calender_icon.png 29 November, 2024 | 2:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీపై ముందుకే

30-10-2024 02:07:44 AM

  1. నవంబర్ 1న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు శంకుస్థాపన.. ఆ నెలాఖరులోగా టెండర్లు 
  2. మూసీ ప్రాజెక్టుపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం 
  3. నేను ఫుట్‌బాల్ ప్లేయర్‌ని.. గేమ్ ప్లాన్‌పై నాకు స్పష్టత ఉంది
  4. జన్వాడ ఫామ్‌హౌస్‌పై బీఆర్‌ఎస్ నేతలవి కట్టుకథలు 
  5. రాజకీయాల్లో కేసీఆర్ ఉనికి లేకుండా కేటీఆర్‌ను వాడాను 
  6. ఇప్పుడు కేటీఆర్‌పై హరీశ్‌రావును వాడుతాం.. 
  7. ఆ తర్వాత హరీశ్‌రావును ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు 
  8. మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి చిట్ చాట్

* నా స్టుల్ నాది.. కేటీఆర్ స్టుల్ కేటీఆర్‌ది. సినిమాల్లో రాజమౌళి, రాంగోపాల్ వర్మ.. ఇద్దరిది వేర్వేరు స్టయిల్.

* కేటీఆర్ ప్రపంచస్థాయి మేధావినని అనుకుంటున్నారు. మూసీని బాగు చేసే అంశంలో కేటీఆర్ తన ఆలోచనలు చెప్పొచ్చు. మూసీపై  హరీశ్‌రావు, ఈటల రాజేందర్ తమ ప్రతిపాదనలు పంపాలి.

* మాకు దీపావళి అంటే చిచ్చు బుడ్లు, వాళ్లకు మాత్రం సారా బుడ్లు.. ఏమీ చేయకపోతే రాజ్ పాకాల ఎందుకు పారిపోయారు? ముందస్తు బెయిల్ ఎందుకు అడిగారు? జన్వాడ ఫామ్‌హౌస్‌లో కుటుంబ ఫంక్షన్ జరిగితే క్యాసినో కాయిన్లు, పరిమితికి మించి విదేశీ మద్యం బాటిళ్లు ఎందుకు దొరికాయి?   

 సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాంతి) : మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ముందడుగే కానీ, వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. నిర్ణయం తీసుకునే ముందే వెయ్యిసార్లు ఆలోచిస్తామని, నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గేది లేదని సీఎం స్పష్టం చేశారు.

నవంబర్ 1న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులు బాపూఘాట్ నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. నవంబర్‌లోపు మూసీ ప్రాజెక్టు పనులను టెండర్లు పిలుస్తామని తెలిపారు.

ప్రాజెక్టు పనులపై ప్రతిపక్షాలతో చర్చలకు సిద్ధమని, త్వరలోనే మూసీ ప్రక్షాళనపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని, బీఆర్‌ఎస్ వాళ్లు తమ అభ్యంతరాలను తెలియజేయాలని సీఎం పేర్కొన్నారు. తనను కలవటం బీఆర్‌ఎస్ నేతలకు ఇష్టం లేకపోతే మంత్రులు, అధికారులను కలిసి కూడా అభ్యంతరాలు చెప్పొచ్చని అన్నారు.

విపక్షాలు కూడా మూసీ ప్రాజెక్టు పనులకు ప్రతిపాదనలు సూచించవచ్చని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపడుతామని, డీపీఆర్ కోసం రూ. 140 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలిపారు.

మల్లన్న సాగర్ కోసం 14 గ్రామాలను గత ప్రభుత్వం ఖాళీ చేయించిందని, దాని వల్ల ఎలాంటి ప్రయోజనం జరగలేదని, ఇప్పుడు మూసీ అభివృద్ధి విషయంలో నిర్వాసితులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం జవాబుదారీగా వ్యవహారిస్తోందని సీఎం పేర్కొన్నారు.

మూసీ అభివృద్ధికిగాను 33 బృందాలతో సర్వే పూర్తయిందని, నిర్వాసిత కుటుంబాల పిల్లలకు ఉచిత విద్యను అందించడంతో పాటు అన్ని సదుపాయాలు కల్పిస్తామని సీఎం హామీ  ఇచ్చారు. 

మల్లన్నసాగర్ నుంచి గండిపేటకు గోదావరి నీళ్లు.. 

గండిపేట, హిమాయత్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 21 కి.మీ మేటర్ల మూసీ పనులు ప్రారంభించనున్నట్లు, మల్లన్న సాగర్ నుంచి మూసీకి గోదావరి నీళ్లు తరలిస్తామని, గండిపేటను నింపుతామని సీఎం తెలిపారు.  దీనికి సంబందించి ట్రంక్ లైన్ కోసం నవంబర్  మొదటి వారంలో టెం డర్లు పిలుస్తామని చెప్పారు. 

నెల రోజుల్లో మూసీ ప్రాజెక్టు పనులకు డిజైన్లు సిద్ధమవుతాయని, బాపూఘాట్ దగ్గర బ్రిడ్జి కమ్ బ్యారేజీతో పాటు ప్రపంచంలో అత్యంత ఎత్తయిన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అందుకు  కోసం ఆర్మీ స్థలం కూడా  అడిగామన్నారు. 15 రోజుల్లో ఎస్టీపీ (సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు)లకు టెండర్లు వేస్తామన్నారు.

మూసీని ఏకో ఫ్రెండ్లీ, వెజిటేరియన్ కాన్సెప్టుతో ఆభివృద్ధి చేస్తామని, మూసీ  వెంట అంతర్జాతీ య వర్సిటీ, గాంధీ ఐడియాలజీ సెంటర్, రీక్రియేషన్ సెంటర్, నేచర్ క్యూర్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు.  మూసీ పునరుజ్జీవం పూర్తయితే హైదరాబాద్ అద్భుతనగరంగా ఆవిష్కృతమవుతుందన్నారు.  

పునరుజ్జీవంపై కావాలనే చర్చకు తెరలేపాను..

మూసీ పునరుజ్జీవంపై కావాలనే చర్చకు తెరలేపానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ చర్చతో ప్రజలకు అవగాహన కలిగిందని, మూసీని బాగు చేసేవాడొకడు వచ్చాడని ప్రజలకు తెలిసిందని సీఎం పేర్కొన్నారు. తాను ఫుట్‌బాల్ ప్లేయర్‌నని, గేమ్ ప్లాన్‌పై తనకు పూర్తి స్పష్టత ఉందని వెల్లడించారు. 55 కి.మీ.

మూసీ ప్రక్షాళన పూర్తయితే హైదరాబాద్ అద్భుతనగరం ఆవిష్కృతమవు తుందని, పర్యాటకం అభివృద్ధి చెందుతోందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రా నికి హైదరాబాద్ నుంచే 65 శాతం ఆదా యం వస్తోందని, దాన్ని మరింత పెంచుతామని సీఎం వివరించారు. ‘మూసీ కోసం భూమిలిచ్చే వారికి 100 శాతం సంతృప్తి చెందేలా ప్యాకేజీ ఇస్తాం. 

మూసీ కోసం ప్రజలను కష్టపెట్టి భూములు తీసుకోబోం. మూసీ ప్రాజెక్టును ఎన్జీవోలు వ్యతిరేకిస్తే అర్థం ఉంది. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ఎందుకు వ్యతిరేకిస్తుందో ఆర్థం కావ డం లేదు. కేటీఆర్ ప్రపంచ స్థాయి మేధావినని అనుకుంటున్నారు. మూసీని బాగు చేసే అంశంలో కేటీఆర్ తన ఆలోచనలు చెప్పొ చ్చు.

అంతర్జాతీయ అవగాహన ఉన్న కేటీఆర్‌కు మూసీని ఎలా బాగుచేయాలో తెలి యదా..? మూసీ పునరుజ్జీవంపై కేటీఆర్ నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నాం, మూసీపై కేటీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్ తమ ప్రతిపాదనలు పంపాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. నగర ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లను సియోల్‌కు పంపిస్తామని చెప్పారు.

వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు పాదయాత్ర..

మూసీ పునరుజ్జీవం కోసం అవసరమైతే వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు పాదయాత్ర చేస్తానని, కేటీఆర్, హరీశ్‌రావు కూడా తనతో కలిసి రావాలని సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. మూసీని అభివృద్ధి చేయాలో లేదో ప్రజలను అడుగుదామన్నా రు.

మూసీ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టే కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్ ఒక సీఎంగా తనను కలవడం ఇష్టం లేకపోతే ప్రధాన కార్యదర్శిని కలవొచ్చని రేవంత్‌రెడ్డి సూచించారు. మూసీ మురికి కంపు పక్కన ఉండటానికి ఎవరైనా ఇష్టపడుతారా..? కేటీఆర్, హరీశ్‌రావులు లాంటి వారు ఫామ్‌హౌస్‌లు కట్టుకుని విలాసవంతంగా బతకాలి కానీ, పేదలకు మాత్రం ఆ మురికి కంపును అంటిస్తారా..? అని సీఎం ప్రశ్నించారు.

ఆర్థికంగా బలిసి పెద్ద భవంతు లు కట్టుకున్న వారికి మూసీ ప్రజల కష్టాలు ఏమి తెలుస్తాయన్నారు. ఈ ప్రాజెక్టు రూ. లక్షన్నర కోట్లు ఖర్చు అంటూ పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఖర్చు విషయంలో ఇప్పటికి ప్రభుత్వం నిర్ణయం తీసు కోలేదని, బీఆర్‌ఎస్ చేస్తున్న ప్రచారంలోని అంశాలన్ని పచ్చి అబద్దాలని, అక్రమ సంపాదనతో సామాజిక మాధ్యమాల్లో విష ప్రచా రం చేస్తున్నారని  సీఎం మండిపడ్డారు. 

దీపావళి అంటే మాకు చిచ్చుబుడ్లు.. వాళ్లకు సారాబుడ్లు.. 

మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు చెందిన జన్వాడ ఫామ్‌హౌస్ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ‘మాకు దీపావళి అంటే చిచ్చు బుడ్లు.. వాళ్లకు మాత్రం సారా బుడ్లు’ అని హాట్ కామెంట్ చేశారు. దీపావళి దావత్ అలా చేస్తారని తమకు తెలియదని సీఎం ఎద్దేవా చేశారు.

ఏమి చేయకపోతే రాజ్ పాకాల ఎందుకు పారిపోయారు..? ముందస్తు బెయిల్ ఎందుకు అడిగారని సీఎం నిలదీశారు. ఇంటి దావత్‌లో క్యాసినో కాయిన్స్, విదేశీ మద్యం ఎందుకని సీఎం ప్రశ్నించారు. జన్వాడ ఫామ్‌హౌస్‌లో దీపావళి దావత్ అయితే, ఇంటి ఫంక్షన్‌గానే ఉంటే క్యాసినో కాయిన్లు , విదేశీ మద్యం బాటిళ్లు పరిమితికి మించి ఎందుకు దొరికాయని ప్రశ్నించారు.

ఆదానీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చూపించాలని, పది నెలల పాలనలో ఒక్క మేజర్ టెండర్ కూడా పిలవలేదన్నారు. 

సీఎం అవ్వాలన్న నా కల నెరవేరింది.. 

సీఎం కావాలన్న నా కల నెరవేరిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ పదవి కంటే పెద్ద కలలు తనకు వేరే ఏమి లేవన్నా రు. నాది చిన్న వయస్సు.. రాజకీయంగా ఇంకా భవిష్యత్ ఉందన్నారు. అణిచివేతతో ప్రజాగ్రహాన్ని మూటగట్టుకోలేనని, అంద రి విషయంలోనూ ప్రజాస్వామ్యంగానే వ్య వహరిస్తానని స్పష్టం చేశారు.

ప్రభుత్వ వ్య వస్థలను దుర్వినియోగం చేసే అవసరం తనకు లేదని, ఆ విధానానికి తాను వ్యతిరేకమని, ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవస్థలను దుర్వినియోగం చేసే ప్రసక్తే లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇంటెలిజెన్స్ విభాగానికి గతంలో చీఫ్‌గా వ్యవహరించిన ప్రభాకర్‌రావు చాలాకాలంగా విదేశాల్లో తలదాచుకున్నారని, ఆయన పాస్‌పోర్టు ఇ టీవలనే రద్దయిందని, ఇప్పుడు ఆయన ఏ దేశంలో ఉన్నా ఇండియాకు రాక తప్పదన్నారు.

ఇదే కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్‌రావు బయటకు వస్తున్నారని చెప్పా రు. త్వరలోనే ఫోన్ ట్యాపింగ్ వివాదం కొలిక్కి వస్తుందని సీఎం చెప్పారు.  

హైడ్రాతో రియల్ ఎస్టేట్ పడిపోవడానికి సంబంధం లేదు

హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయిందనడం వాస్తవం లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దత వచ్చిందన్నారు. హైడ్రా విషయంలో ఎంతో ఆలోచించి రంగంలోకి దించామన్నారు. హైడ్రా అంటే దేశమంతా తెలిసేలా బీఆర్‌ఎస్ ప్రచారం చేసిందన్నారు.  రాజకీ యాల్లో ఎవరి స్టుల్ వారికి ఉంటుందన్నారు. నా స్టుల్ నాది.. కేటీఆర్ స్టుల్ కేటీ ఆర్‌దన్నారు.

సినిమాల్లోనూ రాజమౌళి, రాంగోపాల్ వర్మ.. ఇద్దరిది వేర్వేరు స్టయిల్ అన్నారు. ‘కేసీఆర్ రాష్ట్రాన్ని  రూ. 7.50 లక్షల కోట్ల అప్పులు చేసినా.. నేను రుణమాఫీ చేశాను. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నాం. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం.

ఫీజు రీయింబర్స్‌మెంట్ చేశాం, మూసీ కోసం  భూములిచ్చేవారికి వంద శాతం సంతృప్తి చెందేలా ప్యాకేజీ ఇస్తాం, ప్రజలను కష్టపెట్టి భూములను తీసుబోమన్నారు.  రుణమాఫీలో సాంకేతిక లోపాలు ఉన్నవి మాత్రమే ఆగాయన్నారు. మా 10 నెలల పాలనలో 50 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక రాష్ర్టం తెలంగాణ అని, టీజీపీఎస్సీ నియామకాల్లో 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకేనని సీఎం తెలిపారు. 

కేసీఆర్ ఎక్స్‌పైరీ మెడిసిన్.. 

మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎక్స్‌పైరీ మెడిసిన్, రాజకీయంగా అయన పని అయిపోయిందని  సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఏడాది తిరక్కుండానే కేసీఆర్‌ను ఫామ్‌హౌస్ నాలు గు గోడలకే పరిమితం చేశానని అన్నారు. కేసీఆర్ ఉనికి లేకుండా చేయడమే తన అభిమతమని, ఆ పని జరుగుతుందని  సీఎం అన్నారు.

తన కారణంగానే కేసీఆ ర్ బయటకు రాకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని సీఎం పేర్కొన్నారు.  ‘ఒక ఏడాదిలో కొడుకు (కేటీఆర్) చేత తండ్రి (కేసీఆర్)ని ఫినిష్ చేశాను. ఆ తర్వాత బావతో బామ్మర్దిని ఫినిష్ చేస్తా ను. ఆ తర్వాత హరీశ్‌రావును ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు’ అని సీఎం పేర్కొన్నారు.

దర్యాప్తు సంస్థల నివేదిక ఆధారంగానే చర్యలు.. 

గత ప్రభుత్వ హయాంలో చేసిన ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కొనసాగుతోంద ని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. విచారణ విషయంలో కక్ష సాధింపు ఉండదని, దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగానే చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. రాజకీయంగా నష్టం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రజలకు చేయాలనుకున్న మేలు చేసిన తీరుతామన్నారు.

తమ ప్రభుత్వం అభివృద్ధిపైనే ఫోకస్ పెట్టిందన్నారు. ‘నేను కోరుకున్నది ప్రజలు ఇచ్చారు.. ఇప్పుడు వారు కోరుకున్నది నేను ఇవ్వాలి’ అని సీఎం వ్యాఖ్యానించారు. యంగ్ ఇండి యా తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా  ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీలను నిర్మిస్తున్నామన్నారు.

తెలంగాణకు అనేక పరిశ్రమలు ముందుకొస్తున్నాయని, రాష్ట్రంలో నిరుద్యోగులక, పట్టభద్రులకు శిక్షణ కల్పించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించడానికే  ప్రభుత్వం చొరవ తీసుకున్నదని తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నదో త్వరలోనే బయటపెడుతానని హెచ్చరించారు.