రాష్ట్రంలో ఘర్షణలపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు
అధికారులు నిర్లక్ష్యంగా వ్వవహరించారని గుర్తించిన ఈసీ
రంగంలోకి దిగిన కేంద్ర బలగాలు
పలు చోట్ల 144 సెక్షన్ అమలు, నేతల హౌస్ అరెస్ట్
హైదరాబాద్, మే 15 (హైదరాబాద్): ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు, చంద్రగిరి సహా పలుచోట్ల హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎన్నికల తర్వాత కూడా జరిగిన ఘర్షణలపై వివరణ ఇవ్వాల్సిందిగా సీఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌కుమార్‌గుప్తాను ఆదేశించింది. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఈసీ నోటీసులు పంపింది. పోలింగ్ సమయంలో హింసాత్మక ఘటనలు జరుగుతాయని ముం దే హెచ్చరికలు ఉన్నా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రశ్నించింది. పల్నాడులో స్వయంగా పర్యటించిన ఏపీ ప్రత్యేక అబ్జర్వర్ రామ్మోహన్ మిశ్రా నేరుగా సీఈసీకి నివేదించారు. సీఎస్, డీజీపీ గురువారం ఢిల్లీలో ఈసీ ముందు హాజరుకానున్నారు.
నేతల హౌస్‌అరెస్ట్..
పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. పోలీసులు టీడీపీ, వైసీపీ మధ్య గొడవలు మరింత పెరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకున్నారు. మాచర్ల పట్ణణాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే పిన్నెపల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామిరెడ్డి, నరసరావుపేటలో ఎమ్మెల్యే కాసు మహేశన్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబును గృహనిర్బంధంలో ఉంచా రు. మంగళవారం రాత్రి మాచర్ల మండలం లో వైసీపీ కార్యకర్తలపై ప్రత్యర్థి వర్గం దాడికి దిగింది.
నిన్న రాత్రి తంగెడలో బాధితులను టీడీపీ నేత యరపతినేని పరామర్శించగా అదే సమయంలో కొత్త గణేశునిపాడులో బాధితులను ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి పరామర్శిం చడంతో ఇరువర్గాల వారికి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నేతల పర్యటనలతో మరింత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో ముందస్తుగా హౌస్ అరెస్టులు చేస్తున్నారు. అంతేకాకుండా పలుచోట్ల కేంద్ర బలగాలను మోహరించారు. మరోవైపు గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో దాడులు కొనసాగుతు న్నాయి. మదీనపాడులో వైసీపీ నేతపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. కర్రలతో వైసీపీ నేత దొండేటి ఆదిరెడ్డిపై దాడి చేసింది ప్రత్యర్థి వర్గం. ఈ దాడిలో ఆదిరెడ్డికి తీవ్రగాయాలు కావడంతో పిడుగురాళ్ళ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
తాడిపత్రిలో హైటెన్షన్..
మరోవైపు అనంతపురం జిల్లా తాడిపత్రి నివురుగప్పిన నిప్పులా ఉంది. పోలింగ్ రోజు అక్కడ గొడవలు జరిగినప్పటి నుంచి హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి తలుపులను బద్దలుకొట్టి పోలీసులు లోపలకు వెళ్ళి ఆయన ఇంట్లో ఉన్న వైసీపీ కార్యకర్తలను బయటకు పంపించారు. ప్రస్తుతం తాడిపత్రిలో 144 సెక్షన్ అమ ల్లో ఉంది. మరోవైపు జేసీ ప్రభాకర్‌రెడ్డి, కేతిరెడ్డి, పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి మరో ప్రాం తానికి తరలించారు.
నేతల ఇళ్ళకు వెళ్ళే ప్రాం తాల్లో బందోబస్తు పెంచారు. ఇతర ప్రాంతాల వారు రాకుండా ఆంక్షలు విధించారు. తాడిపత్రిలో కేంద్ర బలగాలతోపాటు జిల్లా పోలీసు లను కూడా మోహరించారు. చంద్రగిరి, తిరుపతిలోనూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతు న్నాయి. రామిరెడ్డిపల్లి, కూచురిపల్లి, తిరుపతిలో పికెటింగ్‌లు కొనసాగుతున్నాయి. టీడీ పీ, వైసీపీ నేతల పరస్పర ఫిర్యాదులతో నాలుగు కేసులు నమోదు అయ్యాయి.
జేసీ ప్రభాకర్‌రెడ్డికి అస్వస్థత..
టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఘర్షణల సమయం లో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయువును ప్రయోగించగా.. దీని ప్రభావంతో జేసీ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జేసీని చూసేందుకు అభిమానులు ఎవరూ ఆస్పత్రికి రావద్దని ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి కోరారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని వైద్యులు తెలిపారు.