calender_icon.png 31 March, 2025 | 6:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భయ కంపం

29-03-2025 02:38:10 AM

భూకంపంతో వణికిన మయన్మార్, థాయ్‌లాండ్

153 మందికిపైగా మృతి, 800 మందికి గాయాలు 

బ్యాంకాక్‌లో 110 మంది గల్లంతు, ఎమర్జెన్సీ విధింపు

మృతుల సంఖ్య వేలల్లో ఉంటుందన్న యూఎస్ సంస్థ 

రెండు దేశాలకు భారత్ అండగా ఉంటుంది: ప్రధాని మోదీ

భారత సాయాన్ని స్వీకరించనున్నట్టు మయన్మార్ ప్రకటన

నేపిడా, మార్చి 28: సెంట్రల్ మయన్మార్ కేంద్రంగా శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన రెండు వరుస భారీ భూకంపాలు ఆగ్నేయాసియా దేశాలను వణికించాయి. వరుస భూకంపాల కారణంగా మయన్మార్‌లో అత్యధికంగా ప్రాణ నష్టం సంభవించింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోనూ పలువురు ప్రాణాలు కోల్పోయారు. భూకంప ప్రభావం మయన్మార్, బ్యాంకాక్‌లో అత్యధికంగా ఉండటంతో ఆ ప్రాంతాల్లో విపరీతంగా ఆస్తి నష్టం సంభవించింది. ఆగ్నేయాసియాలోని చైనా, బంగ్లాదేశ్, లావోస్, వియత్నంతోపాటు భారత్‌లోని నాలుగురాష్ట్రాల్లో శుక్రవారం భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురై రోడ్లపైకి పరుగులు తీశారు. సెంట్రల్ మయన్మార్‌లోని మోనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు శాస్త్రవేత్తలు తేల్చారు. మయన్మార్, థాయ్‌లాండ్‌లలో సహాయక చర్యలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. మరోవైపు మయన్మార్, థాయ్‌లాండ్‌లో భూకంపం తర్వాత సహాయ సహకారాలు అందించడానికి ఆగ్నేయాసియాలో ఐక్యరాజ్యసమతి బృందాలను సిద్ధం చేస్తున్నట్టు యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పేర్కొన్నారు. భూకంపాల కారణంగా మరణాల సంఖ్య వేలకు పెరిగే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ఓ ప్రభుత్వ సంస్థ అంచనా వేసింది. 

మయన్మార్‌లో నిమిషాల వ్యవధిలోనే..

12 నిమిషాల వ్యవధిలోనే శుక్రవారం భారీ భూకంపాలు రావడంతో మయన్మార్ చిగురుటాకులా వణికిపోయింది. శుక్రవారం మధ్నాహ్నం 12.50 గంటల సమయంలో తొలుత భూమి కంపించింది. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే మయన్మార్‌లో మరోరెండు సార్లు భూమి ప్రకంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7, 6.4, 4.9గా నమోదైంది. రెండోసారి సంభవించిన భూకంపం సాగింగ్‌కు దక్షిణంగా 18 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భారీ భూకంపాల కారణంగా మయన్మార్‌లో సుమారు 145కిపైగా మంది ప్రాణాలు కోల్పోగా వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. భూకంపం దాటికి మయన్మార్‌లో పలు బహుళ అంతస్తుల భవనాలు, మసీదులు, గుళ్లు, గోపురాలు, రోడ్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో ఆ దేశంలోని సైనిక ప్రభుత్వం అంతర్జాతీయ సహాయాన్ని కోరింది.

కూలిన చారిత్రక కట్టడం..

మయన్మార్‌లో సంభవించిన భూకంపాలు ఆ దేశంలోని పలు చారిత్రక కట్టడాలను కూడా నేల కూల్చింది. ముఖ్యంగా మండాలెలో ఇరావతి నదిపై ఉన్న చారిత్రక వంతెన అవా బ్రిడ్జికి గొప్ప చరిత్ర ఉంది. అయితే శుక్రవారం సంభవించిన భూకంప తీవ్రతకు ఇది ధ్వంసమైంది. దీంతోపాటు థాయ్‌లాండ్ సరిహద్దులో ఉన్న ఓ మఠం కూడా భూకంపం వల్ల కూలిపోయింది.  

సాధ్యమైనంత త్వరగా సాయం చేయండి

భూకంపాల కారణంగా మయన్మార్‌లోని సాగైంగ్, మండాలె, మాగ్వే, ఈశాన్య రాష్ట్రమైన షాన్, నేపిడా, బాగో ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధి జా మిన్ తూ మీడియాకు వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నట్టు పేర్కొన్నారు. ఇదే సమయంలో అంతర్జాతీయ సమాజం నుంచి మానవతా సాయం ఆశిస్తున్నట్టు వెల్లడించారు. సాధ్యమైనంత తర్వగా ప్రపంచ దేశాలు ముందుకొచ్చి సాయం చేయాలని కోరారు. అయితే మయన్మార్‌లో భూకంపం కారణంగా ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. 

బ్యాంకాక్‌లో ఇలా..

మయన్మార్‌లో సంభవించిన భూకంప కేంద్రం పక్కనే ఉన్న థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌నూ ప్రభావితం చేసింది. స్థానిక కాలమానం ప్రకారం బ్యాంకాక్‌లో శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు రెండుసార్లు భూమి కంపించింది. బ్యాంకాక్‌లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.3, 6.4గా నమోదైంది. బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలడంతో తొమ్మిది మంది కార్మికులు మరణించగా 90 మంది వరకు కార్మికులు భవనం శిథిలాల కింద చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. 


పార్కులు, రోడ్లపైకి జనం పరుగులు

మయన్మార్, బ్యాంకాక్‌లో సంభవించిన భూకంపాల కారణంగా అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బ్యాంకాక్‌లోని భవనాల్లో సైరన్లు మోగడంతో అక్కడి ప్రజలు ఇళ్లు, కార్యాలయాలు వీడి హాహాకారాలు చేస్తూ రోడ్లపైకి పరుగులు తీశారు. మయన్మార్‌లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపించింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ప్రాణ భయంతో పార్కుల వైపు పరుగులు తీసి, తాత్కాలికంగా అక్కడే ఆశ్రయం పొందారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.  

భారతీయులకు టోల్ ఫ్రీ నంబర్

బ్యాంకాక్‌లో భూకంపం సంభవించడంతో అక్కడి భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థిని నిశితంగా గమనిస్తున్నట్టు తెలిపింది. ఇప్పటి వరకు ఏ భారతీయ పౌరుడికీ అవాంఛనీయ ఘటన తలెత్తినట్టు తమ దృష్టికి రాలేదని పేర్కొంది. ఈ క్రమంలోనే భారతీయుల సహాయార్థం ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే థాయ్‌లోని భారతీయులు +66 618819218ను ఫోన్ చేయాలని సూచించింది. 

ఆ దేశాలకు అండగా ఉంటాం: ప్రధాని మోదీ

మయన్మార్, బ్యాంకాక్‌లలో భూకంపం వల్ల జరిగిన విధ్వంసంపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. దుర్ఘఘటనపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని.. ఈ క్లిష్ట పరిస్థితుల్లో రెండు దేశాలకు అండగా ఉంటామని ఎక్స్ వేదికగా హామీ ఇచ్చారు. ‘ మయన్మార్, థాయ్‌లాండ్‌లో భూకంప పరిస్థితులపై ఆందోళనగా ఉంది. అక్కడి ప్రజలు సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నా. వారికి అవసరమైన సాయం అందించేందకు భారత్ సిద్ధంగా ఉంది. సహాయక చర్యలపై ఆయా దేశాల ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరపాలని విదేశాంగ శాఖను కోరాను’ అని ప్రధాని మోదీ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే స్పందించిన మయన్మార్ భారత్ సాయాన్ని స్వీకరించనున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది.

భారత్, చైనా దేశాల్లో..

చైనాలో శుక్రవారం భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.9 తీవ్రతతో నమోదైందని ఆ దేశ శాస్త్రవేత్తలు ప్రకటించారు. బంగ్లాదేశ్‌లోని ఢాకా, చటోగ్రామ్‌లలో కూడా భూమి స్పల్పంగా కంపించింది.  బంగ్లాదేశ్‌లో 7.3, భారత్‌లోని ఢిల్లీ, కోల్‌కతా, మేఘాలయ, ఇంఫాల్ ప్రాంతాల్లో రిక్టర్ స్కేల్‌పై 4 తీవ్రతతో భూమి కంపించింది. అలాగే లావోస్, వియత్నం ప్రాంతాల్లోనూ భూమి కంపించినప్పటికీ ఆయా దేశాల్లో జరిగిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన స్పష్టమైన వివరాలు తెలియరాలేదు. 

భూకంపాలు సహజం.. దెబ్బతిన్న విమానాశ్రయం

భారీ భూకంపానికి వందల సంఖ్యలో ఆకాశహార్మ్యాలు దెబ్బతిన్నాయి. ఈ భూకంపం ధాటికి ఎయిర్‌పోర్ట్ కూడా దెబ్బతింది. మయన్మార్‌లో భూకంపాలు తరచూ సంభవించడం గమనార్హం. అక్కడ 1930 నుంచి 1956 మధ్య ఎక్కువ సార్లు భూకంపాలు సంభవించాయి. తాజాగా సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్యపై స్పష్టత రానప్పటికీ భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. 

కళ్లు తిరిగినట్టు అనిపించింది: థాయ్‌లాండ్‌లోని భారతీయుడు

భారత్‌కు చెందిన ప్రేమ్ కిశోర్ మోహంతి ఎప్పటిలాగే తన కూతురును స్కూల్  నుంచి తీసుకురావడానికి బ్యాంకాక్‌లోని పాఠశాల వద్దకు వెళ్లారు. పాఠశాల ఆడిటోరియంలో కూర్చొని ఉండగా ఆయన కాళ్ల కింద భూమి కదిలినట్టు కావడంతో రోజు వారి స్పోర్ట్స్ డే కార్యక్రమంగా ఆయన భావించారట. అయితే ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే స్కూలుకు సంబంధించిన సిబ్బంది వచ్చి ఆడిటోరియంతోపాటు ఎత్తయిన భవనాలకు దూరంగా మైదానం వైపు పరుగులు తీయాలని చెప్పడంతో అక్కడున్నవాళ్లమంతా ఆడిటోరియం ను వీడినట్టు చెప్పారు. భూకంపం సందర్భంగా ఎత్తయిన భవనాలపై ఉన్న స్విమ్మింగ్ పూళ్ల నుంచి నీళ్లు జలపాతాలుగా కిందకు దూకినట్టు వెల్లడించారు. భూకంపం సమయంలో తన కళ్లు తిరగడం, ఓవర్ హెడ్ లైట్లు ఊగుతుఉన్నట్టు, కుర్చీలు కదులుతున్నట్టుగా తనకు అనిపించిందని ప్రేమ్ కిషోర్ ఓ మీడియాకు వెల్లడించారు. కాగా ప్రేమ్ కిశోర్ తన భార్య పిల్లలతో సెంట్రల్ బ్యాకాంక్‌లోని సుఖుమ్విత్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. 

థాయ్‌లాండ్‌లో ఎమర్జెన్సీ ప్రకటన

భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఆదేశించిన థాయ్‌లాండ్ ప్రభుత్వం.. దుర్ఘటన తీవ్రత దృష్ట్యా బ్యాంకాక్‌లో ఎమర్జెన్సీని ప్రకటించింది. బ్యాంకాక్ నగరంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు థాయ్ ప్రధాని పేటోంగ్‌టార్న్ షినవత్రా స్వయంగా ప్రకటించారు. ఈ క్రమంలో బ్యాంకాక్‌లో మెట్రో సేవలతోపాటు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. 


పేకమేడలా కూలిన 1000 పడకల ఆసుపత్రి

మయన్మార్ రాజధాని నేపిడాలోని 1000 పడకల ఆసుపత్రి భూకంపం కారణంగా కుప్పకూ లింది. భవనానికి సంబంధించిన శిథిలాల కింద చిక్కుకుని సుమారు 20 మంది రోగులు మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. అయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఓ వైద్యుడు మాట్లాడుతూ తాను ఇదివరకు ఇలాంటి విపత్తును చూడలేదని పేర్కొన్నారు. ఆసుపత్రి కూలిన తర్వాత వందలాది మంది ప్రజలు రోడ్లపైనే చికిత్స పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

మయన్మార్‌లోనే ఎందుకు?

మయన్మార్‌లో చోటుచేసుకున్న తీవ్ర భూకంపం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మరి భూకంపాలు మయన్మార్‌లోనే ఎందుకు ఎక్కువగా సంభవిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా భూమి పైపొరలో అనేక ఫలకాలు (టెక్టానిక్ ప్లేట్స్) ఉంటాయి. వీటి సరిహద్దులను ఫాల్ట్స్ అంటారు. ఈ ఫలకాల మందం కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఇవి నిరంతరం ఒకదానితో ఒకటి ఢీకొంటుంటాయి. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, బర్మా మైక్రోప్లేట్‌ల మధ్‌య సగాయింగ్ ఫాల్ట్ ఉంటుంది. మయన్మార్‌లో ఇది దాదాపు 1200 కిమీ మేర విస్తరించింది. ఈ కదలికలు సగాయింగ్ ఫాల్ట్‌లో ఏడాదికి 11 మిమీ నుంచి 18 మిమీ వేగంగా జరుగుతున్నట్లు అంచనా వేశారు. ఇవి దీర్ఘకాలం కొనసాగుతుండడంతో కాలక్రమేణా అంచుల వద్ద రాపిడికి గురై ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఒక్కసారిగా భూకంపానికి దారి తీస్తుంది. భూకంప కేంద్రం లోతు ఎంత తక్కువగా ఉంటే నష్టం అంత ఎక్కువగా ఉంటుంది. ఇలా ఫలకాలు వేగంగా ఘర్షణకు లోనవుతున్న కారణంగానే మయన్మార్‌లో తరచూ భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు మయన్మార్‌లో అనేకసార్లు భూమి కంపించింది.