15-04-2025 01:44:01 AM
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల అర్బన్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,వాటి నివారణ గురించి అవగాహనను పెంపొందించేందుకు తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ వారు రూపొందించిన ప్రత్యేక ప్రచార పోస్టర్ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పోలీస్ ప్రదాన కార్యాలయం లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఫైర్ సేఫ్టీ పై అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరమని, చిన్నపాటి అప్రమత్తత వల్ల పెద్ద ప్రమాదాలను నివారించవచ్చన్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రచారం చేస్తూ ప్రజలను చైతన్య వంతులు చేయడమే ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం అని అన్నారు.
ఈ పోస్టర్లో అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర సమయంలో ప్రజలు అనుసరించాల్సిన చర్యలు, ఫైర్ సర్వీస్ అంబులెన్స్, సిబ్బంది సమాచారం చక్కగా చూపించారన్నారు. ప్రజలు ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు వెంటనే 101 కి సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఓ కృష్ణకాంత్, ఎల్‌ఎఫ్ రవీందర్, జి.మదు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.