calender_icon.png 22 January, 2025 | 1:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎకో ఫ్రెండ్లీగా.. బొజ్జ గణపయ్య!

07-09-2024 05:05:00 AM

వినాయక చవితి.. ఈ పండుగను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇంట్లో వారం నుంచి పెద్దల కబుర్లు.. పిల్లల ముచ్చట్లతో పండుగ వాతావరణంతో నిండిపోతుంది. గణపతిని మనమే తయారు చేద్దామా? దాన్ని ఎలా అలంకరించాలి? చిన్న గణపతి పెట్టాలా? పెద్ద గణపతి పెట్టాలా? ఇలా రకరకాల ముచ్చట్లతో గణనాధుడి సంబురాలు మొదలవుతాయి. ఈ పండుగను పెద్దకంటే.. పిల్లలే బాగా ఎంజాయ్ చేస్తారు. వినాయకుడి ముందు గుంజీలు తీయడం.. భక్తి శ్రద్ధలతో పూజించడం, తీయని పాయసం.. భక్తి పాటలు.. సుగంధ పరిమళంతో నిండిపోతుంది గణనాధుని మండపం. ప్రతిసారి పర్యావరణ వేత్తలు మనల్ని హెచ్చరిస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వల్ల పర్యావరణం కాలుషితం అవుతుందని.. ఇలా అలా కాకుండా ఎకో అంటే పర్యావరణ హితమైన పదార్థాలతో గణేశ్‌ను ఈజీగా ఎలా చేసుకోవాలో.. చూసేయండి.! 

ప్రకృతి పంచభూతాలతో ఏర్పడినది. పంచభూతాలైన భూమి, నీరు, ఆకాశం, గాలి, అగ్నిని దేవుళ్లుగా కొలవటం, రాగి, వేప, తులసి, ఆవు మొదలగు ప్రకృతిలోని జీవరాశులను ఆరాధించే సంప్రదాయం మన సమాజంలో ఉన్నది. వినాయక చవితి పండుగ ఒకప్పుడు సాంప్రదాయంగా జరుపుకొనేది. ఇప్పుడు ఆకర్షణీయ రంగులతో వినాయకుడి ప్రతిమలను పెద్ద ఎత్తున రూపొందిస్తూ వేడుకలు చేసుకుంటున్నాం. సంప్రదాయం ప్రకారం వినాయకుడి ప్రతిమను ప్రకృతిలో సహజసిద్ధంగా దొరికే మట్టితో తయారు చేసి, పూలు, పత్రిలతో భక్తిశ్రద్ధలతో పూజించాలి. ఆ తరువాత వినాయకుడి ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయాలి. అంటే ప్రకృతి నుంచి సేకరించిన మట్టితో తయారు చేసిన గణపతిని ఎలాంటి కృత్రిమ మార్పులు లేకుండా తిరిగి ప్రకృతిలో కలపటం జరిగేది. చాలాకాలంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గణపతి విగ్రహాలు కాకుండా మట్టి గణపతి విగ్రహాలు వాడాలని పర్యావరణ వేత్తలు చెపుతూ వస్తున్నారు. 

కొత్త మట్టితో.. 

వినాయకుడి విగ్రహాన్ని కొత్త మట్టితోనే చేయాలని పూర్వీకులు చెప్పేవారు. కొత్త మట్టి అంటే తొలకరి జల్లులు పడిన తర్వాత మట్టి వాసన వెదజల్లే సమయంలో తీసిన మట్టి అని అర్థం. ఈ మట్టిని వినాయక చవితికి ముందే అంటే వర్షాకాలం ఆరంభానికి ముందే తవ్వితీస్తారు. మట్టి తవ్వాలంటే సహజంగానే ఎవరైనా చెరువులు, కుంటల దగ్గరకు వెళతారు. అలా చెరువులు, కుంటల దగ్గరకు వెళ్లి పూరికలు తీసి, అక్కడి మట్టితోనే ఈ విగ్రహాలు చేయాలని పెద్దలు చెబుతుంటారు. 

ఇంట్లోనే ఈజీగా..

పర్యావరణ హితం కోసం  వినాయక విగ్రహాన్ని మట్టితోనే కాదు కింది పదార్థాలతో కూడా తయారు చేసుకోవచ్చు. అయితే చాలామంది మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. మట్టి విగ్రహ తయారీ కోసం, పర్యావరణ హితమైన గణపతి విగ్రహాన్ని తయారు చేయడానికి మార్కెట్‌లో ఒక కిట్  లభిస్తుంది. ఈ కిట్‌ని ఉపయోగించి వినాయక విగ్రహాన్ని తయారు చేయవచ్చు. వినాయక చవితి సందర్భంగా గణపతి విగ్రహాన్ని ఇంటి వద్ద, బహిరంగ ప్రదేశాల్లో లేదా మండపాలలో ప్రతిష్టించి పూజిస్తారు. విగ్రహాన్ని 9 రోజులు గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. భజన, కీర్తన సహా అనేక మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం 10వ రోజు గణేశ్ విగ్రహాన్ని నదిలో లేదా చెరువులో నిమజ్జనం చేస్తారు. 

సగ్గు బియ్యం

మట్టితో చేసిన లే దా ఇంటిలో పర్యావరణ అనుకూలమైన గణపతి విగ్రహాన్ని అలంకరించేందుకు సగ్గు బియ్యం, డ్రై ఫ్రూట్స్, బియ్యం, రంగురంగుల పప్పులు, ఆర్గానిక్ పెయింట్లను ఉపయోగించవచ్చు. సగ్గు బి య్యాన్ని ఉపయోగించి.. గణపతి విగ్రహాన్ని అద్భుతంగా తయారు చేసుకోవచ్చు. దీన్ని తయారు చేయడానికి కొంచెం ఓపిక ఉంటే సరిపోతుంది. 

పసుపు 

వంట గదిలో లభించే పసుపుతో బొజ్జ గణపయ్య విగ్రహాన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా పసుపును మెత్తగా పిండిగా చేసి ఆ తర్వాత ఆ పసుపుతో వినాయకుడిని విగ్రహాన్ని తయారు చేయాలి. ఇది చాలా సహజ సిద్ధమైన, పర్యావరణానికి ఎలాంటి హాని చేయదు. పసుపు మంచి యాంటీ బ్యాక్టీరియల్ అని అందరికి తెలుసు కదా.  

ఆవు పేడ

ఆవు పేడతో చేసిన విగ్రహాలు పర్యావరణ హితమై నవిగా చెప్పుకొవచ్చు. ఆవు పేడ ప్రకృతిలో లభించే సహజసిద్ధమైన పదార్థం. దీని ద్వారా పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. ఆవు పేడతో విగ్రహాన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని కోసం యూట్యూబ్‌లో.. ఇన్ స్ట్రా గ్రామ్‌లో చాలా వీడియోలు అందుబాటులో ఉన్నాయి. వాటిని అనుసరిస్తే సరిపోతుంది. అలా మార్కెట్‌లో ఒక కిట్ లభిస్తుంది. దాని సహాయంతో కూడా తయారు చేసుకోవచ్చు. వినాయక చవితి రోజు ఆవు పేడతో చేసిన విగ్రహాన్ని ప్రతిష్టించడం వల్ల ఎకో ఫ్రెండ్లీని కాపాడిన వారవుతారు.  

 బంకమట్టితో..

మట్టి జీవాన్ని ఇస్తుంది. మట్టిలో అనేక జీవాలు ఉంటాయి. ఉదాహరణకు మట్టిలో విత్తనం నాటితే అది మహావృక్షంగా మారుతుంది. మట్టి జీవం పోస్తుంది. అదే ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌లో విత్తనం నాటితో ఆ విత్తనం చనిపోతుంది. మొలకెత్తదు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నిర్జీవంగా మార్చే ఒక విష పదార్థం. కాబట్టి మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాన్ని పూజిస్తే జీవం గల దేవుడి ప్రతిమను పూజించినట్లే. మనిషి జీవితం డబ్బు, ఆర్భాటాలతో ముడిపడి లేదు. మనిషి జీవితం గాలి, నీటితోనే ముడిపడి ఉన్నది. కాబట్టి భగవంతుడు మనకు వరంగా ప్రసాధించిన గాలిని, నీటిని, మట్టిని కాపాడుకుందాం. 

కూరగాయలతో..

ఇంటి పెరట్లో పండించే కూరగాయలతో అందంగా, ముద్దుగా గణపయ్యను తయారు చేసుకోవచ్చు. దీని కోసం క్యాప్సికం, క్యాబేజీ, బీరకాయ, వంకాయ, బెండకాయ, సొరకాయ, పచ్చటి ఆకులతో అందంగా అలంకరించుకుంటే సరిపోతుంది. ఇది పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించదు. పర్యావరణ హితం. ఈ గణపతి నిమజ్జనం తరువాత మనకు సేంద్రియ ఎరువుగా పని చేస్తుంది. ఈ సేంద్రియ ఎరువులో కూరగాయల రూపంలో పోషకాహారాన్ని కూడా పొందవచ్చు. ఇవి మాత్రమే కాదు తమలపాకుల గణపతి, చిరుధాన్యాల గణపతి.. ఇలా పర్యావరణ హితమైన గణపతి విగ్రహాలు చాలా ఉన్నాయి. పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించని విగ్రహాలివి. 

బియ్యం పిండితో

ఇంట్లో లభించే బియ్యం పిండితో కూడా గణపతి విగ్రహాన్ని తయారు చేసుకోవచ్చు. బియ్యం పిండితో తయారు చేసిన గణపతికి ఆకులతో, పండ్లతో అలంకరించుకోవాలి. ఇది చూడటానికి చాలా ముచ్చటగా అనిపిస్తుంది.