అక్రమ వలసలే లక్ష్యంగా తనిఖీలు భారీగా ఆయుధాలు, నగదు స్వాధీనం!
కరెన్సీ ప్రింటింగ్ మెషిన్లు, ప్రింటింగ్ పేపర్లు సీజ్
జార్ఖండ్, నవంబర్ 11: జార్ఖండ్, బెంగాల్‌లో అక్రమ చొరబాటుదారులపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌కు సంబంధించి పలు ప్రాంతాల్లో ఈడీ మంగళవారం దాడులు నిర్విహించింది. కొంతమంది నుంచి నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ పాస్‌పోర్టులు, అక్రమ ఆయుధాలు, స్థిరాస్తి పత్రాలు, నగదు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. నకిలీ ముఠాకు చెందిన వ్యక్తుల నుంచి ప్రింటింగ్ పేపర్లు, ప్రింటింగ్ మెషీన్లు, ఆధార్‌ను ఫోర్జరీ చేయడానికి కావాల్సిన ప్రొఫార్మాతో సహా నేరారోపణ చేసేందుకు కావాల్సిన ఆధారాలను గుర్తించినట్లు ఏజెన్సీ తెలిపింది.. జార్ఖండ్, బెంగాల్‌లో కలిపి మొత్తం 17 చోట్ల సోదాలు జరిగినట్లు జాతీయ వార్తాసంస్థ పీటీఐ వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జార్ఖండ్‌లో కొంతమంది బంగ్లాదేశ్ మహిళల చొరబాటు, అక్రమ రవాణా జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ కేసులో చొరబాట్లకు కారణమైన అవినీతి, డబ్బులు చేతులు మారటంపై ఈడీ దృష్టి పెట్టి కేసు నమోదు చేసింది. బంగ్లా చొరబాట్ల్లపై ఇదే ఏడాది జూన్‌లో రాంచీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బంగ్లాదేశ్‌లో పనిలేక బంగ్లా దేశీయులు భారత్‌లోకి చొరబడుతున్నారని ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల బంగ్లా అక్రమ వలసల గురించి ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన మహిళ సైతం అక్రమంగా భారత్‌కు వచ్చినవారే కావడం గమనార్హం.
జేఎంఎం సహకారంతోనే చొరబాట్లు: మోదీ
జార్ఖండ్‌లో అక్రమ వలసలు పెరగడాని కి కారణం రాష్ట్రంలో అధికారంలో ఉన్న జేఎంఎం పార్టీనేనని ప్రధాని మోదీ ఆరోపించారు. గిరిజన ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో జనాభా స్వరూపాన్ని మార్చేందుకు అధికార కూటమి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఇలాంటి అకృత్యాలకు తమ ప్రభుత్వం మద్ద తు ఇవ్వదని స్పష్టం చేశారు. ఎన్నో ఖనిజ వనరులను గుండెల్లో పెట్టుకున్న జార్ఖండ్‌ను అభివృద్ధి పథంలోకి నడిపిస్తామన్నారు.