calender_icon.png 12 January, 2025 | 8:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో వివాదంలో ఈసీ

24-12-2024 12:00:00 AM

ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఇటీవల చేసిన మార్పులు వివాదాస్పదం అవుతున్నాయి. ఎన్నికలకు సంబంధించి ఎలక్ట్రానిక్ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేందుకు అనుమతించే నిబంధనల్లో ఎన్నికల సంఘం ఇటీవల మార్పులు చేసింది. పోలింగ్‌కు సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్, వెబ్‌కాస్టింగ్ రికార్డులను, అభ్యర్థులకు చెందిన వీడియో రికార్డులను బైటి వ్యక్తులు తనిఖీ చేయకుండా ఈసీ నిషేధించింది.

ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు ఎన్నికల నిర్వహణ నిబంధనలు1961లోని రూల్ 93(2)(ఏ)ను కేంద్ర న్యాయశాఖ తాజాగా సవరించింది. అయితే ఈసీ తీసుకున్న ఈ చర్యలను కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఇతర ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఈసీ ఏకపక్షంగా, ప్రజలతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా నిబంధనల్లో మార్పులు చేయడం దారుణమని విపక్షాలు మండిపడుతున్నాయి.

ఇదే అంశంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తాజాగా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేందుకు గతంలో అనుమతి ఉండేది. అయితే ఈసీ ఈ రూల్‌కు సవరణ చేసింది. కొత్త రూల్ ప్రకారం ఇకనుంచి పోలింగ్‌కు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్, వెబ్‌కాస్టింగ్ రికార్డులను, అభ్యర్థులకు చెందిన వీడియో రికార్డులను ఇతరులు తనిఖీ చేయడానికి వీలుండదు.

పోలింగ్ బూత్‌లలోని సీసీ టీవీ కెమెరాల తనిఖీ వల్ల ఓటర్ల గోప్యతకు భంగం కలుగుతోందని, అందుకే నిషేధం విధించామని ఈసీ వర్గాలు అంటున్నాయి. పైగా ఫుటేజ్‌ను వినియోగించుకుని  కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా నకిలీ వీడియోలను తయారు చేస్తున్నారని ఈసీ వర్గాలు అంటున్నాయి. రూల్ 93కి సవరణ తర్వాత కూడా అభ్యర్థులకు ఎలక్ట్రానిక్ రికార్డులు అందుబాటులో ఉంటాయని, కానీ ఇతరులు తనిఖీ చేయడానికి అనుమతి ఉండదని ఈసీ స్పష్టత ఇచ్చింది.

ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలన కోసం అందజేయాలని మెహమూద్ ప్రచా అనే న్యాయవాది పంజాబ్, హర్యానా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఆయన కోరిన డాక్యుమెంట్లను అందించాలని హైకోర్టు ఈ నెల 10న ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. అయితే ఆ న్యాయవాది హర్యానా రాష్ట్ర వాసి కానీ, ఏ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి కానీ కాదని, దురుద్దేశంతోనే ఆయన ఈ పిటిషన్‌ను దాఖలు చేశారని ఈసీ తరఫు న్యాయవాది వాదించారు.

అయితే నిబంధనల ప్రకారం నిర్దేశించిన ఫీజు చెల్లించిన తర్వాత ఎవరైనా ఈ డాక్యుమెంట్లను పరిశీలించడానికి వీలుంటుందని ప్రచా తరఫు న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ప్రచాకు ఆయన కోరిన డాక్యుమెంట్లు అందజేయాలని ఈసీని ఆదేశించింది. ఈ కోర్టు తీర్పే ఈసీ ఈ నిబంధనల్లో మార్పులు చేయడానికి కారణమని తెలుస్తోంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, అందుకే గెలవాల్సిన తమ పార్టీ  ఓడిపోయిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన విషయం తెలిసిందే.

అయితే  ఎన్నికల్లో పారదర్శకతకు ఈసీ చర్య విఘాతమని కాంగ్రెస్‌తో పాటుగా ఇతర ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కోర్టు తీర్పును పాటించాల్సిన ఈసీ అందుకు విరుద్ధంగా నిబంధనల్లో సవరణలు చేయడం విడ్డూరమని, దీన్ని న్యాయపరంగా సవాలు చేస్తామని కాంగ్రెస్ ఇంతకుముందే స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లను ఏకపక్షంగా తొలగించడం, లేదా చేర్చడం వంటి చర్యలకు పాల్పడలేదని కేంద్ర ఎన్నికల సంఘం కాంగ్రెస్ పార్టీకి తెలియజేసింది. మహారాష్ట్ర ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన నేపథ్యంలో ఈసీ ఈ వివరణ ఇచ్చింది.