రాజకీయాలు చాలా ఖరీదైపోయాయి. టికెట్లు సంపాదించి ఎన్నికల్లో గెలవటానికి అభ్యర్థులు ఎంత ఖర్చు పెడుతున్నారో.. మళ్లీ దాన్ని రాబట్టుకోవటానికి అంతగా అక్రమాలకు దిగుతున్నారు. చాలామంది అభ్యర్థులు టికెట్లు సంపాదించటానికే నానా తిప్పలు పడుతున్నారు. పార్టీల్లోని సీనియర్ నాయకులు, హైకమాండ్ చుట్టూ తిరుగుతూ వారిని ప్రసన్నం చేసుకోవటం.. తమకు తెలిసిన వ్యక్తులు, వ్యాపారస్తుల ద్వారా ‘ఓ మాట’ చెప్పించి ఇన్లుయెన్స్ చేయటం.. పనిలోపనిగా తమకు పోటీగా ఉన్న వ్యక్తులపై పరోక్షంగా ఫిర్యాదులు చేయించటం తప్పటం లేదు. కొన్ని సందర్భాల్లో తమ కుమారులు, కూతుళ్లతోనే పోటీ పడాల్సి వస్తున్నది.
ఇంత కష్టపడినా ఎన్నికల్లో ఖర్చుపెట్టే సామర్థ్యం, అభ్యర్థి కుల సమీకరణాలతోపాటు పోటీదారుల బలహీనతలు, టికెట్ కోసం పార్టీకి ఎంత ఫండ్ ఇవ్వగలరనే అంశాలను బట్టే టికెట్లు వస్తున్నాయి. ఇంత కష్టపడి చివరకు టికెట్ సంపాదించిన తర్వాత ఎన్నికల కోసం డబ్బు సమకూర్చుకోవటం పెద్ద ప్రహసనం. లోన్లు తీసుకొని, ఆస్తులను అడ్డికి పావుశేరు కాడికి అమ్ముకొని ఐటీ, ఈడీలను ఎదుర్కొంటూ సొంత వనరులను సమకూర్చుకోవటం తలకుమించిన భారం అవుతున్నది.
ఎన్నికల ప్రచారంలో మీడియాకు ప్యాకేజీలు, వర్కర్లు, సొంత స్టాఫ్‌కు జీతాలు.. రోజూ ప్రచారానికి వచ్చే జనానికి ఇచ్చే డబ్బులు, ఇతర ఖర్చులు.. పార్టీ ప్రముఖులు పాల్గొనే భారీ సమావేశాలకు డబ్బు నీళ్లలా ఖర్చయిపోతుంది. రాత్రనక, పగలనక, ఎండలో, వర్షంలో ఓటర్ల చుట్టూ తిరుగుతూ ప్రచారం కోసం బార్బర్ షాపుల్లో క్షవరాలు చేస్తూ, హోటల్ బండ్ల వద్ద దోశలేస్తూ, కనిపించే చిన్నారులకు బలవంతంగా ముద్దులు పెడుతూ.. సోషల్ మీడియాలో లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేసుకోవటానికి భారీగా ఖర్చు చేస్తున్నారు.
సొంతపార్టీ వాళ్లను జారిపోకుండా చూసుకొంటూనే ప్రత్యర్థి పార్టీలోని కీలక నేతలను తమవైపు తిప్పుకొంటూ.. పరోక్షంగా మద్దతు సంపాదిస్తున్నారు. ఏరోజుకారోజు ప్రచారం కోసం డబ్బులిచ్చి కార్యకర్తలను నియమించు కొంటున్నారు.
చివరకు పోలింగ్ సమీపించిన తర్వాత ఓటర్లకు డబ్బులు చేరవేయటం ఓ పెద్ద సమస్య. ఇందుకోసం మెడికల్ వ్యాన్లు, ప్రభుత్వ వాహనాలు, బస్సులు, ట్రాక్టర్లు, ట్రక్కులు, స్కూటర్లు, పెట్రోల్ పంపులు, విద్యాసంస్థలు తదితర వేటినీ వదలటంలేదు. చిన్నమొత్తాలను చేరవేసేందుకు యూపీఐ వంటి డిజిటల్ ఫ్లాట్‌ఫాంను కూడా వాడుతున్నారు. ఓటర్లకు బంగారం, వెండి, చీరలు, గోడ గడియారాల వంటి అనేక తాయిలాలు ఆశచూపుతున్నారు. ఒకవేళ పోలీసుల
సోదాల్లో పట్టుబడితే అవేవీ తమవి కావని వదిలేయాలి. ఉచితాల పేరుతో సొంతపార్టీ వారికే కాకుండా ప్రత్యర్థి పార్టీల వారికి కూడా తప్పుడు హామీలిస్తున్నారు.
ఇంతచేసి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజాసేవను పక్కనబెట్టి ఎన్నికల్లో చేసిన ఖర్చును తిరిగి రాబట్టుకోవటంపైనే దృష్టి పెడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం, మామూళ్ల వసూలు, సొంత వ్యాపారాలు పెంచుకోవటంతోపాటు ఇతరత్రా చట్టవ్యతిరేక పనులు చేస్తూ డబ్బు కూడబెడుతున్నారు. ఆ డబ్బునే ఎన్నికల్లో చేసిన అప్పులు, లోన్లు తీర్చటానికి వాడుతున్నారు. తర్వాతి ఎన్నికల కోసం కూడా భారీగా డబ్బు పోగు చేసుకొంటున్నారు. భారీగా ఖర్చుచేసి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజాసేవ చేస్తారా అంటే ప్రశ్నార్థకమే. ఎన్నికలంటేనే కోట్లలో వ్యవహారంగా మారిపోవటంతో సామాన్యులు, నిజంగా ప్రజా సేవ చేయాలనే తపన ఉన్న ఉత్తములు ఎన్నికల్లో పోటీచేసే అవకాశమే లేకుండా పోయింది.
ప్రస్తుతం ప్రజాప్రతినిధులంతా తమ ఎన్నికల నామినేషన్లలో తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేయటంతోనే చట్టవ్యతిరేక మార్గంలోకి అడుగు పెడుతున్నారు. ఈ పరిస్థితి మారాలంటే మనకు బలమైన నాయకుడు కావాలి. ఎన్నికల ఖర్చును నియంత్రించి, ప్రజాస్వామ్యాన్ని రక్షించగలిగే నియంతలాంటి నాయకుడు కావాలి. ఏది ఏమైనప్పటికీ ప్రజలంతా ఓటు వేసి ఉన్నవారిలో ఉత్తమమైన వ్యక్తిని తమ ప్రతినిధిగా ఎన్నకోవాలి.
సి ఎల్ రాజం
చైర్మన్, విజయక్రాంతి