-ప్రొ. కూరపాటి వెంకట్ నారాయణ
కల్వకుంట్ల పాలకులు అవినీతే లక్ష్యం గా, విచ్చలవిడిగా అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసి, ప్రజల ఆగ్రహానికి గురై తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత అనూహ్యంగా అధికారం కోల్పోయారు. వెనువెంటనే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఓటర్లు చంద్రశేఖర రావు ముద్దుబిడ్డ భారత రాష్ట్ర సమితికి మొండిచేయి చూపించి లోక్‌సభలో అడుగు కూడా పెట్టనియ్యలేదు.
లక్షల కోట్ల దుర్వినియోగం
ఓట్లు, ఎన్నికలు, గెలుపు లక్ష్యంగా అనుత్పాదక పథకాలను ప్రవేశపెట్టి లక్షల కోట్ల రూపాయల దుర్వినియోగం చేయడం జరిగిందని ఇటీవల బయల్పడిన అనేక ఉదంతాలు తెలియ చేస్తున్నాయి. ముఖ్యంగా మిషన్ కాకతీయ, భగీరథ, కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టు, థర్మల్ విద్యుత్తు ప్రాజెక్టుల కోసం మరో రెండు లక్షల కోట్లతోపాటు భూస్వాములు, రియల్టర్లు, కార్పొరేట్ వ్యాపారుల భూములకు ఐదు సంవత్సరాల్లో రైతుబంధు ద్వారా కనీసం 30 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పంచి పెట్టడం జరిగింది.
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 10 సంవత్సరాలలో కనీసం 7- 8 వేల కోట్లయినా అస్మదీయులకు పంపిణీ చేశారు. మరో 5,000 కోట్ల రూపాయలు సొంత మీడియాకు ధారాదత్తం చేశారని ఇప్పటికీ లోకం కోడై కూస్తోంది. విద్య వైద్య రంగాలకు నిధుల కోత పెట్టి మానవాభివృద్ధిని మంట కలిపారు. 600 గురుకుల పాఠశాలలను , జూనియర్ కళాశాలను, 76 సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలను పార్టీ నాయకుల అద్దె భవనాలలో ప్రారంభించి 9 కనీసం రూ. 2వేల కోట్లు అద్దె చెల్లించారే కానీ ఒక్క కాలేజీకి కూడా నూతన భవనాన్ని నిర్మించలేదు.
నిత్యం అప్పుల కోసం వెతుకులాట
ఈ అరాచక, అవినీతి, కుటుంబ పాలనతో విసిగిపోయిన ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలకు ఆకర్షితులై అధికార మార్పిడికి పట్టం కట్టారు. గత సంవత్సరం డిసెంబర్ 9న అధికారం చేపట్టిన నూతన ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గమనించి అవాక్కై తీవ్ర గందరగోళంలో పడిపోయింది. క్యాబినెట్ సబ్ కమిటీ అంచనాల ప్రకారం గత డిసెంబర్ నాటికి రూ.7 లక్షల కోట్ల నికర అప్పుతో రూ.50 వేల కోట్ల చెల్లింపుల బకాయిలు నూతన ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు వెలువడ్డాయి.
తొమ్మిదిన్నర సంవత్సరాల విధ్వంసాన్ని బాగు చేయాలంటే కనీసం రెండు దశాబ్దాలు పట్టవచ్చు. ప్రతి నెలా కనీసం రూ.3,500 కోట్ల వడ్డీలు చెల్లించాలి. వడ్డీలు,అసలు అప్పుల భారం మోయలేక సర్దుబాటు కొరకు నిత్యం అప్పులకే తిరగవలసి వస్తున్నది. ఇక ప్రభుత్వం రాహుల్ గాంధీ ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేర్చేదెలా ? ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగేదెలా అనే ప్రశ్నలు పాలకులు, అధికారులు, మేధావి వర్గాలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.
25 వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీలో 18 వేల కోట్ల రూపాయలు చెల్లించినా మిగిలిన రైతులలో అసంతృప్తి మిగిలే ఉంది. రైతు భరోసా, సన్న వడ్లపై బోనస్, రైతు కూలీలు, మహిళలు, వృద్ధులకు పింఛన్లు, ఆడపిల్లల పెళ్లిళ్లకు తులం బంగారం లాంటి హామీలను ఇంకా మొదలు పెట్టలేదు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు 7000 కోట్ల రూపాయలు చెల్లించ లేదు.
మూసుకుపోయిన మార్గాలు
ప్రస్తుతం ప్రభుత్వ అదనపు వనరులను సమీకరించడం కష్టసాధ్యంగా ఏర్పడింది. గత ప్రభుత్వం తొమ్మిదేండ్ల కాలంలో రిజిస్ట్రేషన్ చార్జీలు, రోడ్డు రవాణా, భారీ వాహనాల చార్జీలు, మద్యం ధరలు అత్యధికంగా పెంచడం జరిగింది. హైదరాబాద్ చుట్టుపక్కల గల విలువైన వేలాది ఎకరాల భూములను కారుచౌకగా అస్మదీయులకు అమ్మడం జరిగింది. ఓఆర్‌ఆర్‌ను ఏకంగా ముప్ఫు సంవత్సరాల వరకు తాకట్టు పెట్టడం జరిగింది. ఇదేవిధంగా అనేక జిల్లాల్లో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టారు.
కొన్ని ప్రభుత్వ ఆస్తులను లీజుకు తమ నాయకులకే కట్టబెట్టారు. ప్రభుత్వం మారకముందే రియల్ ఎస్టేట్ శరవేగంగా డీలాపడడం ప్రారంభించినా ఇటీవలి కాలంలో పూర్తిగా స్తబ్దతకు గురి అయింది. ఇక మద్యం దుకాణాల విస్తరణ లేదా మద్యం ధరలను మరింత పెంచడం సాధ్యం కాదు. ఇప్పటికే మద్యం ద్వారా రాష్ట్ర ప్రజల ఆరోగ్యంతో పాటు, ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నది. రియల్ ఎస్టేట్ వ్యవస్థ ఇప్పుడప్పుడే కోలుకునే పరిస్థితి లేదు. అదనపు పన్నులు విధించే అవకాశాలు కనిపించడం లేదు.
ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తేలేరు. నూతన ప్రభుత్వం ఇచ్చిన కొత్త హామీలు అమలుపరచడానికి ఆర్థిక వెసులుబాటు లేక ప్రభుత్వ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గత ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ చెల్లింపులు ఇవ్వలేక అడగకముందే ఉద్యోగ విరమణ వయస్సు 58 ఏండ్లనుండి 61 సంవత్సరాలకు పెంచడం జరిగింది. ప్రస్తుతం ప్రతినెలా అనేక వందల మంది పదవీ విరమణ చేయడం ద్వారా ప్రభుత్వంపై పెను భారం పడనుంది.
నూతన ప్రభుత్వం అదనంగా 60 వేలమందికి ఉద్యోగాలు ఇవ్వడం వలన ఈ భారం రెట్టింపు అవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఐదు కరువు భత్యం వాయిదాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వ పనులు చేసిన చిన్నా చితక కాంట్రాక్టర్లు తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినా ప్రయోజనం లేక తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుత సంవత్సరం రూ.45 వేల కోట్ల కొత్త అప్పులు తెచ్చినప్పటికీ 35 వేల కోట్లు పాత అప్పులు, వడ్డీలుచెల్లించడానికే సరిపోయింది. ఆర్థిక ఇబ్బందులు ఇలాగే కొనసాగితే అప్పుల భారం తగ్గేడెన్నడు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేది ఎప్పుడు ? ప్రభుత్వ వ్యయాలు పెరుగుతున్నప్పటికీ ఆదాయాలను పెంచుకోలేని పరిస్థితి దాపురించింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా మన రాష్ట్రప్రభుత్వానికి తగిన విధంగా సహకరించకపోవచ్చు. మూలిగే నక్కపై తాటి పండులాగా ఆర్థిక వ్యవస్థ పరిస్థితి భయంకరంగా కనిపిస్తున్నది.‘లోటు సంసారానికి ఇల్లటం వచ్చిన చందం’ గా ఉంది రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి.
కాయకల్ప చికిత్స అవసరం
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కాయకల్ప చికిత్స లాంటి సంస్కరణలు చేపట్టనిదే తీవ్ర అస్వస్థతకు పడిపోయే ప్రమాదం పొంచి ఉన్నదని మేధావులు, నిపుణులు, ఉద్యమకారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నా రు. ఈ విపత్కర పరిస్థితి గమనించిన కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఇప్పుడే వీధిన పడుతున్నారు. తొమ్మిదిన్నరేళ్ల పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసి అప్పుల పాలు చేసిన నాయకులే తిరిగి నిత్యం రోడ్డున పడి ప్రజలను ఉసిగొలుపుతూ రాద్ధాంతం చేస్తున్నారు.
ఎన్నికల హామీలను నమ్మి ప్రజలు మోసపోయి తప్పు చేశారంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రజలలో వ్యతిరేకత వస్తే ఉపయోగించుకొని ఏ విధంగానైనా తిరిగి అధికారం చేజిక్కించుకోవాలని ఆశగా ఎదురుచూస్తున్నారు.
అందువల్ల తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న నిధుల కొరత, చెల్లింపుల సంక్షోభం నుండి బయటపడే సంస్కరణలు చేపట్టాలి. దినదినం పెరుగుతున్న ప్రభుత్వ వ్యయాన్ని క్రమబద్ధీకరించవలసిన అవసరాన్ని గుర్తించాలి. ప్రజలపై అదనపు, అధిక భారం పడకుండా పన్నుల వసూళ్లు, ఇతర పన్నేతర ఆదాయాలు పెంచుకోవాలి.సాధారణ ప్రజల ఆదాయాలను పెంపొందించే ఆర్థిక వ్యూహాలను అమలు చేయాలి.
అనుత్పాదక పథకాలను పునః పరిశీలించాలి. అవినీతి లేని నాణ్యత గల పరిపాలన అందించినట్లయితే అసంతృప్తి చెందుతున్న ప్రజలు కూడా శాంతిస్తారు, నూతన ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారు.