calender_icon.png 28 April, 2025 | 5:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రకృతి ఒడిలో పరవశం

27-04-2025 12:00:00 AM

భూటాన్ దేశం ఆచారాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. చుట్టూ నిటారుగా ఉండే పెద్ద పెద్ద కొండలు, ఎటు చూసినా సెలయేళ్లు, పొల్యూషన్ లేని అడవులు.. ఇదీ అసలు సిసలు భూటాన్. వెస్ట్రన్ కంట్రీస్ కల్చర్ ప్రభావం ఏమాత్రం పడకుండా ఇప్పటికీ ఈ చిన్న దేశం సంప్రదాయాలను కాపాడుకుంటున్నది. భూటాన్‌లోకి అడుగుపె డితే అడవి పక్కనే ఉండే ఓ పెద్ద పల్లెటూరులోకి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది.

సౌత్ ఆసియాలోని ఈ చిన్న దేశం 1974 వరకు ప్రపంచానికి దూరంగా బతికింది. మిగతా దేశాల ప్రజలెవరూ భూటాన్ వైపు చూసేవారు కాదు. 1974 తర్వాత మార్పులు వచ్చాయి. టూరిస్టులు ఈ హిమాలయ దేశానికి రావడం మొదలైంది. ఇప్పుడు భూటాన్‌కు టూరిస్టుల తాకిడి పెరిగింది. ప్రకృతి అందాల నడుమ ఉండే ఈ చిన్ని దేశాన్ని చూడటానికి విదేశీ టూరిస్టులు బాగా ఉత్సాహం చూపుతుంటారు. భూటాన్ వెళ్లాలంటే ఇండియన్లకు వీసా అక్కర్లేదు. 

ఆహారపు అలవాట్లు.. 

ఇక్కడి జనాభాలో 80 శాతం మంది వ్యవసాయం మీదే ఆధారపడి బతుకుతారు. టూరిజం తర్వాత ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయమే. నూటికి నూరు శాతం ఇక్కడ పొలం పనులు ఆపేస్తారు. వ్యవసాయానికి ప్రకృతి సహకరించదు. అసలు ఫుడ్ దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో సమ్మర్ సీజన్ లోనే అవసరమైన ఆహారాన్ని నిల్వ చేసుకుంటారు.

భూటాన్ ప్రజల్లో మూడింట రెండు వంతుల మంది బుద్ధిజాన్ని ఫాలో అవుతారు. ఒక వంతు ప్రజలు హిందూయిజం అనుసరిస్తారు. ఇక్కడి ప్రజల్లో తక్కువ శాతం మంది నాన్ వెజ్ తింటారు. అయితే మాంసం కోసం జంతువులను చంపడాన్ని నిషేధించారు. ప్రజల అవసరాలకు తగినంత నాన్‌వెజ్ ఫుడ్‌ను ఎక్కువగా ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటారు. 

ఆకర్షణీయమైన స్టాంపులు..

భూటాన్ స్టాంపులకు ఓ స్పెషాలిటీ ఉంది. గమ్మత్తయిన డిజైన్లను స్టాంపులుగా ఇక్కడ ముద్రిస్తారు. రంగురంగుల్లో ఉండే ఈ డిజైన్లు చూసేవాళ్లను బాగా ఆకట్టుకుంటాయి. 1962లో భూటాన్ తొలి పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. దేశ గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియచేయడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా ఇలాంటి డిజైన్లను పోస్టల్ డిపార్ట్‌మెంట్ సెలెక్ట్ చేసుకుంటుంది.

బంగారుపూత పూసిన భూటాన్ రాజుల బొమ్మలను స్టాంపులుగా రిలీజ్ చేసే ట్రెండ్ 1966 వరకు నడిచింది. సువాసన వచ్చే రోజ్ స్టాంపులను 1973లో విడుదల చేసింది. త్రీడీ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు కాని 1967లోనే త్రీడీ స్టాంపులు విడుదల చేసింది భూటాన్. వీటిపై ఆస్ట్రోనాట్స్, లూనార్ మాడ్యూల్స్ బొమ్మలను వేశారు. 

ఒకేఒక్క ఎయిర్ పోర్టు..

భూటాన్‌లో ఒకేఒక్క ఎయిర్ పోర్టు ఉంది. అదే పారో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు. భూటాన్ నుంచి ఏ దేశానికి వెళ్లాలన్నా పారో ఎయిర్ పోర్టే ఆధారం. గతంలో ఇక్కడ రైల్వే నెట్ వర్క్ కూడా ఉండేది కాదు. అయితే సౌత్ భూటాన్‌లో రైళ్లు ప్రవేశపెట్టాలని అక్కడి సర్కార్ నిర్ణయించుకుని..

ఇండియాతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంది. భూటాన్ పాలకులు ప్రయారిటీ మొత్తం మంచి పాలన అందించడం, ఉన్నంతలో తృప్తిగా బతకడం, సంప్రదాయాలను పాటించడంతోనే ప్రజలు హ్యాపీగా ఉంటారని వారి నమ్మకం. 

థింపూ నగరం..

భూటాన్ రాజధాని థింపూ నగరానికి ఒక ప్రత్యేకత ఉంది. థింపూలో ఎక్కడా ట్రాఫిక్ లైట్లు కనిపించవు. ఎందుకంటే రాజధాని నగరంలో ట్రాఫిక్ జామ్ లనే ముచ్చటే ఉండదు. వాహనాలు చాలా నెమ్మదిగా నడుపుతారు ఇక్కడి ప్రజలు. యాక్సిడెంట్లు చాలా అరుదు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కాని ఇది నిజం.