09-02-2025 12:47:35 AM
మలక్‌పేట్ సర్కిల్‌లో 12 చోట్ల ఏర్పాటు
చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి ౮ (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచేందుకు, చెత్త రహితంగా తీర్చిదిద్దేందుకు 4 ఏళ్లుగా జీహెచ్‌ఎం సీ చేపట్టిన కృషి ఫలించలేదు. గ్రేటర్‌లో దాదాపు 1200 లకు పైగా గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ ఉన్నట్టుగా బల్దియానే అధికారికంగా గుర్తించింది.
గ్రేటర్‌లో కొన్నాళ్లుగా చెత్త కుప్పలు ఎక్కడి పడితే అక్కడ దర్శనం ఇవ్వడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జీహెచ్‌ఎంసీకి కమిషనర్లు మారుతున్నా నగరంలోని చెత్త సమస్య తీరకపోవడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. గ్రేటర్‌లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండేలా ప్రస్తుత కమిషనర్ ఇలంబర్తి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు.
గతానికంటే భిన్నంగా డస్ట్‌బిన్స్‌కు సెన్సార్ ఏర్పాటు చేసి బిన్ నిండగానే తొలగించేలా ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా మలక్‌పేట్ సర్కిల్‌లో ప్రయోగాత్మకంగా 12 సెన్సార్ డస్ట్ బిన్‌లను ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే.. సెన్సార్ డస్ట్‌బిన్‌లను గ్రేటర్ వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నారు.
గ్రేటర్‌లో నిరంతర సమస్యగా
గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతిరోజూ 7 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. అందుకు రాంకీ సంస్థకు జీహెచ్‌ఎంసీ కోట్లాది రూపాయలు చెల్లిస్తుంది. గ్రేటర్‌లో దాదాపు 4500 స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటి చెత్త నిల్వల సేకరణ జరుగుతుంటుంది.గ్రేటర్‌లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండేందుకు జీహెచ్‌ఎంసీ ఇప్పటికే అనేక ప్రయోగాలు చేసినా ఫలితం లేకుండా పోతుంది.
దీంతో నగరంలో ఎక్కడ చూసినా చెత్త నిల్వలు కన్పిస్తున్నాయి. గ్రేటర్‌లో 150 డివిజన్ల వ్యాప్తంగా గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ (జీవీపీ) ఉన్నటు జీహెచ్‌ఎంసీ అధికారికంగా పేర్కొంది. దీంతో గ్రేటర్ లో చెత్త నిల్వలు లేకుండా చేయడమనేది బల్దియాకు సవాల్‌గా మారుతోంది.