ఈ నెల 21 వరకే ప్రస్తుత వీసీల గడువు
10 వర్సిటీల్లో 312 మంది ప్రొఫెసర్ల దరఖాస్తులు
వీసీల ఎంపిక కోసం సెర్చ్ కమిటీల నియామకం
విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడి
హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాలకు కొత్త వైస్ చాన్స్‌లర్స్‌ను నియమించేందుకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వీసీల నియామక ప్రక్రియను వేగవంతం చేసింది. ఎన్నికల కోడ్ ఎత్తివేయక ముందే వీసీలను నియమించుకునేందుకు ఈసీ అనుమతి ఇచ్చిందని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బధవారం తెలిపారు. దీంతో ఒక్కో యూనివర్సిటీకి ముగ్గురు సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీలను వేశామని, అందుకు వేర్వేరు జీవోలను జారీ చేసినట్లు తెలిపారు.
ఈ నెల 21 లేదా నెలాఖరులోపు ప్రక్రియనంతా పూర్తి చేసి కొత్త వీసీలను నియమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కొత్త వీసీలు వచ్చేలోపు ఐఏఎస్ అధికారులు గానీ లేదంటే ఇప్పుడున్న వారికి ఇన్‌చార్జి వీసీలుగా నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 10 యూనివర్సిటీల్లోని వీసీ పోస్టులకు 312 మంది ప్రొఫెసర్లు దరఖాస్తు చేసుకున్నారని, ఒక్కో ప్రొఫెసర్ మూడు, నాలుగు యూనివర్సిటీలకు పోటీ పడటంతో 1,380 దరఖాస్తులు వచ్చాయని బుర్రా వెంకటేశం తెలిపారు. కాగా వీసీల నియామకం కోసం యూనివర్సిటీల పాలకమండలి నామినీ, రాష్ట్ర ప్రభుత్వం నామినీ, యూజీసీ నామినీలతో ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేశారు.
ఈ కమిటీ మూడు, నాలుగు రోజుల్లోనే సమావేశం కానుంది. వీసీ పోస్టులకు వచ్చిన దరఖాస్తులను సెర్చ్ కమిటీ పరిశీలించిన తర్వాత ఒక్కో యూనివర్సిటీకి ముగ్గురు ప్రొఫెసర్లతో కూడిన జాబితాను గవర్నర్ ఆమోదానికి పంపిస్తుంది. అయితే రెండు పర్యాయాలుగా వీసీలుగా పని చేసిన వారికి, 70 ఏళ్లు నిండిన వారికి వీసీలుగా నియమించవద్దని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. యూజీసీ నిబంధనల మేరకు వీసీలను నియమించనుండగా, ఈ పోస్టులకు పోటీ పడే వారి నేపథ్యంపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ విభాగంతో ప్రభుత్వం విచారణ చేయించింది. కొత్తగా నియమితులయ్యే వీసీలకు న్యాయపరమైన, పారిపాలనపరమైన అంశాలపై శిక్షణ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఐఐటీ, ఐఐఎంల పూర్వ డైరెక్టర్లు, ప్రముఖ విద్యావేత్తలు శిక్షణ ఇవ్వనున్నారు.