calender_icon.png 1 November, 2024 | 8:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడిగడ్డ ఇసుకకు ఈ-వేలం

01-07-2024 12:03:46 AM

  • 92 లక్షల టన్నుల ఇసుక సేకరణకు సిద్ధం
  • నేటితో టెండర్ ప్రక్రియ పూర్తి
  • త్వరలోనే కాంట్రాక్టర్లకు రీచ్ల అప్పగింత
  • రూ.800 నుంచి రూ.1,000 కోట్ల ఆదాయం

హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 30 (విజయక్రాంతి): ఇసుక కొరత రాకుండా, రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని రీచ్లలో ఇసుకను అందుబాటులో ఉంచేలా టీజీఎండీసీ చర్యలు చేపడుతోంది. మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద దాదాపు 92 లక్షల టన్నుల ఇసుకకు ఈ వేలానికి టెండర్ ప్రక్రియ నేటితో పూర్తి కానుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 59.89 టన్నుల ఇసుక అందుబాటులో ఉండగా దీనికితోడు మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద ఇసుకను కూడా వేలం వేయాలని టీజీఎండీసీ నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 100కు పైగా ఇసుక రీచ్‌లు ఉండగా ఆయా ప్రాంతాల్లో 59 లక్షల పైచిలుకు ఇసుక లభ్యం అవుతోంది.

ఈ నేపథ్యంలోనే కొత్తగా కాళేశ్వరంలోని మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద సుమారుగా 92 లక్షల టన్నుల ఇసుక (14 బ్లాక్‌లో) అందుబాటులో ఉండడంతో దానికి టీజీఎండీసీ అధికారులు ఈ వేలం నిర్వహిస్తున్నారు. త్వరలో టెండర్లను ఖరారు చేసి కాంట్రాక్టర్లకు రీచ్‌లను అప్పగిస్తామని అధికారులు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ కుడివైపున మహదేవ్‌పూర్ మండలంలో సూరారం నుంచి బ్రాహ్మణపల్లిలోని బ్లాక్‌లో 15.52 లక్షల టన్నులు, ఎల్కేశ్వరంలోని బ్రాహ్మణపల్లి బ్లాక్‌లో 5.98 లక్షల టన్నులు, ఎల్కేశ్వరంలోని మహదేవపూర్ బ్లాక్‌లో 5.98 లక్షల టన్నులు, బొమ్మాపూర్ మహదేవపూర్ బ్లాక్‌లో 3.62 లక్షల టన్నుల ఇసుకకు ఈ ద్వారా వేలం నిర్వహిస్తున్నారు. దీని ద్వారా సుమారుగా రూ.800 కోట్ల నుంచి రూ.1,000 కోట్ల ఆదాయం వస్తుందని టీజీఎండీసీ అంచనా వేస్తోంది. 

ములుగు జిల్లాలో 30 రీచ్‌లు

  • ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెంలో 7 ఇసుక రీచ్‌లు ఉండగా అక్కడ 3.82 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉందని టీజీఎండీసీ అధికారులు తెలిపారు. ఇక జయశంకర్ భూపాలపల్లిలో 18 ఇసుక రీచ్‌లు ఉండగా అక్కడ 11.11 లక్షల టన్నులు, జోగులాంబ గద్వాల్‌లో రెండు రీచ్‌ల్లో  53 వేల టన్నులు, కామారెడ్డిలో మూడు రీచ్‌ల్లో 48 వేల టన్నులు, కరీంనగర్‌లోని 14 రీచ్‌ల్లో 7.22 లక్షల టన్నులు, ఖమ్మంలో ఒక రీచ్‌లో 1,618.92 టన్నులు, మహబూబాబాద్‌లో ఒక రీచ్‌లో 12,729.28 టన్నులు, మంచిర్యాలలో 4 రీచ్‌ల్లో 5.91 లక్షల టన్నులు, మేడ్చల్‌లో ఒక రీచ్‌లో 10,548 టన్నులు, ములుగులో 30 రీచ్‌ల్లో 24.30 లక్షల టన్నులు, నల్లగొండలో రెండు రీచ్‌ల్లో 1.35 లక్షల టన్నులు, పెద్దపల్లిలో 22 రీచ్‌లో 4.75 లక్షల టన్నులు, రంగారెడ్డిలో రెండు రీచ్‌ల్లో 13,942 టన్నుల ఇసుక అందుబాటులో ఉందని టీజీఎండీసీ తెలిపింది. మొత్తం అన్ని రీచ్‌ల్లో కలిపి 59.89 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉందని పేర్కొంది. 
  • సన్న ఇసుకకు డిమాండ్ 
  • సన్న ఇసుకకు ఎక్కువగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆయా రీచ్‌ల్లో ఇసుకను అందుబాటులో ఉండేలా టీజీఎండీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 100కు పైగా ఇసుక రీచ్‌లు ఉండగా అందులో ములుగులో 30, జయశంకర్ భూపాలపల్లిలో 18, పెద్దపల్లిలో 22, భద్రాద్రి కొత్తగూడెంలో 7, కరీంనగర్‌లో 14 ఉన్నాయి. వీటిల్లో ఎక్కువగా సన్న ఇసుక దొరుకుతుండటంతో నిర్మాణ సంస్థలతో పాటు వ్యాపారులు వీటివైపే మొగ్గు చూపుతున్నారు.