calender_icon.png 31 October, 2024 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూమి గుడ్డు కానుందా?

17-07-2024 06:22:46 AM

  • ఆకారం మారుతున్న భూగోళం 
  • పెరుగుతున్న ‘దిన’ సమయం 
  • ధ్రువాల వద్ద వేగంగా కరుగుతున్న మంచు 
  • భూమధ్యరేఖ వద్ద ఉబ్బెత్తుగా భూమి 
  • ధ్రువాల వద్ద బల్లపరుపుగా మార్పులు

న్యూఢిల్లీ, జూలై 16: వాతావరణ మార్పులతో ఇప్పటికే భూమిపై తీవ్ర దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి. సముద్ర మట్టాలు పెరిగిపోయి తీర ప్రాంతాలు మునిగిపోతున్నాయి. దీవులు అంతర్ధానమవుతున్నాయి. కొత్త కొత్త వ్యాధులు ప్రబలుతున్నాయి. అతివృష్టి, అనావృష్టితో ఆస్తి ప్రాణ నష్టం జరుగుతున్నది. అంతటితో ఇది ఆగేలా కనిపించటం లేదు. ఏకంగా భూగోళం ఆకారమే మారిపోతున్నదని తాజా అధ్యయనంలో తేలింది. జెట్ ప్రొపల్షన్ లేబోరేటరీ, ఈటీహెచ్ జ్యురిచ్ సంయుక్తంగా చేపట్టిన అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పరిశోధన వ్యాసం నేషనల్ అకాడెమీ ఆఫ్ సైన్ప్‌లో ప్రచురితమైంది.

పెరుగుతున్న రోజు కాలం

వాతావరణ మార్పులతో భూమిపై ఒక రోజులో సమయం పెరుగుతున్నదని పరిశోధకులు గుర్తించారు. 1900 నుంంచి సేకరించిన డాటాను విశ్లేషించగా, గత శతాబ్దంలో రోజు కాలం (లెంగ్త్ ఆఫ్ డే) 0.3 మిల్లీ సెకన్ల నుంచి 1 మిల్లీ సెకను పెరింగిందని, 20వ శతాబ్దంలో అది 1.33 మిల్లీ సెకన్లకు చేరినట్టు గుర్తించారు. ఇందుకు ప్రధాన కారణం ధ్రువాల వద్ద ఉన్న మంచు వేగంగా కరిగిపోవటమేనని తేల్చారు.

మారుతున్న భూమి ఆకారం

ధ్రువాల వద్ద లక్షల కిలోమీటర్ల విస్తీర్ణంలో కిలోమీటర్ల మందంతో ఉన్న మంచు వేగంగా కరుగుతున్నది. దీంతో ఆ నీరంతా సముద్రాల్లోకి చేరి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. దీంతో ధృవప్రాంతాల వద్ద భూమి బల్లపరుపుగా మారుతున్నదని గుర్తించారు. అదే సమయంలో భూమధ్య రేఖ వద్ద నీరు అధికంగా చేరి ఆ ప్రాంతం ఉబ్బెత్తుగా మారుతున్నది. దీంతో భూమి ద్రవ్యరాశి, గురుత్వాకర్షణలో వేగంగా మార్పులు వస్తున్నాయ. దీనికారణంగా భూమి వేగం తగ్గి రోజు కాలంలో పెరుగుదల కనిపిస్తున్నదని పరిశోధకులు తెలిపారు. గత 30 ఏండ్లుగా ఈ మార్పు వేగంగా జరుగుతున్నదని చెప్పారు. 

ఉబ్బుతున్న భూభాగాలు

భూమి గ్రహంగా ఏర్పడి అగ్నిగోళం నుంచి చల్లబడిన తర్వాత మహా మంచుయుగం నడిచిందని ఇప్పటికే శాస్త్రవేత్తలు తేల్చారు. ఆ మహా మంచుయుగంలో భూమి మొత్తం దాదాపు మంచు ముద్దగా ఉండేది. ఆ భారీ మంచు కారణంగా భూభాగాలు ఒత్తిడికి గురై కుంచించుకొని ఉండేవి. ప్రస్తుతం వాతావరణ మార్పులతో మంచు కరగటం మొదలవగానే దాని కింద ఉన్న భూభాగాలు మళ్లీ వ్యాకోచించటం మొదలుపెట్టాయి. అంటే ఉబ్బటం మొదలుపెట్టాయి.

దీని కారణంగా కూడా భూమి భ్రమణవేగం తగ్గి రోజు కాలం పెరుగుతున్నదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇలా గత శతాబ్దంలో ఒక రోజు కాలం 0.80 మిల్లీ సెకన్లు పెరిగిందని గుర్తించారు. 20100 నాటికి రోజు సమయం 2.62 మిల్లీ సెకన్లు పెరుగుతుందని అంచనా వేశారు.