18-04-2025 12:21:17 PM
హైదరాబాద్: ఈఏపీసెట్(EAPCET Exams) పరీక్షల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఈ నెల 29 నుంచి మే 4వ తేదీ వరకు ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 29,30 తేదీల్లో అగ్రికల్చర్(Agriculture), ఫార్మా ప్రవేశ పరీక్ష, మే 2 నుంచి 4 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. రోజు రెండు సెషన్లలో ఈఏపీసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 16 ప్రాంతాల్లో 124 కేంద్రాల్లో ఈఏపీ సెట్ పరీక్షలు జరగనున్నాయి. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు 2,19,420 మంది హాజరు కానున్నారు.
అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షకు 86,101 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఈ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించమని తెలిపారు. రేపటి నుంచి అగ్రికల్చర్, ఫార్మసీ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇంజినీరింగ్ విభాగానికి ఈ నెల 22 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ విభాగానికి హైదరాబాద్ జోన్ 3లో అధికంగా 50,149 మంది నమోదు చేసుకోగా, నిజామాబాద్ జోన్ లో అత్యల్పంగా 1,650 మంది పరీక్ష రాసేందుకు నమోదు చేసుకున్నారని జేఎన్‌టీయూ అధికారులు వెల్లడించారు.