11-04-2025 06:49:49 PM
బిఆర్.అంబేద్కర్, జ్యోతిరావు పూలే కృషి ఫలితంగానే రాజ్యాంగ ఫలాలు..
జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డి.ఇందిర..
హన్వాడ: భారత రాజ్యాంగంలోని చట్టాల ప్రకారం హక్కులు ఎంత ముఖ్యమో విధులు సైతం అంతే ముఖ్యమని, ఇవి ప్రతి పౌరుడికి వర్తిస్తాయని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డి.ఇందిర అన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రిన్సిపాల్ జడ్జి బీ పాపిరెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం హన్వాడ మండల పరిధిలోని పల్లెమోని కాలనీ గ్రామపంచాయతీలో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులకు, విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కేలా కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
దూర దృష్టితో మహనీయులు సమాజ శ్రేయస్సు కోసం కృషి చేశారని, వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రాథమిక హక్కులు, విధుల పట్ల బాధ్యతగా మెలగాలని సూచించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నిర్మూలన, మానవ అక్రమ రవాణా అరికట్టడం, వెట్టి చాకిరి విముక్తి వంటి చర్యలపై జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పిల్లలను ఎవరు పనిలో పెట్టుకోవద్దని, బాల్య వివాహాలు చేస్తే శిక్షార్హులు అవుతారని సూచించారు.
తల్లిదండ్రులు బాల్య వివాహాలు చేసేందుకు ప్రయత్నిస్తే తమకు గాని, చైల్డ్ లైన్ 1098 నెంబర్ కు గాని ఫోన్ చేసి వెంటనే సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. బాలల హక్కులు, రక్షణ, సంరక్షణ విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కృష్ణా నాయక్, ఎంపీడీవో యశోదమ్మ, పాఠశాల ప్రిన్సిపాల్ స్రవంతి రెడ్డి, పారా లీగల్ వాలంటీర్ పి.యాదయ్య, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.