calender_icon.png 29 October, 2024 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్నగిల్లుతున్న ఆశలు

29-10-2024 01:28:32 AM

  1. కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం ధాన్యంపై కొర్రీలు
  2. బోనస్‌పై కూడా అన్నదాతల్లో సందిగ్ధం
  3. దళారులకు విక్రయించేందుకే మొగ్గు!

మెదక్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి మద్దతు ధరకు అదనంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్ ప్రకటించినప్పటికీ రైతుల స్పందన అంతంత మాత్రంగానే ఉంది.

ఇప్పటికే గ్రామాల్లో ప్రారంభమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు అధికంగా దొడ్డు రకం ధాన్యం మాత్రమే తరలిస్తున్నారు. సన్న రకానికి బోనస్ ఇస్తామని ప్రకటించినప్పటికీ అది లభిస్తుందా? అనే సందిగ్ధం నడుమ అన్నదాతలు సన్నరకానికి తక్కువ ధర అయినా దళారులనే ఆశ్రయిస్తున్నారు. 

పరీక్షలతో అయోమయం..

రాష్ట్రంలో సాగుచేసిన 23 సన్న రకాలకు మాత్రమే బోనస్ అందించనున్నట్లు ప్రభు త్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో సన్నరకం కొనుగోళ్ల నిర్ణయాధికారం వ్యవసాయశాఖ విస్తరణాధికారులకు అప్పగించి వారికి హైడ్రో మీటర్లు అందించి ప్రత్యేక శిక్షణనిచ్చారు. 17 శాతం తేమ కంటే తక్కువ ఉం దని నిర్ణయించుకున్న తర్వాత పది వేర్వేరు ప్రదేశాల్లో ధాన్యం సేకరించి పై పొట్టు తొలగించాలి.

వాటిలో నుంచి పది బియ్యపు గింజలు సేకరించి వాటిని ఒక్కొక్కటిగా హైడ్రో మీటర్‌లో వేసి పరీక్షించాలి. బియ్యపు గింజ పొడవు 6 మి.మీటర్లు, వెడల్పు 2.మి.మీ కంటే తక్కువగా ఉన్న వాటిని లెక్కించి పదింటిలో కనీసం ఆరు గింజల పైబడి సరియైన కొలతల్లో ఉంటే సన్నరకం ధాన్యంగా ధ్రువీకరిస్తారు.

ఇలా నిర్ణయిస్తేనే ప్రకటించిన అదనపు బోనస్ అందుతుంది. అయితే ధాన్యం మిల్లులకు చేరిన తర్వాత బోనస్ ప్రత్యేకంగా అందిస్తారా ? మొత్తం ఒకేసారి జమ చేస్తారా? అనే విషయంపై కర్షకుల్లో సందిగ్ధం నెలకొంది. 

రెండు లక్షల మెట్రిక్ టన్నులకు పైగా దిగుబడి..

వ్యవసాయాధికారుల అంచనా మేరకు మెదక్ జిల్లాలో సన్నరకం ధాన్యం 1,04,970 ఎకర్లాలో సాగు చేయగా దిగుబడి 2,30,964 మెట్రిక్ టన్నులు అంచనా వేస్తున్నారు. ఇందులో సగభాగమైనా కొనుగోలు కేంద్రాలకు తరలిస్తారా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండింతలు అధికంగా 1,92,365 ఎకరాల్లో దొడ్డు రకం సాగు చేయగా 5,19,000 మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వేస్తన్నందున అధిక మొత్తంలో వచ్చే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

ప్రారంభించని కొనుగోళ్లు..

జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించనే లేదు. వెల్దుర్తి మండలంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించి 20 రోజులకు పైగా అవుతున్నా ఇప్పటికీ కొనుగోళ్లు ప్రారంభించలేదు. 

ప్రైవేట్‌కు తరలింపు..

సన్నాల కొనుగోళ్లకు మండల విస్తరణాధికారులు అందుబాటులో ఉండాలి. 5వేల ఎకరాలకు ఒక విస్తరణాధికారి ఉండాల్సి ఉంటుంది. జిల్లాలో మొత్తం 76 మందికి గాను 68 మంది మాత్రమే రెగ్యులర్ ఏ ఈవోలు అందుబాటులో ఉన్నారు. వీరిలో కొందరు సెలవులో ఉండ టం, మిగిలిన వారు ఇతర జిల్లాల్లోని విస్తరణాధికారులను విధుల నుంచి తొలగించడంతో ఆందోళన చెందుతున్నారు.

ఈ క్రమంలో సన్నాలు కేం ద్రాలకు తరలించినా, ధ్రువీకరణ ఆలస్యం కావడంతో రైతుల ఆసక్తి సన్నగిల్లుతోంది. దీంతో ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు. బోనస్ ప్రకారం అయితే రూ.2,800 లభిస్తుండగా, ప్రైవేట్ మార్కెట్‌లో రూ. 2400 నుంచి రూ.2500 వరకు లభిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. 

ధాన్యం మొలకలెత్తుతున్నాయి

కొనుగోలు కేంద్రం ప్రారంభించాక ధాన్యం తీసుకొచ్చాం. 20 రోజులైంది ఇప్పటికీ కొనుగోళ్లు చేయడం లేదు. వర్షం పడటంతో ధాన్యం మొలకలెత్తాయి. అధికారులు తేమ, పరీక్షలు అంటూ కాలయాపన చేస్తున్నారు. మమ్మల్ని ఆదుకునేవారు లేరు. 

  నర్సింహులు, రైతు, వెల్దుర్తి