“శ్రీ సర్వ దేవతామయుండును, శ్రీ శంభు లింగంబునగు నీశ్వరుని పూజించి, నాగనాథుని యడుగులకు మ్రొక్కి, ఏకాంబ్ర నాథుండను వాడొక పుణ్యకథల నిటుల వచింప నారంభించె..” అంటూ ఒక గొప్ప రచనను మొదలు పెట్టినవాడు ఏకామ్రనాథుడు. ఆయన రచించిన వచన రచన ‘ప్రతాపరుద్ర చరిత్రము’.
కాకతీయ రాజుల చరిత్రను గ్రంథస్థం చేసిన ఈ ‘ప్రతాపరుద్ర చరిత్రము’ తెలుగులో రచింపబడ్డ మొట్టమొదటి వచన గ్రంథం. ఈ గ్రంథంలో కాకతీయ రాజుల రాజాస్థాన వైభవాలు, ఓరుగల్లు ప్రజల జీవన విధానాలు, నాటి ఆస్థాన పండితుల విశేషాలు వంటి అనేక విషయాలు ఏకామ్రనాథుని రచన ద్వారా తెలుస్తున్నాయి.
మొట్టమొదటి వచన రచన
“మొట్టమొదటి వచన రచన ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్రము” అన్న దివంగత ఇరివెంటి కృష్ణమూర్తి వారి మాటనుబట్టి మన చారిత్రక విషయాలను తెలిపే మొదటి పుస్తకంగా దీనిని భావించవచ్చు. ఇందులో పేర్కొన్న ‘శంభులింగం’ వరంగల్లులో కొలువై ఉన్న స్వయంభూ శివలింగమే అని ప్రముఖ చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.
దానినిబట్టి ఏకామ్రనాథుడు ఓరుగల్లుకు చెందిన వాడని కూడా వారు భావించారు. ‘ఇదొక పుణ్యకథల సమాహారం’గా ఏకామ్రనాథుడే అభివర్ణించాడు. ‘ఇందులో ప్రస్తావితమైన వ్యక్తులందరూ నిజంగా ప్రజలకోసం పాటుబడ్డ పాలకులే. వారు తాము పరిపాలిస్తున్న ఈ భూమి పవిత్రమైందిగా భావించారు.
ఈ కారణంగా, ఇది కేవలం చరిత్ర కథలు చెప్పే శుష్క చరిత్ర రచన మాత్రమే కాదు. దీనిలో కీర్తింపబడ్డ రాజుల ‘పుణ్యకథల’ పేటిక’ అనికూడా గ్రంథకర్త స్వయంగా భావించినట్టు అర్థమవుతున్నది.
‘విక్రమచక్ర’, ‘చలమర్తి గండ’, ‘దాయ గజకేసరి’ వంటి అనేక బిరుదులతో పరిపాలన కొనసాగించిన ఘనులు కాకతీయ చక్రవర్తులు. వీరు దాదాపు 125 సంవత్సరాలపాటు దక్షిణా పథమంతా పరిపాలన సాగించారు. వారు ఎన్నెన్నో లోకోపకారక కార్యక్రమాలను నిర్వహిస్తూ, కళాపోషకులుగా మన్ననలను పొందారు. పలు శిల్పకళా మందిరాల నిర్మాణంతో తమ కీర్తిని శాశ్వతం చేసుకున్నారు.
వారిలో గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు వంటి రాజులు ఉన్నారు. ఈ చారిత్రతక విషయాలను, అప్పటి రాజ్య సంబంధ అంశాలను తెలియజెప్పిన విశిష్ట రచనగా ఏకామ్రనాథుని ‘ప్రతాపరుద్ర చరిత్రము’ను పేర్కొనాలి. ఏకామ్రనాథుడు గ్రంథ ప్రారంభంలోనే‘నాగనాథుని యడుగులకు మ్రొక్కి’ అన్న మాటలతో స్తుతించిన నాగనాథుని గురించి కూడా చరిత్రకారులు చర్చించారు.
చివరకు ‘పశుపతి నాగనాథుడే’ గ్రంథకర్త పేర్కొన్న ‘నాగనాథుడని’ వారు నిశ్చయించారు. ఈ పశుపతి నాగనాథుడే ‘మదన విజయ విలాస భాణము’ గ్రంథాన్ని రచించిన వాడేననీ అభిప్రాయ పడ్డారు. విష్ణు పురాణాన్ని మొదట తెనిగించిన కవిగా ఆయనను గుర్తించారు. అయితే, ఆ ‘విష్ణు పురాణం’ లభ్యం కావడం లేదు. పశుపతి నాగనాథుడు శైవుడైనా విష్ణు పురాణాన్ని తెనిగించాడు.
ఆయన వీరశైవులవలె విష్ణువుపట్ల ద్వేషం ఉన్నవాడు కాడు. పోతనవలె శైవుడైనా ‘విష్ణు పురాణాన్ని’ తెనిగించాడు. పూర్వ కవుల్లో ఎఱ్ఱాప్రగడ కూడా శైవుడైనా ‘హరివంశము’ రచించాడు. ఏకామ్రనాథునిలోనూ శైవ వైష్ణవాలపట్ల ఏ భేదభావమూ కనిపించదు.
చరిత్ర విశేషాలు చెప్పే ‘ప్రతాపరుద్ర చరిత్రము’
‘ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ’ వారు ఏకామ్రనాథుని ‘ప్రతాపరుద్ర చరిత్రము’ గ్రంథాన్ని ప్రచురించారు. సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకులు దివంగత సి.వి. రామచంద్రరావు దీనికి చాలా విలువైన, విపులమైన పీఠిక రాశారు. వారు ఇందులోని అనేక అంశాలను చారిత్రక ప్రమాణాలతో చర్చించి, సత్యాసత్యాల నిగ్గు దేల్చారు.
కొన్ని చారిత్రకాంశాల్లో అవాస్తవాలు చోటు చేసుకున్నట్టు పరిశోధకులు గుర్తించడం గమనార్హం. “ఓరుగల్లు నగర నిర్మాణ కాలం గురించిన వివరాలు చరిత్రతో సమన్వయించవు. అలాగే, రుద్రమదేవి గణపతి దేవుని భార్య, కవయిత్రి మొల్ల తిక్కన సమకాలీనురాలు మొదలైన అంశాలు సరైనవి కావు” అని ఆచార్య ఎస్.వి.రామారావు చెప్పారు.
ఈ విషయాలతో ఇతర చరిత్రకారులూ ఏకీభవించారు. ఐతే, అనేక అవాస్తవాలున్నప్పటికీ ‘ప్రతాపరుద్ర చరిత్రము’లో మరెన్నో చారిత్రకాంశాలు, ఎందరో చారిత్రక వ్యక్తుల వివరాలు ఉండటం వల్ల దీనినొక ప్రామాణిక రచనగా చరిత్రకారులు గుర్తించారు.
ఏకామ్రనాథునితోపాటు ఈ గ్రంథ రచనా కాలాలను గురించి సి.వి.రామచంద్రరావు విపులంగా చర్చించే ప్రయత్నం చేశారు. “ఈ గ్రంథ రచన 15వ శతాబ్ది చివరి దశకంలోకాని, 16వ శతాబ్ది తొలి దశకంలోకాని జరిగి ఉండవచ్చునని” గ్రంథంలోని అంశాల ఆధారంగానే వారు నిర్ధారించారు.
గ్రంథంలో అప్పటి విజయనగర రాజ్య పాలకుడైన వీరనరసింహ రాయల ప్రస్తావన రావడం, ఇతర విశేషాలను ఆధారం చేసుకొనే సి.వి.రామచంద్రరావు ‘దీనిని 1490 సంవత్సరాల నడుమ రచించి ఉండవచ్చునని’ అభిప్రాయపడ్డారు. దీని గురించి ఎన్నో చారిత్రకాంశాలనూ వారు చర్చించారు.
కాకతీయుల కథల సంకలనంగా..
ఏకామ్రనాథుడు తన ‘ప్రతాపరుద్ర చరిత్రము’ చివర్లో “ఇట్టి పవిత్ర చరిత్ర నొక్కసారి తిలకింపుడు. 225 కథలు గలిగిన కాకతిరాజుల క్రమంబును దెలియ జెప్పితిని గాంచుడు. తొల్లి 1000వ సంవత్సరంబులు కాకతి రాజులచే నేది పాలింపబడి సకలైశ్వర్య సిద్ధికరంబై విలసిల్లి యుండునో యా చరిత్ర యాలకింపుడు” అన్న మాటల్లో కాకతీయ రాజ్య వైభవం స్ఫురిస్తున్నది.
మరొక చోట ప్రతాపరుద్రుని గురించి చెబుతూ, “అతని చరితంబు లాది పురాణాదులట్లు సకలానందంబై యుండును” అన్నాడు. ఇటువంటి మాటలన్నీ ఏకామ్రనాథునికి కాకతీయ రాజులపట్ల గల పూజ్యభావానికి సంకేతాలు. అందుకే, వారి రచనను పురాణ స్థాయి కలదిగా భావించాడు. వారి కథలను ‘పుణ్యకథలు’గా స్వయంగా కీర్తించాడు.
అంతేగాక, ఫలశ్రుతి వంటిది కూడా రాస్తూ, ‘ఈ ప్రతాపరుద్ర చరిత్ర నెవరు విన్నను జదివినను వ్రాసినను వారికి శివుడాచంద్ర తారార్కముగా బుత్రపౌత్రాద్యైశ్వర్యంబుల నిచ్చును” అన్నాడు. ఆధారాలు ఎక్కువగా అందుబాటులో లేకున్నా ఆ రాజుల పరిపాలనపై మక్కువతో, వారి రాజనీతిపై ఇష్టంతో, ప్రజాపక్ష దృక్పథంపై వారికిగల మమకారంతో అప్పటికే ప్రచారంలో ఉన్న కాకతీయుల కథలను సేకరించారు.
వాటిని పరిశీలించి, సమన్వయించి, శక్తివంచన లేకుండా ఒక్కచోటకు చేర్చి ఈ ‘ప్రతాపరుద్ర చరితము’ గ్రంథాన్ని రచించాడు. దేశ చరిత్ర రాయడమనే ప్రక్రియయే తెలియని రోజుల్లోనే ఇటువంటి రచన చేయడమంటే అదొక సాహసమే. ‘అటువంటి వారి జీవితం పుణ్యప్రదమని’ ఈ గ్రంథకర్త స్వయంగా భావించడం వెనుక వారి పాలనపట్ల తనకున్న గొప్ప గౌరవం ఎంతటిదో అర్థమవుతుంది. నాటి జన బాహుళ్యంలో ప్రచారంలో ఉన్న కథలే చరిత్రగా భావించినట్లు దీనివల్ల మనకు తెలుస్తున్నది.
జనబాహుళ్యంలోని కథలను గ్రంథకర్త సమీకరించుకోవడం వల్లనేమో వాటిలో అనేక అభూత కల్పనలకుతోడు అద్భుత వృత్తాంతాలు, అతిమానుష విషయాలూ చోటు చేసుకున్నాయి. ఆ రోజుల్లో ఇప్పుడున్నంత చారిత్రక అవగాహన లేదు గనుక, అలాంటివీ గ్రంథంలో చోటు చేసుకున్నాయి. కానీ, ఇవి చాలా పరిమితంగానే ఉన్నట్లు పలువురు పరిశోధకులు గుర్తించారు.
హేతువాద దృష్టికి, చారిత్రక విషయాలకు అనుకూలమైనవే అధికమని వారు తేల్చారు. అందుకే, దీనిని ‘తొలి చారిత్రక రచన’గా వారు నిర్ధారించారు. “ఇందులో చెప్పిన పలు అద్భుత వృత్తాంతాలేవీ చారిత్రక విషయాల్ని అర్థం చేసుకోవడంలో ఆటంకం కావు” అని కూడా పేర్కొన్నారు.
తదనంతర కాలంలో వెలుగుచూసిన శాసనాధారాలతో ఇందులోని కథలను సమన్వయించుకొని చూస్తే నిజాలు అందుబాటులోకి వస్తాయి. ఆ మార్గంలోనే కొందరు పరిశోధకులు ప్రయత్నం మీద ఈ గ్రంథ ప్రాశస్త్యాన్ని చాటి చెప్పారు. అటువంటి వారిలో ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం, ఆచార్య ఎస్.వి.రామారావు, సి.వి.రామచంద్రరావు వంటి గొప్ప పరిశోధకులు ఉన్నారు. ఈ కారణంగా ఏకామ్రనాథుని రచనకు గొప్ప ప్రామాణికత చేకూరింది.
మరో రెండు గ్రంథాలలో అవే కథలు
‘ప్రతాపరుద్ర చరిత్రము’లోని కథల ఆధారంగానే కాసె సర్వప్ప అనే కవి ‘సిద్ధేశ్వర చరిత్రము’ పేర్న ఒక ద్విపద కావ్యం రచించాడు. దీనిలోని కథలన్నీ ఆ కావ్యంలో మార్పులేవీ లేకుండా కనిపిస్తాయి. కాకపోతే ఇది వచనం, అది ద్విపద కావ్యం అంతే తేడా.
ఈ ద్విపద కావ్యానికి గొప్ప పీఠికను అందించిన ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం ‘ప్రతాపరుద్ర చరిత్ర’ను గురించి కూడా అనేక విశేషాలను అందించే ప్రయత్నం చేశారు. ఇదే ఇతివృత్తాన్ని కూచిమంచి జగ్గకవి ‘సోమదేవ రాజీయము’ పేర్న పద్యకావ్యంగా రచించాడు. ఈ మూడింటిలోనూ కథలన్నీ ఒక్కటే.
నాటి భాషా సౌందర్యాన్ని ముఖ్యంగా నాడు వ్యవహారంలో ఉన్న ఉర్దూ పదాలు, అన్య దేశ్యాలు కూడా భాషా పరిశోధనలకు ఉపయుక్తాలవుతాయి. ఆంధ్ర వచన వాఞ్మయంలో తదనంతరం వెలువడ్డ ‘రాయవాచకము’, ‘కృష్ణరాయ విజయము’ వంటి వచన రచనలకు ఈ గ్రంథమే మార్గం చూపిందనీ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ రచనల్లోని భాష, చరిత్ర వంటి విషయాలను తులనాత్మక రీతిలో పరిశీలించి రచనలు చేయడం ‘ప్రతాపరుద్ర చరిత్ర’ను ఒక ప్రామాణిక రచనగా గుర్తించడంగానే భావించాలి.
ఆంగ్లంలోకి అనువాదం
ఏకామ్రనాథుని ‘ప్రతాపరుద్ర చరిత్రము’ అవసరాన్ని గుర్తించిన పెద్దలు, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ‘భారతీయ పరిశోధనా పరిషత్’ (ఐసీహెచ్‌ఆర్) వారు ఈ గ్రంథాన్ని ఆంగ్లంలో రచింపజేయాలని సంకల్పించారు. ఆ సంస్థ చైర్మెన్ ఆచార్య వై. సుదర్శనరావు ఇందుకు పూనుకొని, దీనిని సి.వి. రామచంద్రరావు చేత ఆంగ్లంలోకి అనువదింపజేసి, వెలువరించారు.
ఫలితంగా, ‘తొలి తెలుగు చరిత్ర గ్రంథం’ ఆంగ్లభాషాభిమానులకూ అందుబాటులోకి వచ్చింది. ఈ రకంగా కాకతీయులకు సంబంధించిన అనేక విశేషాలు తెలుగేతరులకు తెలిశాయి. కాకతీయ ప్రాభవాన్ని ఇలా అన్ని విధాలుగా చాటి చెప్పిన విశిష్ట రచనగా ఏకామ్రనాథుని ‘ప్రతాపరుద్ర చరిత్రము’ను చరిత్రకారులు అభివర్ణిస్తున్నారు.
గన్నమరాజు గిరిజా మనోహరబాబు
9949013448