calender_icon.png 27 October, 2024 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీచర్ల బదిలీలకు ‘ఈజీ’ యాప్!

08-08-2024 01:35:47 AM

దీని ద్వారానే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం

హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): పలు కారణాలతో తరచూ తమను బదిలీ చేయాలని, ఓడీ (ఆన్ డ్యూటీ) ఇవ్వాలని, డిప్యుటేషన్ ఇవ్వాలని కోరే టీచర్లు, అధ్యాపకుల కోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్టు సమాచారం. ‘ఈజీ యాప్’ లేదా ‘ఈజీ పోర్టల్’ను అందుబాటులోకి తేనుంది. ఈ రెండింటిలో ఏదేని ఒకటి ఫైనల్ చేసి తద్వారా బదిలీలకు చర్యలు చేపట్టనున్నారు. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరికైతే బదిలీ, ఓడీ, డిప్యుటేషన్ కావాలో వారంతా దీని ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇలా వచ్చిన దరఖాస్తులపై ఇప్పటికే ప్రభుత్వం వేసిన కమిటీ నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల ఉపాధ్యాయులు, లెక్చరర్లు నిత్యం ఏదో ఒక వ్యక్తిగత కారణాలు, ఇతర సమస్యలతో తమను బదిలీ చేయాలని, ఓడీ (ఆన్ డ్యూటీ) ఇవ్వాలని, వేరే చోటుకి డిప్యుటేషన్‌పై పంపించాలని కార్యాలయాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల చుట్టూ తిరుగుతుంటారు. దీంతో దరఖాస్తులను పరిశీలించాలని అధికారులకు రెఫర్ చేయడంతో, అటు అధికారులకు ఇటు ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతోంది.

ఈ క్రమంలోనే బదిలీలు కోరుకునే వారందరూ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పైగా ఎలాంటి పైరవీలకు తావులేకుండా పారదర్శకంగా ప్రక్రియను చేపట్టేందుకు కమిటీని నియిమించినట్టు తెలుస్తోంది. మొత్తం ఐదుగురు సభ్యులతో ప్రభుత్వం ఈ నెల 5న కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో కళాశాల విద్యాశాఖ కమిషనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి, ఇంటర్ విద్యా డైరెక్టర్ సభ్యులుగా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మెంబర్ కన్వీనర్‌గా ఉంటారు.