చెన్నై: భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తన పార్టీని అధికారికంగా నమోదు చేసి, ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనేందుకు అనుమతినిచ్చిందని తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (టీవీకే) చీఫ్ విజయ్ ఆదివారం ప్రకటించారు. తమిళంగా వెట్రి కజగం రాజకీయ పార్టీగా నమోదు కోసం ఫిబ్రవరి 2న భారత ఎన్నికల కమిషన్‌ను సంప్రదించామని, రిజిస్ట్రేషన్ మంజూరు అయిందని ఎక్స్ లో ప్రకటించారు. అయితే విజయ్ 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించాడు. తాజాగా ఈసీ గుర్తింపుతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత సాధించింది.
“మన దేశ ఎన్నికల సంఘం దీనిని చట్టబద్ధంగా పరిగణించింది. ఇప్పుడు మా తమిళగ వెట్రి కజగంను రాజకీయ పార్టీగా నమోదు చేసింది. రిజిస్టర్డ్ పార్టీగా ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనడానికి అనుమతించింది. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది’’ అని విజయ్ అన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర సదస్సుకు సన్నాహాలు ప్రారంభించామని, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలని సూచించారు.