calender_icon.png 22 February, 2025 | 2:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హోటల్‌లో తింటే.. రోగాలు గ్యారెంటీ

22-02-2025 12:00:00 AM

  1. కుళ్లిన పదార్థాలు, గడువు ముగిసిన సరుకులు
  2. ఎలుకలు, బొద్దింకల మధ్యనే ఆహార పదార్థాలు
  3. దాదాపు అన్ని హోటళ్లల్లోనూ అదే వరుస
  4. కనీస ప్రమాణాలు పాటించని నిర్వాహకులు
  5. ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో బట్టబయలు

శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): మంచిపేరున్న హోటల్స్.. నోరూరించే మెనూ.. కంటికి ఇంపైన ఆహార పదార్థాలు.. వండి వార్చేందుకు వంటగాళ్లు.. వాటిని అంతే మర్యాదగా వడ్డించేందుకు వెయిటర్స్.. ఇప్పుడు నగరంలో ఏ హోటల్ కు వెళ్లినా ఇవన్నీ సర్వసాధారణంగా కనిపించే దృశ్యాలు.

ఇక పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటల్స్ అని చెప్పుకునే వాటిలో రేట్లు కూడా వేలల్లో ఉంటున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే.. నగర జనాలకు రెస్టారెంట్లు, హోటల్స్ లో తినడం అనేది ఓ స్టేటస్ సింబల్ గా ఫీలవుతున్నారు. వీకెండ్ వచ్చింది అంటే చాలు బయటతినడం అనేది మామూలుగా మారింది.

పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు కూడా హోటళ్లలో ఆర్డర్లు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. కానీ జనాలు లొట్టలేసుకుంటూ తినే ఆహారం ఏమాత్రం నాణ్యమైనది కాదని, డబ్బులు ఇచ్చి మరీ కుళ్లిన ఆహార పదార్థాలు తింటున్నారని, రోజుల తరబడి స్టోర్ చేసిన ఫుడ్ ను లొట్టలేసుకుంటూ తింటున్నారన్న విషయం ఫుడ్ సేఫ్టీ అధికారుల తాజా తనిఖీల్లో వెల్లడయింది.

ఆయా హోటల్ లో పరిశుభ్రత గూర్చి తెలిస్తే తిన్నది బయటకు వచ్చేలా ఉందని ఫుడ్ సేఫ్టీ అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

కంటికి బాగుందని తింటే.. ఒంటికి హానికరం..

శేరిలింగంపల్లి పరిధిలో వందలాది రెస్టా రెంట్లు, హోటళ్లు ఉన్నాయి. కొన్ని రెస్టా రెంట్లు, హోటళ్లకు చాలా పేరుంది. అక్కడికి వెళ్లి గంటల తరబడి లైన్ లో ఉండి, టేబుల్ రిజర్వ్ చేసుకుని నచ్చిన ఫుడ్ ఆర్డర్ ఇచ్చి కడుపునిండా లాగించేస్తారు. కానీ మీరు తిన్న ఫుడ్ నాలుకకు ఎంతో రుచిగా ఉన్నా నాణ్యత విషయంలో ఏమాత్రం బాగలేక పోవచ్చని అంటున్నారు ఫుడ్ సేఫ్టీ సిబ్బంది.

ఎందుకంటే ఈ మధ్యకాలంలో నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. చిన్నాపెద్దా అనే తేడాలేకుండా అన్ని హోటల్స్, రెస్టారెంట్లు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, సూపర్ మార్కెట్ ఇలా దేన్ని వదలకుండా తనిఖీలు చేస్తున్నారు.  పెద్ద పెద్ద హోటల్స్ సైతం నాణ్యత పాటించడం లేదని, ఫుడ్ కలర్స్, టేస్టింగ్ సాలట్స్, నాణ్యత లేని మసాలాలు వాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లు గుర్తించారు.

నిషేధిత ఫుడ్ కలర్స్, రుచికోసం టేస్టింగ్ సాలట్స్ వాడకూడదన్న నిబంధనలు ఉన్నా వాటిని యథేచ్ఛగా వాడుతున్నట్లు తేలింది. వంటల్లో రకరకాల ఫ్లేవర్లు కలుపుతూ కష్టమర్ల కడుపుకు ఫుడ్ బదులు పాయిజన్ పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పురుగులు పడిన చికెన్ ను ఫ్రై చికెన్ గా, పాచిపోయిన చికెన్ ను తందూరి అంటూ కష్టమర్లకు వడ్డిస్తున్నారట. 

వామ్మో హోటల్ భోజనమా..!

అధికారులు చేస్తున్న తనిఖీల్లో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నాణ్యత లేని ఆహారం వడ్డిస్తూ వినియోగదారుల జేబులు ఖాళీ చేయడంతో పాటు హోటల్ నిర్వాహకులు వారి ఆరోగ్యాన్ని సైతం నాశనం చేస్తున్నారు. దాదాపు ప్రతిచోటా ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిన ఆహార పదార్థాలు, గడువు ముగిసిన మాంసం, వస్తువులను వంట కోసం ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. నగరంలో కొన్ని హోటళ్ల వంటగదులు మురుగు కాల్వల పక్కనే ఉన్నాయి. ఫైవ్ స్టార్ ఫుడ్ కోర్టులు, ఐస్ క్రీమ్ పార్లర్లు, బేకరీలు, ప్రమాదకర రంగులు, ఇతర కెమికల్స్ ఉపయోగిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. 

పేరు గొప్ప.. నాణ్యత అద్వాన్నం

ప్రముఖ హోటళ్లల్లోనూ ఆహారం రుచిగా ఉండేందుకు సింథటిక్ ఫుడ్ కలర్స్ ను ఉపయోగిస్తున్నారు. అలాగే చాలా హోటళ్లు, రెస్టారెంట్ల వంటగదుల్లో ఆహార పదార్థాలపై బొద్దింకలు తిరగాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీల్లో గుర్తించారు. ది రామేశ్వరం కేఫ్ లాంటి ప్రముఖ హోటళ్లలో కూడా నిర్వాహకులు కక్కుర్తి పడుతున్నారు.

ఇక్కడ గడువు ముగిసిన పెరుగు, మినపప్పు ఇతర పదార్థాలు వినియోగిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. క్రీమ్ స్టోన్, నాచురల్ ఐస్ క్రీమ్, కరాచీ బేకరీ, కెఎఫ్ సీ, రోస్టరే కేఫ్, హౌస్ ఆఫ్ రాయలసీమ రుచులు, షాగౌస్, కామత్ హోటల్, 36 డౌనింగ్ బ్రూ పబ్, మకావ్ కిచెన్ అండ్ బార్, ఎయిర్ లైవ్, టాకోబెల్, ఆహా దక్షిణ్, సిజ్జల్ జో, ఖాన్సాబ్, హోటల్ సుఖ్ సాగర్ వెజ్ రెస్టారెంట్, జుంబో కింగ్ బర్గర్స్, రత్నదీప్ రిటైల్ స్టోర్, బిగ్ బాస్కెట్ ఇలా రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లలో కూడా నాణ్యత లేని నాసిరకం ఆహార పదార్థాలు విక్రయిస్తున్నట్లు తేలింది.