calender_icon.png 1 April, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీపీ ఆచార్యపై ఈడీ కేసు కొట్టివేత

22-03-2025 12:21:47 AM

లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు భూకేటాయింపు కేసులో హైకోర్టులో ఊరట 

హైదరాబాద్, మార్చి 21 (విజయక్రాంతి): జగన్ ఆస్తుల వ్యవహారంలో భాగంగా లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు భూకేటాయింపులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో నిందితుడైన ఐఏఎస్ అధికారి, ఏపీఐఐసీ వైఎస్ చైర్మన్, ఎండీ బీపీ ఆచార్యకు హైకోర్టులో ఊరట లభించింది. అనుమతుల్లేకుండా ఈడీ కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోవడం చెల్లదంటూ హైకోర్టు తేల్చిచెప్పింది.

బీపీ ఆచార్యపై ఈడీ నమోదు చేసిన కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సీఆర్పీసీ సెక్షన్ 197(1) కింద రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో ప్రాసిక్యూషన్ చేయడానికి వీల్లేదని తెలిపింది. ఒకవేళ ప్రాసిక్యూషన్‌కు అనుమతి పొందిన తర్వాత ఈడీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించవచ్చని ఈడీకి సూచించింది.

అనంతపురం జిల్లా గోరంట్ల, చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో వైఎస్ ప్రభుత్వ హయాంలో వైఎస్ సన్నిహితుడైన ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డికి చెందిన లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు 8,844 ఎకరాలు కట్టబెట్టడంపై ఈడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ బీపీ ఆచార్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్ కే లక్ష్మణ్ ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది టీ ప్రద్యుమ్నకుమార్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ సీఆర్పీసీ సెక్షన్ 197(1) కింద ప్రాసిక్యూషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరని పేర్కొంటూ హెటిరో వ్యవహారం లో ఇదే పిటిషన్‌పై, ఇండియా సిమెంట్స్‌లో మాజీ ఐఏఎస్ ఆదిత్యనాథ్‌పై కేసును కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించిందన్నారు.

హైకో ర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఈడీ ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఉండాల్సిందేనం టూ ఆచార్యపై కేసును కొట్టివేశారు. అనుమతులు పొందాక ఈడీ కోర్టు ను ఆశ్రయించవచ్చన్నారు.