* సునామీ హెచ్చరికలు జారీ
టోక్యో, జనవరి 13: జపాన్ నైరుతి ప్రాంతంలోని క్యూషూ ద్వీపంలో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రత నమోదైంది. భూకంప కేంద్రం ‘మియాజాకి ప్రిఫెక్చర్’ ప్రాంతంలో ఉందని అక్కడి వాతావరణశాఖ స్పష్టం చేస్తూ.. సునామీ హెచ్చరికలు సైతం జారీ చేసింది.
సముద్రం వద్ద ఒక మీటర్ కంటే ఎక్కువగా అలలు ఎగసిపడే అవకాశం ఉందని పేర్కొన్నది. జాలర్లు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు సముద్ర గర్భంలోని 48 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే సంస్థ ప్రకటించింది. గతేడాది ఆగస్టులోనే రెండు భూకంపాలు జపాన్‌ను కుదిపేశాయి. తాజాగా మరో భూకంపం సంభవించడం జపాన్ దేశస్థులను కలవరపాటుకు గురిచేసింది.