28-03-2025 02:16:46 PM
న్యూఢిల్లీ: ఆగ్నేయాసియా దేశాలను భూకంపాలు(Earthquake) వణికించాయి. మయన్మార్, థాయ్ లాండ్, బంగ్లాదేశ్ లో శుక్రవారం మధ్యాహ్నం తీవ్ర భూకంపాలు సంభవించాయి. మయన్మార్ ను మూడు వరస భూకంపాలు వణికించాయి. మయన్మార్ లో 7.7,6.4,4.9 తీవ్రతతో వరస భూకంపాలు(Myanmar Earthquake) వచ్చాయి. మయన్మార్ లో 12 నిమిషాల వ్యవధిలో రెండు తీవ్ర భూకంపాలు సంభవించాయి. దీని కేంద్రం సాగింగ్ నగరానికి వాయువ్యంగా 16 కి.మీ లోతులో ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే(United States Geological Survey) తెలిపింది. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు, సునామీ హెచ్చరిక జారీ చేయబడలేదని అధికారులు తెలిపారు.
అటు బ్యాంకాక్(Bangkok)లో 7.3, బంగ్లాదేశ్ లో 7.3 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయి. భూకంపం ధాటికి మయన్మార్, బ్యాంకాక్(Bangkok Earthquake)లో భవనాలు కుప్పకూలాయి. పలు ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. బ్యాంకాక్ లో నిర్మాణంలోని భవనంలో 43 మంది కార్మికులు చిక్కుకున్నారు. భవనాలు కుప్పకూలడంతో భయాందోళనతో ప్రజలు పరుగులు తీశారు. భవనాల్లో ఉన్న వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున దుమ్ము, ధూళి వ్యాపించాయి. మయన్మార్ లో భూకంప కేంద్రం ఉన్నట్లు జర్మనీ సంస్థ గుర్తించింది. భవనాలు కూలిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపం ధాటికి మయన్మార్ లో పలు చోట్ల రహదారులపై చీలికలు వచ్చాయి. భూకంపం దృష్ట్యా రోడ్లపైనే భయభయంగా ప్రజలు జీవనం గడుపుతున్నారు. ఉత్తర థాయిలాండ్ వరకు ప్రకంపనలు సంభవించాయి.
ఇక్కడ బ్యాంకాక్‌లో కొన్ని మెట్రో, రైలు సేవలు నిలిపివేయబడ్డాయి. సంక్షోభాన్ని సమీక్షించడానికి థాయ్ ప్రధాన మంత్రి పేటోంగ్‌టార్న్ షినవత్రా "అత్యవసర సమావేశం" నిర్వహిస్తున్నారు. రాజధాని నగరంలో 'అత్యవసర పరిస్థితిని' ప్రకటించారు. చైనాలోని యునాన్ ప్రావిన్స్ కూడా బలమైన ప్రకంపనలను నివేదించింది. చైనా భూకంప నెట్‌వర్క్స్ సెంటర్ 7.9 తీవ్రతతో ఉందని తెలిపింది. బెంగాల్‌లోని కోల్‌కతా, మణిపూర్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు బంగ్లాదేశ్‌లోని ఢాకా, చటోగ్రామ్‌లలో కూడా తేలికపాటి ప్రకంపనలు సంభవించాయని వార్తా సంస్థ పిటిఐ తెలిపింది. బ్యాంకాక్, ఇతర నగరాల్లో భవనాలు కంపించడాన్ని, ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీస్తున్న భయంకరమైన వీడియోలు ఎక్స్ లో వైరల్ అవుతున్నాయి. "నేను విన్నాను... నేను ఇంట్లో నిద్రపోతున్నాను, ఆపై నా పైజామాతో భవనం నుండి వీలైనంత దూరం పరిగెత్తాను" అని ప్రముఖ పర్యాటక నగరమైన చియాంగ్ మాయి నివాసి డువాంగ్‌జై వీడియాకి చెప్పారు.