11-12-2024 12:46:50 AM
కామారెడ్డి, డిసెంబర్ 10 (విజయక్రాం తి): బ్యాంకు నుంచి మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలకు నెల నెలా కిస్తీలు చెల్లిస్తున్నా.. ఆ డబ్బులు డీఆర్‌డీఏ , ఐకేపీ సిబ్బంది బ్యాంక్‌లలో జమ చేయకుండా సొంతానికి వాడుకున్నారు. రుణాలు చెల్లించడం లేదని బ్యాంకు అధికారులు మహిళా సంఘాలను ప్రశ్నించడంతో అస లు విషయం బయటపడింది. కామారెడ్డి జిల్లాలోని భిక్కనూర్, తాడ్వాయి, కామారెడ్డి, లింగంపేట్, పిట్లం, జుక్కల్, మాచారెడ్డి, పోతంగల్, నస్రూల్లాబాద్, మద్నూర్, బిచ్కుంద, దోమకొండ మండలాల్లోని గ్రామాల్లో మహిళా సంఘాలు బ్యాంక్‌ల ద్వారా స్త్రీ శక్తి రుణాలను తీసుకుని వాయిదాల ప్రకారం ఐకేపీ సిబ్బందికి చెల్లించారు.
వారు బ్యాంక్‌లో జమ చేయకుండా సొంతానికి వాడుకున్నారు. ఈ విషయం బయటప డిన తర్వాత మహిళలు ఐకేపీ పీడీకి, డీపీఎంలకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు. రికవరీ చేయిస్తామని చెప్పి చేతులు దులుపుకున్నారు. కానీ ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా బ్యాంకుల్లో జమ చేయించలేదు. మహిళ సంఘాల పేరు మీద తీసుకున్న రుణాలకు వడ్డీలను మాత్రం జమ చేస్తున్నారు. సకాలంలో బ్యాంకులలో చెల్లించకపోవడంతో చక్రవడ్డీలను బారు వడ్డీలు వేసి మహిళలను ఆందోళనకు గురి చేస్తున్నారు.
జిల్లా కలెక్టర్ స్పందించి డ్వాక్రా మహిళల గ్రూప్‌లపై పర్యవేక్షించాల్సిన ఏపీఎంలు, సీసీలు,వీవోఏలు, డీపీఎంలు నిర్లక్ష్యం వల్లనే పెద్ద మొత్తంలో డబ్బులు కాజేశారు. ఇన్ని డబ్బు లు కాజేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేయడంలో అంతర్యం ఏమిటోనని ప్రశ్నిస్తున్నారు. తాము రోజు వారిగా కూలీ పనులు చేసి సంపాదించిన కూలీ డబ్బులను నెల నెల వాయిదా రూపంలో చెల్లిస్తే వాటిని సీసీ లు, వీవోలు కాజేసి ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికా రులు మాత్రం రుణాలకు సంబంధించిన డబ్బులను కాజేసిన సిబ్బందిపై మాత్రం ఆర్ ఆర్ యాక్ట్ పెట్టి వారి ఆస్తులను ఆటాచ్ చేసి వాటిని అమ్మి బ్యాంకుల్లో కట్టాల్సిన డబ్బులను కట్టించాలని మహిళలు కోరుతున్నారు.
అధికారులతో కుమ్మక్కు?
అధికారులతో కుమ్మక్కై డబ్బులు కాజేసిన సిబ్బంది పర్సెంటీజీలు ఇవ్వడంతోనే వారిపై చర్యలు తీసుకోవడానికి పీడీ అధికారులు వెనుకంజ వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనంతటికి కారణం కేవలం డీఆర్‌డీఏ శాఖ అధికారుల అసమర్థత, అవినీతి, కారణమేనని తెలుస్తున్నది. ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ నిందితులపై చర్యలు తీసుకోవాలని మహళలు కోరుతున్నారు. లేదంటే తాము నష్టపోతామని, తమ ఆస్తులను అటాచ్ చేసే అవకాశలు ఉన్నాయని వాపోతున్నారు.