తెలంగాణ పిండి వంటల్లో సర్వప్ప చాలా ఫేమస్. ఒక్కో ప్రాంతంలో ఒక్కోవిధంగా తయారుచేస్తారు. కొన్ని ప్రాంతాల్లో గిన్నెప్ప, తపాలా చెక్క అని కూడా పిలుస్తుంటారు. పేర్లు వేరైనా రుచి మాత్రం చాలా బాగుంటుంది. తెలంగాణలో సర్వప్పల తయారీవిధానం ఏయే ప్రాంతాల్లో ఏవిధంగా తయారుచేస్తారు? ఎలా చేస్తారు? తెలుసుకుందాం...
ఆన్యపుకాయ ఫ్లేవర్‌తో..
కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి- రెండు కప్పులు, పచ్చిమిర్చి-మూడు, ఆన్యపుకాయ-ఒకటి, నువ్వులు-సగం కప్పు, శనగ పప్పు-కొద్దిగా, ఉల్లిగడ్డలు-రెండు, కరివేపాకు-రెండు రెమ్మలు, ఉప్పు-రుచికి తగినంత, నూనె-సరిపడా.
తయారీ విధానం: సర్వపిండి తయారు చేసుకోవడానికి ముందుగా ఉల్లిపాయ, నువ్వులు, పచ్చిమిర్చి, కరివేపాకు, శనగపప్పును మిక్సీలో కచ్చపచ్చగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆన్యపుకాయను తురుముకొని దాంట్లోనే బియ్యం పిండి-, ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని కలిపి ముద్దగా తయారు చేసుకోవాలి.
ఈ ముద్దను ప్యాన్ పై చపాతిలా సన్నగా ఒత్తి.. మధ్య మధ్యలో చిన్నచిన్న రంధ్రాలు చేసి.. దాంట్లో నూనె పోసి పది నిమిషాలు సిమ్‌లోనే మగ్గనివ్వాలి. లేత ఎరుపు వచ్చాక దించేస్తే సరి. ముఖ్యంగా నీళ్లకు బదులుగా.. ఆన్యపుకాయ ను వాడితే రుచి చాలా బాగుంటుంది. ఇది మన తెలంగాణస్పెషల్ కూడా.
- సంగీత, ఎంసీఏ
హైదరాబాద్, తార్నాక
ఇలా చేస్తేనే రుచి అద్భుతం!
కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి-మూడు కప్పులు, నువ్వులు- సగం కప్పు, జీలకర్ర-సగం చెంచా, పల్లీలు-సగం చెంచా, కొత్తిమీర-తురుము కొద్దిగా, ఉల్లిపాయ-ఒకటి, కరివేపాకు-రెండు రెమ్మలు, పచ్చిమిర్చి-మూడు, ధనియాలు-సగం కప్పు, ఉప్పు-రుచికి తగినంత, నూనె-వేయించడానికి సరిపడా.
తయారీ విధానం: ముందుగా పచ్చిమిర్చి, కొత్తిమీర, పల్లీలు, జీలకర్ర, కరివేపాకు రెమ్మలు, ధనియాలను మిక్సి జార్‌లో మెత్తగా కాకుండా కచ్చపచ్చగా క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బియ్యం పిండిలో కొన్ని నీళ్లు, ముందుగా క్రష్ చేసుకున్న మిశ్రమాలను గోధుమ పిండిలా కలుపుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న దాన్ని మందపాటి పాత్రపై పూరీలా ఒత్తుకొని.. మధ్య మధ్యలో రంధ్రాలు పెట్టుకొని దాంట్లో నూనె పోసుకోవాలి. ఇలా ఒక 15 నిమిషాల పాటు సిమ్‌లో ఉంచితే సర్వ పిండి సిద్ధం అవుతుంది. కొంతమంది నూనెలో డీ ఫ్రై చేస్తారు.. అలా కాకుండా ఇలా పాత్రపై ఎరుపు రంగు వచ్చేవరకు మగ్గిస్తే సర్వపిండి రుచి అద్భుతంగా ఉంటుంది.
రేవతి, వరంగల్
తక్కువ నూనె.. ఎక్కువ రుచి
కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి- నాలుగు కప్పులు, శనగ పప్పు-ఒక చెంచా, నువ్వులు-రెండు చెంచాలు, జిలకర-ఒక చెంచా, పచ్చి మిర్చి-మూడు, అల్లం వెల్లుల్లి-సగం చెంచా, కొత్తిమీర-కొద్దిగా, ఉప్పు-తగినంత, పల్లీలు-సగం కప్పు, నూనె-వేయించడానికి సరిపడా.
తయారీ విధానం: మొదటిగా పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి రేకులు, కొత్తిమీర, ఉప్పు తీసుకుని మెత్తగా పేస్ట్ చేయాలి. బియ్యం పిండి, నువ్వులు, నానబెట్టిన శనగ పప్పు, జిలకర, పేస్ట్ (పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఉప్పు, కొత్తిమీర) ఒక గిన్నెలో తీసుకోండి. బాగా కలపాలి. వేడీ నీరు పోసి పిండిని బాగా కలపాలి.
అవసరమైతే పిండి మెత్తగా ఉండటానికి కొద్దిగా నీరు కలపండి. పిండిని 4 లేదా 5 ముద్దలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నాన్ స్టిక్ పాన్ తీసుకోండి. అందులో పిండి వేసి, దానికి తగ్గట్టుగా నూనె పోసి చేత్తో ఒత్తాలి. కొద్ది నిమిషాల తర్వాత వేడి వేడి సర్వప్పలు రెడీ అవుతాయి.
ఎం మమత,
రుక్మాపూర్, కరీంనగర్
కారం సర్వప్ప
కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి--ఒక కప్పు, కొత్తిమీరు తురుము-తగినంత, కరివేపాకు, తగినంత కారం, సన్నటి ఉల్లిపాయలు, ఉప్పు - రుచికి సరిపడా, నానబెట్టిన శెనగపప్పు, (తయారీ విధానంబట్టి) నువ్వులు, సరిపడ వెల్లుల్లి, - ధనియాలు, జిలకర, నూనె
తయారీ విధానం: ఒక గిన్నె లేదా బాండీ తీసుకోవాలి. దానిలో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుము, కరివేపాకులు, కారం, నువ్వులు, శనగపప్పు, వేయించిన పల్లీలు వేసి కలపాలి. జిలకర, ధనియాలు, వెల్లుల్లి వేసి మిక్సీలో పొడి చేసుకోవాలి. ఈ పొడిని, ఉప్పుని కూడా బియ్యం పిండి మిశ్రమంలో కలపాలి. ఆ పిండిలో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి.
పిండి ముద్దని కలిపి ఓ అయిదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పైన మూత పెట్టాలి. మధ్యలో రంధ్రాలు చేసుకోవాలి. ఆ రంధ్రాల్లో కూడా నూనె వేయాలి. స్టవ్ వెలిగించి చిన్న మంట మీద ఉంచాలి. పైన మూత పెట్టాలి. బాండీ లేదా గిన్నెను తిప్పుతూ వేడి చేయాలి. పది నిమిషాల తర్వాత సర్వప్పలు రెడీ అవుతాయి.
కర్నాటి అన్నపూర్ణ, నల్లగొండ