- ఫెడరలిజాన్ని అణచివేస్తున్న సెంటర్
- స్టేట్ బడ్జెట్‌పై కేంద్ర పథకాల ప్రభావం
- జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం
- పన్నుల వాటాను 50శాతానికి పెంచాలి
- కేరళలో జరిగిన ఆర్థికమంత్రుల కాన్‌క్లేవ్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, సెప్టెంబర్ 12(విజయక్రాంతి): కేంద్ర ఆర్థిక ఆధిపత్యం వల్ల రాష్ట్రాల అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని, నిధులు సరిపోవడం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దేశంలో 16వ ఆర్థిక సంఘం పర్యటిస్తున్న నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక వనరులను అసమానంగా పంపిణీ చేస్తోందంటూ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పంజాబ్ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు గళం విప్పారు. గురువారం కేరళలోని తిరువనంతపురంలో పినరయి విజయన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్థిక మంత్రుల కాన్‌క్లేవ్‌లో భట్టి విక్రమార్క మాట్లాడారు.
ఫిజికల్ ఫెడరలిజాన్ని కేంద్రం అణచివేస్తోందని ఆయన ఆరోపించారు. రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని, ఫలితంగా రాష్ట్రాల అభివృద్ధికి ఆటంకం కలుగుతోందన్నారు. 14వ ఆర్థిక సంఘం పన్నుల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచుతూ కేంద్రానికి సిఫార్సులు చేసిందని గుర్తు చేశారు. కానీ అనేక షరతులతో ఆ గ్రాంట్లను కేంద్రం విడుదల చేస్తోందని భట్టి విమర్శించారు. సెస్‌లు, సర్‌ఛార్జ్‌ల పంపిణీ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి వల్ల రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జీఎస్టీ పంపిణీలో జాప్యం వల్ల రాష్ర్ట బడ్జెట్ ప్లానింగ్ దెబ్బ తింటున్నదని వెల్లడించారు. అలాగే పన్నుల వాటాను 50శాతానికి పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు.
రాష్ర్ట బడ్జెట్‌పై కేంద్ర ప్రభావం..
కేంద్ర ప్రాయోజిత పథకాలు(సీఎస్‌ఎస్) అమలుపై కేంద్రం విధించిన నిబంధనలు రాష్ర్ట బడ్జెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని డిప్యూటీ సీఎం వివరించారు. సీఎస్‌ఎస్ అమలు కోసం రాష్ట్రాలు కేంద్రం షరతులకు అనుగుణంగా తమ స్వంత వనరులను ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం ఇతర కార్యక్రమాలకు కేటాయించిన బడ్జెట్‌ను మళ్లించాల్సి వస్తోందని తెలిపారు. రాజకీయ, భౌగోళిక, సాంస్కృతిక వైరుధ్యాలు ఉన్న భారత్ లాంటి దేశంలో ఒకే విధానాలు అందిరికీ ఆమోదయోగం కాదని అన్నారు. రుణం తీసుకునే విషయంలో రాష్ట్రాలపై కేంద్రం ఆధిపత్యాన్ని చలాయిస్తోందని భట్టి విమర్శించారు.
రుణాన్ని భరించే సామర్థ్యం ఉన్న రాష్ట్రాలను నిరోధించడం తగదని సూచించారు. రుణం విషయంలో రాష్ట్రాలకు ఉన్న పరిమితులు కేంద్రానికి ఎందుకు ఉండవని ప్రశ్నించారు. ఆర్థిక స్వయం ప్రతిపత్తి విషయంలో కేంద్రం అధికారాలను పునర్ నిర్వచించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. జనాభా గణాంకాల ఆధారంగా డీలిమిటేషన్ చేయడం వల్ల లోక్‌సభలో జనాభా నియంత్రణ చేసిన రాష్ట్రాల ప్రాతినిథ్యం తీవ్రంగా తగ్గుతుందని చెప్పారు. దీంతో ఆయా రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలను అణగదొక్కే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ నిర్ణయాధికారంలో దక్షిణాది నేతల రాజకీయ స్వరాన్ని తగ్గుతున్నదని ఆయన పేర్కొన్నారు.