హైదరాబాద్: ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలో వరస భూప్రకంపనలు ప్రజలను భయపెడుతున్నాయి. తాజాగా శనివారం మహబూబ్ నగర్ జిల్లాలో స్వల్ప స్థాయిలో భూప్రకంపనలు వచ్చాయి. జిల్లాలో రిక్టర్ స్కేలుపై 3.0 తీవ్రతో భూకంపం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లాలో మధ్యాహ్నం కౌకుంట్ల మండలం దాసరపల్లే కేంద్రంగా 12.15 గంటలకు భూప్రకంపనలు సంభవించాయి. భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోంచి బయటకు పరుగులుపెట్టినట్లు స్థానికులు తెలిపారు. డిసెంబర్ నాలుగో తేదీ బుధవారం నాడు తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉదయం 5.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఉదయం 7:27 గంటలకు భూకంపం సంభవించడంతో నివాసితులు భయాందోళనకు గురయ్యారు.