22-04-2025 12:00:00 AM
హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచే విషయమై సర్కార్ దృష్టిసారించింది. వేసవి సెలవుల్లో ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లా ల్లో ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతున్నారు.
గతంలో జూన్ 12 నుంచి బడిబాట నిర్వహించేవారు. గతేడాది జూన్ 6 నుంచి ప్రకటించారు. ఈసారి అనధికారికంగా ఉ పాధ్యాయులే స్వచ్ఛందంగా పైఅధికారుల అనుమతి తీసుకొని ముందస్తు బడిబాట చేపడుతు న్నారు.
ఏప్రిల్ రెండో వారం నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రైవేట్ స్కూళ్ల యాజ మాన్యాలు గ్రామగ్రామాన తిరుగుతూ అడ్మిషన్లు చేపడుతుండటంతో ప్రైవేట్‌కు పోటీగా ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం ఇంటింటికీ తిరిగి సర్కార్ బడుల పట్ల ఆకర్షితులయ్యేలా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.
ప్రైవేట్ బడుల్లో చేరితే వేలల్లో ఫీజులుంటాయని, అదే సర్కార్ బడుల్లో చదివిస్తే ఆ డబ్బులు ఆదా చేసుకోవచ్చని.. భవిష్యత్తులో పిల్లల పైచదువులకు ఉపయోగపడతాయని తల్లిదండ్రులకు వివరిస్తున్నారు.
ఎన్‌రోల్‌మెంట్ పెంచేలా..
విద్యాశాఖ పరిధిలోని స్థానిక సంస్థల, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత పదేండ్లలో ఏకంగా 8 లక్షల మంది లక్షల మంది విద్యార్థులు తగ్గారు. 2014-15లో 24.85 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో ఉండగా, 2024-25 నాటికి ఆ సంఖ్య 16.86 లక్షలకు పడిపోయింది. 2023-24 విద్యా సంవత్సరంతో పోలిస్తే 2024-25లో మొత్తం 2,63,094 మంది విద్యార్థులు తగ్గారు.
వీరిలో ప్రాథమికోన్నత పాఠశాలల స్థాయిలో 64,830 మంది, ఉన్నత పాఠశాలల స్థాయిలో 76,564 మంది ఉన్నారు. ఇక ప్రాథమిక పాఠశాలల్లో ఏకంగా 1,21,700 మంది విద్యార్థులు తగ్గిపోయారు. ఈక్రమంలోనే ఎన్‌రోల్‌మెంట్ పెంచేలా ఈసారి అధికారిక బడిబాటకు ముందే ఉపాధ్యాయులు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ కమిటీలు కలిసి తల్లిదం డ్రులను, పిల్లలను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరుతున్నారు.
సర్కార్ బడుల పట్ల ఆకర్షితులయ్యేలా..
* ప్రభుత్వ పాఠశాలల గురించి అవగాహన కల్పించడం.
* ఉచితంగా నాణ్యమైన విద్య, పుస్తకాలు, నోట్‌పుస్తకాలు, యూనిఫారమ్‌లు పంపిణీ గురించి వివరించడం.
* తల్లిదండ్రులు, పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, నాణ్యమైన విద్య గురించి చెప్పడం.
* చదువుకు దూరమైన పిల్లలను బడుల్లో చేర్చడం.
* సర్కారు బడుల్లో చదువుకున్న వాళ్లు గొప్ప వాళ్లయ్యారని వారి చరిత్రను తెలపడం.
* ఉచిత ఆరోగ్య పరీక్షలు, ఉదయం రాగి జావ, మధ్యాహ్నం భోజనం, డిజిటల్ తరగతులు, ఇంగ్లీష్ మీడియం విద్య గురించి వివరించడం.
* సొంత భవనాలు, అర్హత కలిగిన ఉపాధ్యాయులు, ఆట స్థలం లాంటి ఇతరత్ర సౌకర్యాల గురించి పేర్కొనడం.