచారణ ప్రారంభమైంది. కాంగ్రెస్ సీనియర్లు సోనియా, రా హుల్ సహా ఇతరులు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)ను స్వా ధీనం చేసుకున్నారని, తద్వారా రూ. 2వేల కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా పొందారని ఆరోపణలు వెల్లువెత్తాయి.