13-02-2025 08:12:33 PM
పిల్లలకు వ్యాధి నిరోధక టీకాల లక్ష్యం 100 శాతం పూర్తి చేయాలి..
ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలి..
వైద్యధికారులకు సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రాబోయే వేసవి కాలం దృష్యా ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రతలపై ప్రజలకు వైద్య ఆరోగ్యశాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. గురువారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అద్యక్షతన జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాలలో పనిచేయుచున్న వైద్యధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... వైద్యాధికారులు, సిబ్బంది తమ తమ పరిధిలోని ఆసుపత్రులకు, పి.హెచ్.సి లకు సకాలంలో విధులకు హాజరు కావాలని సూచించారు.
పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేపించే కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేయాలని, రాబోయే వేసవి కాలంలో వచ్చే వడదెబ్బ బారిన పడిన వారికి తక్షణ చికిత్సలో భాగంగా అన్ని రకాల మందులు, ఓ.ఆర్.ఎస్ అందుబాటులో ఉంచాలని సూచించారు. గర్బిణినులను 12 వారలాలోపు ఎం.సి. హెచ్ పోర్టల్ నందు నమోదు చేయాలనీ, ఏదైనా ప్రమాదకరమైన వ్యాధులు ఉంటే గుర్తించి సకాలంలో పైస్థాయి ఆరోగ్య కేంద్రాన్ని పంపించి వైద్యం అందించాలని, మాతృ మరణాలను నియంత్రించాలి, ప్రతి ఒక్క ప్రాధమిక ఆరోగ్య కేంద్రం క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే సాధారణ ప్రోత్సవాలు జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు గాను అవసరమైన యంత్ర పరికరాలు, సామాగ్రి, సిబ్బందికి సంబంధించి పూర్తి నివేదికలు రేపు సాయంత్రంలోగా అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. భాస్కర్ నాయక్, డిప్యూటీ డిఎం.హెచ్.ఓ డాక్టర్ సుకృత, సీహెచ్. ఐ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ బాలాజీ, ఎం.హెచ్. ఎన్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఆర్పి చైతన్య, ఎన్.సిడి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మధువరున్, మలేరియా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ స్పందన, డిప్యూటీ డెమో ఎం.డి. ఫైజ్ మొహిఉద్దిన్ పాల్గొన్నారు.