23-04-2025 12:24:32 AM
ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడి
కలెక్టర్‌తో కలిసి అధికారులతో సమీక్ష
నిజామాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): తెలంగాణ వరప్రదా యిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నిలిచే ప్రాంతాలను ఎకో టూరిజం ప్రదేశాలుగా తీర్చిదిద్దుతామ ని ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ నిలిచే నందిపేట మండలం ఉమ్మెడ, జలాల్పూర్ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించేందుకు ఎకో టూరిజం డైరెక్టర్ రంజిత్ నాయక్‌తో కలిసి సీసీఎఫ్ చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం నిజామాబాద్ పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా ముందుగా ఆయన జిల్లా అటవీ శాఖ అధికారి కార్యాలయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి అటవీ, రెవెన్యూ, నీటి పారుదల తదితర శాఖల అధికారులతో సమీక్ష జరిపారు.
ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ఏరియాలో ఎకో టూరిజం అభివృద్ధి కోసం అనువైన పరిస్థితుల గురించి కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, సమగ్ర వివరాలతో నివేదికలు సమర్పిస్తే, తక్షణమే మంజూరీ తెలుపుతూ, నిధులు కేటాయిస్తామని అన్నారు. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ఏరియాలు అయిన ఉమ్మెడలో 1.20 ఎకరాలు, జలాల్పూర్ లో 3 ఎకరాలలో ఎకో టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సమీక్షలో జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా, ఆర్డీఓ రాజాగౌడ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.